Friday, February 28, 2020

AKHANDA MANDALAKARAM-VYAAPTAM YENA CHARACHARAM

 అఖండ మండలాకారం-వ్యాప్తమ్యేన చరాచరం.
 ************************************************

  ఆద్యంతరహితమైన తత్త్వానికి సంకేతము మండలం.ఒక తేజో బిందువు విస్తరించి పెద్దగా వృత్తాకారములో గోచరమయితే అది మణ్డలము.అనంతత్త్వానికి ప్రతీక.

   ఈ సృష్టి ఆవిర్భవించక ముందున్న పరంజ్యోతియే సృష్టి ఆవిర్భావం జరిగినపుడు సూర్య మండలం గా భాసిస్తోందని ఆర్యోక్తి.

  సమూహములతో నిండినది అని మనము మండల శబ్దమును అన్వయించుకుంటే,ఆదిత్యులు,అప్సరసలు,మునులు,గ్రామణులు,యాతుధాన్యులు,గంధర్వులు,సర్పములు,వాలిఖ్యాది మునులు మొదలగు గణములతో సంసేవింపబడుచున్న అనంత తేజోరాశి,ఉత్తరాయణ పుణ్యకాలమున సంపూర్ణ మండల భాతితో లోకపాలన చేస్తుంది.

  అంతటా వ్యాపిస్తూ దేనికి అంటని వాడు ఆ మండలములోని పరంజ్యోతి.స్వయం ప్రకాశకత్వము-సృష్టి-స్థితి-లయకారకత్వమును కలిగిన దివ్య తేజము.సూర్యుడంతేనే జాగ్రదావస్థ.సకల చరాచరములు చతనత్వమును పొందకలుగుటకు కారణమైనది ఆ మండల ద్వారము గుండా ప్రసరించుచున్న దివ్య కిరణములు.కనుకనే

 " రశ్మిమంతం-సముద్యంతం" గా సంకీర్తింపబడుతున్నది.

   సూర్య మండలము ఆనందమయము-విజ్ఞాన మయము-యజ్ఞమయము.

  సూర్యుడు యజ్ఞ స్వరూపుడు.యజ్ఞములకు వినియోగించే వేదములు-వేదములలో దాగిన సత్కర్మలు-సత్ఫలితములు అన్నీ సుర్యకరుణయే.నిరంతర యజ్ఞ కుండము సూర్య మండలము.పదార్థము ఒక రూపము నుండి వేరొక రూపమునకు మారుచుండుటయే యజ్ఞము.


  విజ్ఞాన మయము సూర్య మండలము.ఋఇగ్వేదము సూర్య మండలము.మండల పురుషుడు యజుర్వేదము.సూర్య కిరణములు సామవేదము.త్రయీమూర్తియే పరమాత్మ.సకల జగములను నిర్వర్తింపచేయ గలుగు ఒజో మండలము అలసత్వము లేని క్రియాశీలత్వము కలది.

  గాయత్రీమంత్ర స్వరూపమూ సూర్య మండలము.భూలోక సువర్లోక మహర్లోకములను తన కాంతులతో చైతన్యవంతము చేయ గలుగు చిత్స్వరూపము.

 అన్నమయ-ఆనంద మయ కోశములు సూర్య కాంతుల పై ఆధారపడినవే.సూర్యుడు తన కిరణములను ఆ యా ఋతు ధర్మములను అనుసరిస్తూ భూమిపై ప్రసరింప చేస్తూ,అన్న ప్రదాతగా అర్ఘ్యములను అందుకుంటున్నాడు.అర్పించినవారిని ధన్యులను చేస్తున్నాడు.అవిరామముగా ఆనంద కిరణములతో కప్పివేయబడిన (కోశములను) విప్పుచున్నాడు.


 ఋతుకర్త యైన సూర్య భగవానుడు పన్నెండు రాశులలో సంవత్సర కాలము ఒక్కో రీతి కాంతితో,గమన వర్గముతో ఒక్కూక్క రకమైన కిరణములను ప్రసరింప చేస్తూ ,ప్రాణ స్వరూపమే అగ్ని స్వరూపమై ,జల స్వరూపమై,వాయు స్వరూపమై పంచభూత తత్త్వమును నిర్వహిస్తుంటాడు.

 అగ్ని సోమాత్మకమైన పరంజ్యోతి తాను ప్రకటించిన జగత్తును పాలిస్తాడు.తపింప చేస్తాడు.వర్షింప చేస్తాడు.జ్ఞానమును అనుగ్రహిస్తాడు.ఆదిత్యుని నివాసము మండలాంతర్భాగమే కాదు మనలోను సర్వకాల సర్వావస్థల లోను సమగ్ర వీక్షణ శక్తితో సాక్షిగా ఉంటాడు.

 సూర్య మండలాంతరమైన దివ్య తేజస్సును మన చర్మ చక్షువులు సామాన్య దృష్టితో చూడలేవు.నిర్దేశింపబడిన సూర్య తేజస్సునకు దగ్గరగా వెళ్ళినా/దూరముగా జరిగినా ప్రమాదకరమే.

 మయూరకవి,సాంబుడు,యాజ్ఞ వల్క్యుడు,అప్పయ్య దీక్షితులు మొదలగు మహానుభావులు సూర్యానుగ్రహమును పొంది,ధన్యులైనారు.

  అట్టి కర్మ సాక్షికి,ప్రత్యక్ష దైవమునకు మనసును సమర్పించుటయే మన కర్తవ్యము.అహంకారమును తొలగించుకొని,అంతా నీవే-అంతా నీదే అంటూ "అజాయమానే బహుధా విజాయతే " ని భావనా బలముతో శరణు వేడుదాము.

  " యన్మండలం వేదవిదోప గీతం
    తత్సర్వ వేద్యం ప్రణమామి సూర్యం."

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...