ద్వాదశాత్మన్ నమోస్తుతే
**********************
"బృహత్వాత్-బృమ్హణత్వాత్ ఇతి బ్రహ్మ."అన్నింటికంటె ఏదిఉత్కృష్టమైనదో అది,బృహతి.బృమ్హణము అంటే వ్యాపకత్వము.ఏది అన్నిటికంటె మహోత్కృష్టమైనదో,ఏది అన్నింటియందు వ్యాపించి యుందో అదియే "బ్రహ్మము." వేదము ఆదిత్యుని బ్రహ్మముగా కీర్తిస్తుంది.సర్వజీవుల యందలి ఆత్మయే బ్రహ్మము.అది జగతఃస్థుషః -తాను కదలకుండ ఉంటూ అన్నింటిని కదిలించే శక్తి గల స్థావర-జంగమాత్మకము.
ప్రత్యక్ష పరంజ్యోతి ఏడాది పొడవునా ఒకతే స్వరూప-స్వభావాలతో వెలుగులు-వేడి వెదజల్లుతుంటే మనము తట్టుకోగలమా? అసలు ఆ ఊహనే అమ్మో? మన పొట్ట నింపుకోగలమా?విద్య పై పట్టు సాధించగలమా?వైద్యరంగపు మెట్లు ఎక్కగలమా?కొన్ని రోజులు చిగురులు-మరి కొన్ని రోజులు గుబురులు.కొన్ని రోజులు ఎండలు-మరి కొన్ని రోజులు వానలు.కొన్ని రోజులు వెన్నెల-మరి కొన్నిరోజులు శిశిరము.కొన్ని జీవులు పుట్టుట-మరి కొన్ని జీవులు గిట్టుట.కొంత మందికి బాల్యము-మరి కొంత మందికి భారము.ఇవన్నీ కలిగించటానికే " ఏకం సత్ విప్రా బహుదా వదంతే" అన్నట్లు పన్నెడు రాశులలో పన్నెండు రూప -గుణములతో,తన నుండి ప్రకటింప బడిన ఆరు శక్తులతో కలిసి,ఆరగింపులను అందిస్తున్నాడు తన అవ్యాజ కరుణతో.
సౌరశక్తులు సొబగులు దిద్దుకొని మనకు కానుకలను అందించుటకు కదులు సమయమున జరుగు బ్రహ్మాడోత్సవము(బ్రహ్మోత్సవము) బహు ప్రశంసనీయము.సకల కళల సమ్మోహనం.యక్షులు రథ పగ్గములను పట్టుకుని గట్టిగా లాగుతూ సాగుతుంటేగంధర్వులు మధుర గానముతో,అప్సరసలు నాట్యాభినయనముతో అనుసరిస్తుంటారట.జల సంబంధ -లలితకళ సంబంధ శక్తులు వీరు.యక్షులు-రాక్షసులు మన రక్షణార్థము స్వామి రథమునకు కట్టిన తాళ్ళను గట్టిగా పట్టుకుని,గుట్టుగా మురిసిపోతుంటారట.వాలిఖ్యాది మునులు లాంఛనప్రాయముగా స్వామికి దారిని చూస్తూ,పరవశిస్తుంటారట.జగత్కళ్యాణ జగన్నాథుని సేవాసందర్శనాసక్తుల మనోభీష్టము నెరవేరు గాక.
చాంద్రమాన ప్రకారము చైత్రము నుండి ఫాల్గుణము వరకు ప్రస్తావింపబడిన పన్నెండు తెలుగు నెలలు,సౌరమాన ప్రకారముగా,
1.మధుమాసము,
2.మాధవ మాసము,
3.శుక్ర మాసము,
4.శుచి మాసము,
5.నభస్ మాసము,
6.నభస్య మాసము,
7.ఈశ మాసము,
8.ఊర్జ్య మాసము,
9.సహస్ మాసము,
10.సహస్య మాసము,
11.తపస్ మాసము
12.తపస్య మాసముగా కీర్తింపబడుతున్నవి.
అవ్యక్త రూపమును అర్థము చేసుకొనుటకు( సామాన్య మేథ)ఆలంబనగా వ్యక్త నామ రూపములను నిర్దేశిస్తూ,
పన్నెండు మాసములున్న రాశి చక్ర గమనములో,
1ధాత,
2.ఆర్యమ
3.మిత్ర,
4.వరుణ,
5.ఇంద్ర,
6.వివస్వంత,
7.త్వష్ట,
8.విష్ణు,
9.అంశుమంత్,
10.భగ,
11.పూష,
12.పర్జన్య నామములతో ప్రకాశించు పరమాత్మ ప్రణతోస్మి.
ప్రసీద మమ భాస్కర.
చాలా ఉపయోగకరమైన సమాచారం. హార్దిక ధన్యవాదములు
ReplyDeletenamaste.
ReplyDelete