Sunday, May 31, 2020

OM NAMA SIVAAYA-40

ఓం నమ: శివాయ-36
***************

తిరుగుచున్న భూమి అనే తీరులేని "రథముతో"
నారి కట్టలేని మేరుకొండ అనే" వింటితో"

చేతి నుండి జారిపోవు కోతి అనే" అస్త్రముతో"
ఎదుటిసేన కాంచలేని" ఎగుడు దిగుడు కన్నులతో"

బారెడైన కప్పలేని కరిచర్మపు " కవచముతో"
పుర్రెతప్ప మోయలేని "కుర్రదైన చేతితో"

వీరముపై నీళ్ళుజల్లు " నెత్తిమీద కుండతో"
శత్రువుల మూలమెరుగలేని "శూలముతో"

పురములు దగ్గరైన" రిపుజయ శాపమున్న వారితో"
నేనెవరో తెలుసా అంటూ నీవు" డంభముతో"

లోహ త్రిపురులను జయించి " ఆహా అనుకుంటుంటే" నేను
"బిక్కమొగము" వేసానురా! ఓ తిక్క శంకరా.


శివుని రథమునకు కుదురులేదు.వింటికి నారి కట్టుట కష్టము.బాణములకు నిలకడ లేదు.బేసి కన్నులతో గురి చూచుట సాధ్యము కాదు.చేయి బలమైనది కాదు.నీ పౌరుషమనే అగ్నిపై నెత్తిమీది గంగమ్మ నీళ్లు చల్లుతుంది.శూలమునకు పదును లేదు.మూడు పురములు దగ్గరైన ఓడిపోవుదురను శాపమున్నవారిని ఓడించానన్నది శివుని పరాక్రమము-నింద.


  సహనం నమః శివాయ-సమరం నమః శివాయ్
  త్రిపురం  నమః శివాయ-త్రిగుణం నమ: శివాయ.

  " నమో దుందుభ్యాయచ-హనన్యాయచ" రుద్ర నమకం.

  భేరి యందు శబ్దరూపమున పుట్టినవానికి,దానిని వాయించు దండనమునందు తాడన రూపమున నున్న వానికి నమస్కారములు.

 "నమో ధృష్ణవేచ ప్రమృశాయచ" శతృసైన్యముల బలాబలములను తెలుసుకొనువాడును,యుధ్ధమునందు వెనుదిరుగని వానికి నమస్కారములు.


 తారకాసురుని కుమారులైన తారకాక్షుడు-కమలాక్షుడు-విద్యుత్మాలి బ్రహ్మ గురించి ఘోర తపస్సును చేసి,బ్రహ్మచే విచిత్రమైన వరమును పొందిరి.మృత్యువును జతించుట జరుగని పని కనుక రథముకాని రథముపై,అస్త్రము కాని అస్త్రముతో తప్ప వారికి మరణము లేని వరమును పొందిరి.వారు మూడు పురములను కూడ పొంది తున్నారు.అవి బంగరు-వెండి-ఇనుముచే చేయబడినవి.అవి దగ్గరకు జరుగనంత కాలము వారికి మరణము లేదు.వారు దుష్కృత్యములతో ధర్మమునకు గ్లాని కలిగించసాగిరి.

  ధర్మ సంస్థాపనకై భూదేవిని రథముగాను,సూర్య-చంద్రులను రథచక్రములుగాను,వేదములను గుఱ్ఱములుగను
,బ్రహ్మను రథచోదకునిగను,మేరుపర్వతమును విల్లుగాను,ఆదిశేషువును నారి తాడుగాను ఏర్పరచి,నారాయణుడు తానే స్వయముగా ప్రకటించుకొని,పరమేశ్వరునితో యుధ్ధము చేయించి,త్రిపురులకు మోక్షమును ప్రసాదించెను.-స్తుతి.(శివ మహా  పురాణము)











కరుణ తప్ప కాఠిన్యము లేని శివుని పరాక్రమము మనలో త్రిగుణములైన సత్వ,రజో,తమో గుణములను జయించి శివజ్యోతిని దర్శింప చేస్తుంది.-స్తుతి.

( ఏక బిల్వం శివార్పణం ) 

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...