ఓం నమః శివాయ-52
****************
చంద్రుని అమృతధారలు ఔషధములను ఇస్తే
చమత్కారివై నేను గొప్ప వైద్యుడనంటావు
సూర్యుడు నేరుగా పత్రహరితమును అందిస్తే
సూటిగా నేనే హరికేశుడనని అంటావు
డమరుకము అనవరతము అమరనాదమును చేస్తుంటే
డాంబికముతో నేనే గొప్ప గురువునని అంటావు
గంగమ్మ జీవనదిగా జలధారలను ఇస్తే
దగాకోరువై నేనే ధాన్యరాశి నంటావు
పదములకడ ప్రమథగణము పరిచర్యలు చేస్తుంటే
పనిచేయకనే నేను పరిపాలకుడనంటావు
సొమ్మొకడిది-సోకొకడిది అన్నారు ఇదేనేమో
పక్కా మోసగాడవురా ఓ తిక్క శంకరా.
చంద్రుడు-సూర్యుడు-డమరుకము-గంగమ్మ-ప్రమథగణము కష్టపడుతుంటే,శివుడు వాటి శ్రమను ప్రస్తావించకుండా,అన్ని పనులను తానే చేస్తున్నానని గొప్పదనము తనకు ఆపాదించుకుంటాడు.-నింద.
చంద్రుడు నమః శివాయ-సూర్యుడు నమః శివాయ
ధాన్యము నమః శివాయ-ధ్యానము నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ
" నమ ఉర్వర్యాయచ ఖల్యాయచ" రుద్ర నమకం.
ధాన్యరూపమున భూమినుండి పుట్టిన రుద్రునకు నమస్కారములు.అంతేకాదు ధాన్యమును నూర్చెడి భూమిలో పశువులను కట్టుటకు పాతిన గుంజ రూపమున నున్న రుద్రునకు నమస్కారములు.సదాశివా నీ మా శ్రేయస్సుకై ధాన్యముగా మారుతావు.ఆ ధాన్యోత్పత్తికి సహకరించు సూర్యచంద్రులుగాను మారతావు.అంతే కాడు ప్రణవ స్వరూపా నీ డమరుక నాదము సర్వవేదములను సంపదలను మాపై వర్షించుట నీ అనుగ్రహమేకదా తండ్రీ.మా బాగోగులను పరిశీలిస్తు మా శారీరక-మానసిక ఆరోగ్యమునకి సర్వదా జీవమనే ఔషధమును మాపై కురిపిస్తు,వైద్యుదవై మమ్ములను శక్తివంతులను చేయుచున్న వైద్యనాధా ప్రణామములు తండ్రీ.నీవు చేయని పనిఏది-నిన్ను ప్రస్తుతించగల పలుకేది.కనుక మేము ఏ విధముగా నిన్ను స్తుతిస్తే దానిని సమగ్రముగా భావించి,మమ్ములను సంరక్షించు శివా.నమస్కారములు.-స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
No comments:
Post a Comment