Saturday, July 17, 2021

00010

 


 




  ధ్యాయేత్ ఈప్సిత సిధ్ధయేత్-10


  ***************************


  ఎవ్వనిచే జనించు అంటూనే-ఆది-అనాది -వాటి మధ్యనున్న వానిగా (కాలముగా) చెబుతూనే,సర్వము తానెయైనవాడుగా సన్నుతిస్తూనే, శరణాగతి వేడిన సహజపాండిత్య బమ్మెర పోతనకు సవినయ నమస్కారములు.





   ఈశ్వరానుగ్రహము విభూతిగా విశ్వవ్యాప్తమైన వేళ ( అది ఎప్పటినుండి ఉన్నప్పటికిని నేను గ్రహించుచున్న వేళ)


  ధ్యానము-ధ్యేయము-ధ్యాత ఒకటిగా సమగ్రమగుతున్న వేళ ,ఈప్సితము ఈశ్వరునిగా ( శివుడు అని నామరూపములతో కాదు-అనుగ్రహముగా అని) సిధ్ధించుచున్న వేళ,


  



వేరొక కోరికలకు ప్రవేశముండదు కదా.

ఉషోదయమగుచున్న వేళ చీకటి ప్రవేశించలేదు.


 సత్యము-జ్ఞానము-అనంతమైన బ్రహ్మమును

 సందర్శించుచున్నవేళ,(చర్మచక్షులతో కాకుండా),ఆత్మ సాక్షాత్కారము  మమేకమగుటకు ముందుకొచ్చినవేళ అంతా త్వమేవాహమే.తత్త్వదర్శనమే.




 నశ్వరములను తోసివేస్తూ ఐశ్వర్యమై ప్రకాశిస్తున్నది నన్ను మరింత ఆకర్షిస్తూ..


  


  భ్రమర కీటక న్యాయము వలె నా ఉపాధిలో నున్న నేను, నేను చూస్తున్న నేనుతో లీనమవాలనుకుంటున్నది.ఇన్నాళ్ళు నేను అని భ్రమించినది" అసలైన నేను తొడుగని తెలుస్తున్నది."



   కప్పుకున్న ఉపాధి తనను విప్పుకుంటున్నది.తప్పుకోవాలికద.




   ఇప్పుడు నన్ను నేను చూసుకుంటున్నాను.నా మాటలు వినగలుగుతున్నాను.స్వగతములు జరుగుచున్నాయి కాని "ఇంద్రియములతో నిమిత్తము లేకుండా.".





  వృత్తములో గిరగిర తిరుగుచున్న నేను, దానిని తిప్పుచున్న కేంద్రబిందువునైనాను.


  వానలేదు-ఎండలేదు.ఆకలి లేదు-దాహములేదు.సంతోషములేదు-విచారములేదు.సమస్థితి.

 సందేహములు లేని విదేహ విలీనస్థితి.

 స్థూలము సూక్ష్మమైనదో-సూక్ష్మము స్థూలమైనదో ఏమో వాటితో సంబంధములు లేని నిర్వికార-నిర్గుణ-నిరంజన నిస్తులమది.


శంకరభగవత్పాదుల నిర్వాణ  షట్కమును ప్రస్తుతిస్తున్నాను.


  పునరపి జననం-పునరపి మరణం

  పునరపి జనని జఠరే శయనం.


 నుండి విముక్తి నొందిన స్థితి.గతులు(నడకలు) లేని ,

 అనందో బ్రహ్మమది.అనిర్వచనీయమది.






  నేను దీనిని మోక్షమని అనలేను.ఎందుకంటే నేను ఇప్పుడు సత్యశోధనకై ముక్కుమూసుకుని యున్న ముముక్షువును కానుకదా.


   నిర్వాణము/నిర్యాణము అనలేను.ఎందుకంటే పునరావృత్తమును నేను కోరుకొనుట లేదు కదా.





  నేను స్వస్వరూపమును.


   అంటే...నువ్వేమనుకుంటున్నావని మీరడుగవచ్చును.




     నన్ను నేనుగా నాకే చూపించిన స్వస్వరూపమును.బృహత్తునకు దగ్గరైనదానిని కాను."బృహత్తులో లీనమైన సత్-చిత్తును.శాశ్వత  ప్రకాశమును"








  కేవలము ఒక్కటిగానే కీర్తింపబడుతు,కనువిప్పును కలిగించిన కైవల్యమును..




 " ఓం పూర్ణ మదః పూర్ణమిదం




  పూర్ణాత్ పూర్ణముదచ్చతే




  పూర్ణస్య పూర్ణమాదాయ





  పూర్ణమేవా విశిష్యతే"








ఓం శాంతి శాంతి శాంతిః,"


  సర్వం పరమేశ్వర పాదారవిందార్పణమస్తు.


  ప్రియ మిత్రులారా,


  నా ప్రయత్నములోని దోషములు నా అహంకారము చేసినవి.ఏమైన కించిత్ సద్విషయము కనుక ఉంటే అది పరమేశ్వర ప్రసాదము.


  నన్ను ప్రోత్సహించిన ఎన్నో విషయములను వివరించిన నా సోదరుడు

 చిరంజీవి నిమ్మగడ్డ సాయినాథుకు అనేకానేక శుభాశీస్సులు.


  తమ గుంపులో పంచుకొనుటకు అనుమతించిన నిర్వాహకులకు,ప్రోత్సహించిన మిత్రులకు పేరుపేరునా ధన్యవాదములు.


  సోదరి-నిమ్మగడ్డ సుబ్బలక్ష్మి.


    శుభం భూయాత్.






     





No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...