Sunday, November 7, 2021

ADIPATTA NAYANARU

అడిపత్త నాయనార్ **************** నాగపట్టణమునకు పరదవర్ అనగా బెస్తజాతినాయకుడు -పరమ శివభక్తుడు అడిపత్త నాయనార్.పరాశర మహర్షిచే అనుగ్రహింపబడిన వ్యాసుని తల్లియైన మత్స్యగంధి వంశమువాడు. ప్రతిరోజు చేపలు పట్టి,వానిని అమ్మి వచ్చిన ధనముతో జీవనమును సాగించుట కులవృత్తి.పట్టిన చేపలలో మొదటిదానిని(చిన్నదైన-పెద్దదైన)శివనైవేద్యముగా కడలికి తిరిగి సమర్పించుట ప్రవృత్తి. కాలాంతకుని లీలలు కాలమును ఒక్కరీతిగా గడువనీయదు కదా.కరుణ తాను కాసేపు కనుమరుగై కఠినత్వమునకు దారిచూపుతు తన పని కానిచ్చేస్తుంటుంది. మన నాయనారును క్రమక్రమముగా పరీక్షించసాగినది. పక్కనున్న బెస్తల వలలో పుష్కలముగా చేపలు.అడిపత్త వలలో మాత్రమే ఒకే ఒక చేపను చిక్కించి కాలము తన మాయా జాలము చేస్తున్నది.అడిపత్త అత్యంత భక్తిశ్రధ్ధలతో దానిని శివనైవేద్యముగా సమర్పించి,సంతుష్టాంతరంగుడై పస్తులను ఉంటూ ఏమాత్రము నొచ్చుకోకుండా వచ్చి (ప్రతిరోజు) వలవేసి,వచ్చిన దానిని స్వామికి నివేదనము చేసి వెళ్ళేవాడు. సరిలేనివాని కరుణకు సాక్ష్యముగా కఠినరూపముగా నాయనారు దరిచేరిన దారిద్ర్యము శివనైవేద్య నియమమును దూరముచేయలేకపోయినది.చింతను దగ్గరకు రానీయలేక పోయినది, ఆడిపత్తి అసలుపేరు మరుగున పడవేసి అధిక భక్తి నాయనారు అను నామము నగిషీలు చెక్కుకుని మిలమిల మెరియసాగినది.అందరినోట అందముగా తిరుగుతు తళతళలాడుతూ అధిక కాస్త అడిగా-భక్తి కాస్త పత్తిగా కొత్తరూపును దిద్దుకుని మురిసిపోతున్నది. అదును చూసి తన పరీక్షకు పదును పెట్టాడు మదన సంహారకుడు. వాని నియమమును ఏ మాత్రము కించపరచకుండా కించిత్ ఆకర్షణలతో నున్న చేపను తయారుచేస్తున్నాడు.అరిషడ్వర్గములను జయించిన అడిపత్త భక్తికి బలపరీక్ష పెట్టుటకా అన్నట్లు సువర్ణ మత్స్యమును సృష్టించుచున్నాడు.బ్రహ్మాండమునకు బదులుగా బహుపెద్దతనమును అందించాడు.పరికరమైన ఆ చేప చేసుకొనిన పుణ్యమేమో కాని పావుగా మారుటకు ప్రకాశమును ప్రకటించుచున్నది. అక్కడితో ఊరుకోక ఆ బూదిపూతలవాడు దానికి నవరత్నములను అద్దుతు మురిసిపోతున్నాడు.నవవిధభక్తులతో పోరాడుటకా అన్నట్లు ఆ అతిపెద్ద మీనము తన తళతళలతో,బెళుకులతో,కావలిసిన కార్యమునకు సిధ్ధమయి ఎదురుచూస్తున్నది.కాలాంతకుని పై తనకు గల స్వామిభక్తిని నిరూపించుకొనుటకు ,తన ఉపాధిని సార్ధకము చేసుకొనుటకు తహతహలాడుతూ వలలో పడుటకు మడుగులో దాగినది. జరుగవలసిన అద్భుతమును చూపించుటకా అన్నట్లు కాలము జరుగుతున్నది.తెల్లవారినది.తెల్లనైన మనసుతో వలను తీసుకుని చల్లనైన వానిని ఉల్లమున ధ్యానిస్తూ చేపలను పట్టుటకై రానే వచ్చాడు అడిపత్త. నిశ్చలభక్తికి నిజమైన పరీక్షపెడతా అనుకుంటున్నది నీటిలో దాగిన చేప.నీవు పెట్టే పరీక్షలో నిటలాక్షినిపై గల భక్తికి నిస్తులకీర్తిని అందిస్తానంటున్నది అడిపత్త స్థితప్రజ్ఞత్వము. రాటుతేలిన చాకచక్యముతో పోటీపడుతున్నాయి రెండు ద్వంద్వ యుధ్ధములో-నిర్ద్వందుని నిర్ణయమునకై ఎదురుచూస్తూ. కదలికలను ప్రారంభిచాయి కాగల పనికై బెస్త చేతులు.శివనామ స్మరణమును చస్తూ వలను విసిరాయి మడుగులో.పక్కనున్న బెస్తల వలలో పడుతున్నాయి లెక్కలేనన్ని మీనములు వారిని ఆనందముతో ఉక్కిరి బిక్కిరి చస్తూ. అడిపత్త వలలో మాత్రము ఆశ్చర్యముగా ఒక్కటైనను చిక్కటము లేదు వల వానిని వెక్కిరిస్తున్నాదా అన్నట్లు. అరిషడ్వర్గముల ఆటగా వాని వలలో తళుకులీనుతు తరలి వచ్చి కూర్చున్నది ఆ పెద్దచేప.ఎంతటి సుందర దేహనిర్మానము.ఏమా మొప్పల అందము.ఏమా నేత్రముల కదలికలు.చుట్టుముట్టారు చుట్టునున్న బెస్తలు ఆనందమును ఆశ్చర్యమును తట్టుకోలేక.మత్స్యమూర్తి తన కర్తవ్యముగా కన్నులవిందు చేస్తున్నాడు. అందరిలో అంకురించినది ఒకటే సందేహము.అడిపత్త నియమానుసారముగా దీనిని శివనైవేద్యము చేస్తాడా లేక తన భవసాగర పయనమునకు నావగా ఉపయోగించుకుంటాడా? అని. నీ పాద కమలసేవయు-నీ పాదార్చకులతోడి నెయ్యము-నితాంతాపార భూతదయకు నిలువెత్తు రూపమైన అడిపత్త ,నిష్కల్మష హృదయముతో దానిని శివనైవేద్యముగా సమర్పించి,వెనుదిరిగినాడు. వెన్నుబలమైన మూడుకన్నులవాడు వాని కీర్తిని ఆ చద్రతారార్కము చేస్తూ అనుగ్రహించినాడు. అడిపత్తను అనుగ్రహించిన ఆదిదేవుడు మనలనందరిని అనుగ్రహించుగాక. ఏక బిల్వం శివార్పణం

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...