Saturday, November 20, 2021

NESA NAYANAR

నేశ నాయనారు **** హరియను రెండక్షరములు హరియించును పాతకములు అంబుజనాభా హరి నీ నీ నామ మహాత్మ్యము హరిహరి పొగడంగ వశమె హరి శ్రీకృష్ణా! (నృసింహకవి) పరమాత్మ యొక్క శబ్ద స్వరూపము నామము. హనుమ రామనామ మహిమ స్వామినే ఎదిరించినది.నామికి-నామమునకు కల అభేదమును వివరించినది.పిబరే రామ రసం అంటూ ఎందరినో రామనామామృతమును గ్రోలుతూ,ధన్యులను చేసినది.శివ నామమునకు కూడా జపించిన వారిని అనుగ్రహించుటలో ఏమీ మినహాయింపు లేదు అని తెలియచేసే అనుగ్రహవీక్షణమే , నేశనాయనారు దివ్య చరితము. " పంచాక్షరీ శివ వేదేన విభాతి నిత్యం రుద్రస్తయా స్పురతి తేన చతుర్థ కాండః కాండేన తేన యజురేవ విభాతి నిత్యం ఋక్సామమధ్య మణినాచ విభాంతి వేదాః" శివా నీనామమునకు స్థానమై ,రుద్రాధ్యాయముచే తైత్తరీయ సంహిత చతుర్థకాండము మహిమాన్వితముగా ప్రకాశించుచున్నది. నేశన్-నేతగాడు/ప్రభువు అని రెండు అర్థములను మనము కనుక అన్వయించుకుంటే, శివనేశ నాయనారు కర్ణాటక రాష్ట్రకంపిలి గ్రామములో జన్మించినప్పటికిని,బాల్యములోనే వారి కుటుంబము తమిళనాడులోని కురైనాడునకు వలస వెళ్ళినది. మగ్గముపై దారములను సర్దుతూ వస్త్రములను నేయుట వృత్తి. మనముపై పంచాక్షరి నామములను దారములను సర్దుతు భక్తియను వస్త్రములను నేయుట ప్రవృత్తి. కామేశుని భక్తులకు పంచిపెట్టుటకై కౌపీనములను నేయుట , శివ భక్తులను సాక్షాత్తు శివ స్వరూపముగా దర్శిస్తూ,వారికి పంచెలు-కౌపీనములను పంచుతూ,పరమ సంతోషపడు వాడు. ఉచ్చారణమాత్రము చేతనే ముక్తిని ప్రసాదించు శబ్దరూపములేమంత్రములు. యుగధర్మములననుసరించి అనుష్ఠాన విధానములలో మార్పులు వచ్చినప్పటికిని,అనుగ్రహవిషయములలో ఎటువంటి మార్పుయును లేదు. నామమునకు-నామికిని అభేదమును గుర్తించిన ప్రతివారును నామ జపమునకు అర్హులే. పంచాక్షరి అనుష్టానము సర్వశాస్త్ర సమానము కనుకనే, "జిహ్వాగ్రే వర్తతే యత్ర సఫలం తస్య జీవనం" అన్నది ఆర్యోక్తి. అక్షరము అను శబ్దమునకు వర్ణమునకు భాషకు ఆయువుపట్టుగా కనుక అన్వయించుకుంటే అవి శివుని డమరుక ప్రసాదమే. అక్షరము అనగా న- క్షరము.నశించనిది/శాశ్వతమైనది. అదియే సత్యము-సుందరము. సత్యము-శివము-సుందరమైన పరమాత్మ శక్తి ,జగన్నాటకమునకు,జనుల/జీవుల నివాసమునకు పంచభూతములను స్థూలముగాను సూక్ష్మముగాను కల్పించిస్తున్నది.స్థూలమును ప్రపంచముగాను-సూక్ష్మమును జీవుని ఉపాధిగాను పెద్దలు భావిస్తారు.ఈ పంచభూతముల జీవునిలోని పంచేంద్రియముల అమరికతో,వానిలోని హెచ్చు-తగ్గులతో సృష్టి-స్థితి-లయ-తిరోధాన-అనుగ్రహములను పంచకృత్యములను లీలగా/అవలీలగా చేస్తుంటుంది ఆ అద్భుతశక్తి. నమో నమః. శివ పంచాక్షరిని మనము కనుక ఈ విధముగా అన్వయించుకోగలితే మన కనుల ముందర సచ్చిదానందమే సాక్షాత్కరిస్తుంది.మనచే సన్నుతింపబడుతుంది.మనకు సద్గతిని ప్రసాదిస్తుంది. జీవులచే తల్లి-తండ్రి-భార్యాపిల్లలు అను బంధములతో నటనము చేయించు శక్తి, "న" కారముగా, జీవుని నటనమునకు కావలిసిన మాయ/మోహమనే తెరచే కప్పివేయు అదేశక్తి, "మ" కారముగా, ఏ మహాశక్తి మోహ వశుడై నటించు జీవునికి నిర్హేతుక కృపతో శుభములను/శివమును ప్రసాదించు, "శి" కారముగా, తాను ఉపాధియని,తనలో దాగి వసతిని కల్పిస్తున్న శక్తిని, "వ" కారముగా, మార్కండేయుని యమపాశమ ునుండి విడిపించి ,రక్షించిన కరుణావృష్టిని, నాలుగు అక్షరములను కలుపు "య" కారముగా కనుక గుర్తించి, తన ఉపాధిలోనే కాక,సర్వత్ర వ్యాపించియున్న సాక్షిని , ఏ విధముగా నేశనాయనారు,పట్టులేని పోగులను తీసివేస్తూ,పటిమగల నూలుతో నేస్తూ,వస్త్రములను-కౌపీనములను శివభక్తులకు సవినయముగా సమర్పించి తన జన్మను చరితార్థము చేసుకొన్నాడో, అదే విధముగా మన మనసనే మగ్గమును సవరించుకొని,అరిషడ్వర్గములను పట్టులేని దారములను తీసివేస్తూ,అనన్య భక్తి యను పటిమగల దారముతో ,పంచాక్షరిని జపిస్తూ,పరమేశుని /భక్తుల పాద సమర్పణము గావించుకొనగలిగినప్పుడు అనిశము కరుణతో మనలను రక్షించడా ఆ పార్వతీవల్లభుడు. "ఆర్తా విషణ్ణాశిధిలాశ్చ భీతా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః సంకీర్త్య నారాయణ శబ్ద మాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతు." ఏక బిల్వం శివార్పణం.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...