ధూమ్రాక్షుని మరణము శుంభునిలోని విచక్షణను మరింత దాచివేసి,వాచాలత్వమును మరింత ప్రకోపింపచేస్తూ,తన గొయ్యి తానే తవ్వుకొనుటకు చండ-ముండుల రూపములో ముందుకు వచ్చి నిలిచినది.
రాజసము తాను విశ్వరూపముతో పగను రాజిల్లచేస్తుంటే,వాడు చండ-ముండులతో,
" తథా శేషాయుధైః సర్వైః అసురః వినిహంత్యాం
తస్యాం హతాయాం దుష్టాయాం సింహేచ వినిపాతతే"
ఓ చండ/ఓ ముండ,
మీరు పెద్ద సైన్యముతో అటకేగి ఆ "ఆడుదానిని" తాళ్ళతో కట్టియో,తలపట్టుకుని ఈడ్చియో ,ఆయుధములతో యుద్ధము చేసియో సింహముతో సహా నా దగ్గరకు తీసుకుని రండి అని హుంకరించాడు.
స్వామి కార్యమునకై తక్షనమే బయలుదేరి శైలపర్వతమును చేరిన వారికి కాంచనశిఖరమునందు సింహవాహినియై మందహాసముతో నున్న దేవి దర్శనమిచ్చినది.
వారు కయ్యమునకు కాలుదువ్వుతూ,తమ వింటినారిని బిగుతుగా లాగి,కత్తులను చేత బట్టుకుని బంధించుటకు సిద్ధమైనారు.
తల్లి ముఖము నల్లగా మారినది.కోపము కోరలు సాచినదా అన్నట్లుగా కనుబొమలు ముడివడినవి.కాళి యను కొత్తశక్తి కదనరంగమున వారిపై యుద్ధముచేయుటకు సిద్ధమాయెను.
ఆ శక్తి,
" భృకుటీ కుటిలాత్తస్యా లలాటఫలకాద్ద్రుతం
కాలీ కరాల వదనా వినిష్ట్ర్యాంతాసి పాశినీ"
అంబిక భయంకరముగా ముడిచిన కనుబొమలనుండి ప్రకటింపబడిన భక్షణమే తన లక్షనముగా గల కాళి,
ఎలా ఉన్నదంటే,
" విచిత్ర ఖట్వాంగధరా నరమాలా విభూషితా
ద్వీపిచర్మ పరీధానా శుష్కమాంసాతి భైరవా"
కత్తి,పాశము,ఖట్వాంగము ఆయుధములుగా,పుర్రెల మాలలు ఆభరనములుగా,పులిచర్మము వస్త్రముగా మాసములేని అస్థిపంజరము వంటి భయంకర రూపముతో,
రక్కసులలో కొందరిని తన నోటిని వెడల్పుగా చేసి భక్షించసాగెను.
అంతటితో ఆగక మరికొందరిని తన కత్తులతో నరుకుచు,మరికొందరిని ఖట్వాంగముతో మర్దించుచు,మరికొందరిని పంటి కింద నములుచుండెను.
తమ సైన్యమును రక్షించుకొనుటకు ,
" శరవర్షైః మహాభీమైః భీమాక్షీం తాం మహాసురః
ఛాదయామాస చక్రైశ్చ ముండుం క్షిప్తైః సహస్రః"
చండుడు కౄర బాణ వర్షముతోను,ముండుడు వేలవేలు చక్రములతోను కప్పివేయుచుండగా అవి
మేఘ గర్భములోఇకి జారిపోవుచున్న సూర్యుల వలె తోచుచుండెను.
సమయమాసన్నమైనదని సహనమును వీడి కాళి
"ఉత్థాయచ మహాసిం హం దేవీ చండమథావీత
గృహీత్వా చాస్య కేశేషు శిరస్తే నాసినాఛ్చివత్."
తన చేతిలోని కత్తిని పైకెత్తి,హుంకరించి చండుని జుట్టు ఒకచేత పిడికిటబట్తుకొని,ంస్రొక్స్ చేతితో వాని తలను నరికివేసెను.అత్యుత్సాహము సద్దుమణిగినది.నిరుత్సాహమును సైతము నిర్మూలనము కావించుతకు అమ్మ తనపైకి వస్తున్న ముండునికి సైతము ముక్తిని ప్రసాదించినది కత్తితో వాని తలను మొండెమును వేరుచేసి.
అఖిలాందేశ్వరి-చాముండేశ్వరి పాలయమాం గౌరీ
పరిపాలయమాం గౌరీ.
అంబిక దగ్గరకు వెళ్లి సమిథక్లుగా ఆ రెండు తలలను దుష్టనిర్మూలనమను మహాయజ్ఞమునకు సమర్పించినది.
తల్లీ నిశుంభులను మర్దించగల మహాశక్తివి నీవే అంటూ,నమస్కరించగా చండిక కాళిని ఆశీర్వదిస్తూ ఇకమీదట నీవు చాముండ గా కీర్తింపడతావు అని ఆశీర్వదించింది.
No comments:
Post a Comment