పాహిమాం శ్రీ రాజరాజేశ్వరి-
కృపాకరి శంకరి
**************************
కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయినీ భైరవీ
సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్య లక్ష్మీప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరి"
ఏది ప్రమాదమో/ఏది ప్రమోదమో తెలియక జీవులు ఇంద్రియములచే బంధింపబడి,విచక్షణను మరచిపోయి,వింతపోకడలతో కన్నుమిన్నుకానక విధ్వంసమునకు సిద్ధమైన సమయమున,
"దేహి ముదం దేహి సింహవాహిని దయా ప్రవాహిని"
అని సకలజగములు నిస్సహాయులై ప్రార్థించుచున్న వేళ,అవ్యాజకరుణతో,
"పరాస్య శక్తిః వివిధైవ శ్రూయతే"
తల్లి తనకు తానే బహుముఖములుగా ప్రకటితమయే బాధ్యతను స్వీకరించి,భవబంధనములను తొలగించివేస్తుంది.
అట్టి పవిత్ర చరితములను స్మరించుట వలన,శ్రవణము వలన కలుగు జ్ఞానము సైతము శ్రీమాతఅనుగ్రహమే..ముగురమ్మల మూలపుటమ్మ ,సురారులమ్మ నిర్హేతుక కరుణయే.
దేవిశరన్నవరాత్రుల పుణ్యసమయము.శరత్కాలపు వెన్నెల అమ్మ దరహాస చంద్రికలేగా.
" ప్రపంచం శించతీ" అన్నారు ఆదిశంకరులు అమ్మ సౌందర్యమును స్తుతిస్తూ.
మనము చకోరములై ఆస్వాదించుటకు సిద్ధమౌదామా ప్రియ మిత్రులారా.!
చక్కని నిదర్శనముగా వేనోళ్ళ కీర్తింపబడుతున్న
మార్కండేయ మహాపురాణము నందలి చండీసప్తశతి
లోని సురథ-సమాధి అను వారిని ఉద్ధరించిన సుమేథ మహర్షి వాగ్ధారలను ఒక సారి స్మరించుకుంటూ.
సురథుడు -రథము అను శబ్దమును ఇంద్రియమునకు అన్వయించుకుంటే కనుక లక్షణమైన ఇంద్రియములు కలవాడు.గొప్పరాజు.శత్రువులు తన రాజ్యమును ఆక్రమించుకొనగానే మనసనే గుర్రమునెక్కి అడవులలోని వేట అను నెపమున వచ్చినవాడు.
వేట నెపము కాదు.నిజమే.వేటాడబడినవి తన ఇంద్రియములనే కౄరమృగములు.
ఇంకొకరు సమాధి అను వైశ్యుడు.తన కుటుంబము చేతనే ధనము కొరకు తిరస్కరింపబడినవాడు.దారి తోచక అడవికి వచ్చెను.ఒకరినొకరు పరస్పరము పరిచయము కావించుకొనినారు.
కొంచము గమనిస్తే ఇవి వారి స్వభావమునకు సంకేతముగా వచ్చినవి వారి పేర్లు.
నేను అన్న తలపు,నాకు సంబంధించిన కుటుంబము అనుకుంటూ దూరముగా నున్నప్పటికిని మరువలేని భ్రాంతితో నున్నవాడు.
వేరొకరు నేనును అనుసరించియున్న నాది అన్న భావముతో నిండియున్నవాడు.నా రాజ్యము,నా ప్రజలు,నా గజములు,అంటూ తనకు వాటి మీద అధికారము చేజారినప్పటికిని చింతిస్తూనే ఉన్నవాడు.
సంభాషించుకుంటూ వారు సుమేథ మహర్షి ఆశ్రమమున ప్రవేశించిరి.
సవినయముగా నమస్కరించి,ముని ప్రశాంతవదనము వారిని ఈ విధముగా ప్రశ్నింపచేసినది
"తత్కిమేతన్మహాభాగ యన్మోహో జ్ఞాని నోరసి
మమాస్యచ భవత్యేషా వివేకాంధస్య మూఢతా"
ఓ మహానుభావా!
జ్ఞానము కలదనుకొనుచున్న మేమిరువురము కూడ వివేకము చాలని వారివలె మూఢత్వమునకు/మోహత్వమునకు గురియగుచున్నాము.ఇది ఏమి విచిత్రము?
అందులకు ఆ సుమేథముని మందహాసముతో మహామాయ మహిమలను ఈ విధముగా వినిపించసాగెను.
" సా విద్యా ముక్తేర్హేతుభూతా సనాతనీ
సంసార బంధ హేతుశ్చస్తైవ సర్వేశ్వరేశ్వరీ"
సనాతని-సర్వేశ్వరి అయిన పరాశక్తియే సంసారబంధములలో మనలను బంధించగల-సంకెలలను తొలగించగల సమర్థురాలు.
అనగానే
వారు అత్యుత్సాహముతో ఆమె గురించి వినగోరుచున్నామని,వినిపించమని నిష్కళంక చిత్తముతో సిద్ధమైనారు.
అమ్మదయ బోధనకు మూలమైన "సు"" మేథ" (స్సు) మునివాక్కులద్వారా వారి/వారితోబాటుగా నాలాంటి వారి మోహభ్రాంతిని ఎలా తొలగించిందో తెలుసుకునే ప్రయత్నములో నేను ఈ కథాకదంబమును మీముందుంచున్నాను. దోషములను సవరించుట దేవి అర్చనయేగ.
శబ్దము/శ్రవణము రెండును తానైన ఆ పరాశక్తి మనలనందరిని,మధుకైటభ వృత్తాంతముతో అనుగ్రహించుగాక.
నమస్తస్త్యై నమస్తస్త్యై నమో నమః"
సర్వం శ్రీమాత చరణారవిందార్పణమస్తు.
No comments:
Post a Comment