పాహిమాం శుంభ-నిశుంభదైత్య దమని-పరమేశ్వరి.
************************************
దుర్గాం!
వందే దుర్గతి నాశిని
అనర్గళానందాయినీ జననీ
భర్గాది దేవ వరదాం అభయదాం
సర్గాదికృత్యమోదాం నిర్మదాం
స్వర్గాది సౌఖ్యప్రదాం శుభదాం
అపవార్గాది ఫలదాం భవపారదాం: దుర్గాం:
కరవాల హస్తాం కరుణాలవాలాం
వరశరన్నవరాత్రమహితాం అమలాం
పరమహంస్యాదర్చితాం నిష్కళంకాం
పరమాద్వైత శీలాం "దుర్గాం వందే దుర్గతి నాశిని."
అమ్మవారిని స్తుతిస్తూ,
కరవాల హస్తాం-కరుణాలయాం అని రెండు విభిన్న తత్త్వములను వినిపిస్తున్నారు.అమ్మవారు మన చర్మచక్షువులకు క్రవాల హస్తము తో మాత్రమే కనిపిస్తున్నది .( మాయపొర తొలగనంతవరకు.)
శుంభ-నిశుంభులు అమ్మను పొందుటకై రణమొనరించుచున్నారు.ఇది బాహ్యము.
నిజమే.వారికి కావలిసినది అమ్మరూపము కాదు.అమ్మ దయాంతరంగము.జీవన్ముక్తి.
అమ్మ కథలను చదువుచున్నప్పుడు మొదటి కథలో మథుకైటభులను సంహరించుతకు
తాను ఆకాసమునుండి వెలువడి హరి యోగనిద్రను వీడునట్లు చేసినది.మన చివరి కథయైన శుంభనిశుంభులను సంస్కరించుటకు వానిని ఆధారముతో ఆకాశమంతా వ్యాపించునట్లు చేసి,తాను మాత్రము ఎటువంటి ఆలంబనను తీసుకొనకయే,తన హుంకారముతో భూమిని గట్టిగా తన్ని తాను సైతము ఆకాశమునకెగిరి యుద్ధము చేయుచున్నది.
ఒక విధముగా చెప్పలంటే ఆకాశమునుండి ప్రారంభించిన తన ప్రయాణమును తిరిగి ఆకాశమును చేరుట యందు ముగించినది
.ప్రారంభములో సౌమ్యశబ్దము తిరోగమనములో ప్రళయగర్జనగా పరిణమించినది.
అంటే సహరహసి సదాశివుని స్థిరశక్తితో ఏకముగా నున్న శక్తి విడివడి చలన శక్తియై పంచభూతములను,పంచ తన్మాత్రలను వాటిని ఉపయోగించుటకు పంచభౌతికలను వివిధములను సృష్టించి,సమన్వయపరచి సమాధానపరచుచున్నదన్నమాట.
తిరిగి మూలాధారము నుండి సహస్రారమువరకు జీవి చేయు పయనమునకుతాను తోడుగా నుండి,
స్వర్గాపవర్గదా-సదా కనిపెట్టుకుని ఉంటూందన్నమాట.
కనుకనే లలితా సహస్రము,
మూలాధారైక నిలయా బ్రహ్మగ్రంధి విభేదిని"
మణిపూరాఅంత నిలయ విష్ణుగ్రంధి విభేధిని"
సహస్రాంబుజారూఢా"
తల్లి ఏ విధముగా మన బ్రహ్మగ్రంధి ముడిని,విష్ణు గ్రంధి ముడిని,రుద్రగ్రంధి ముడిని విడదీసి,(విడదీయుటకు తాను అత్యంత సూక్షముగా ప్రకటితమగుతు") కుండలినీ ఊర్థ్వ పయనమునకు ఊతగా నున్నది.
కనుకనే ఇక్కడ నిశుంభుడు స్పృహ తప్పి నేలకొరిగియున్న సమయమున శుంభుడు క్రోధముతో ఉవ్వెత్తున రథముపైకెగిరి ఆకాశమంతా విస్తరించిన తన బాహువులతో, అమ్మతో పోరాడుటకు సిద్ధమైనాడు.వాడికి పైకెగరగల సక్తి ఎచటినుండివచ్చినది.వరప్రభావము వలననే కదా.ఆ వరమును అనుగ్రహించినది బ్రహ్మరూపములో.బ్రహ్మాండ రూపములో నున్న ఆదిపరాశక్తియే కదా.
వాడు అమ్మను కోరుచున్నాడు.ఒక విధముగా నిజమే,కాని పెండ్లాడ కోరుచున్నాడు.అది వాని అవివేకము.
అమ్మ సైతము వానిని అనుగ్రహించదలచియే కదా రాయబారము/రణభారమును సృష్టించినది.
కరుణించదలచినది కన్నతల్లిగా కాని కన్యగా కాదు.
ఒకే విషయము రెండు విధములుగా అన్వయించుకుంటే ఒకటి కాఠిన్యము.మరొకటి కారుణ్యము.
అదేనేమో
కరవాల హస్తా-కరుణాలలయా అంటే.
తుభ్యం నమోదేవి తుభ్యం నమః.
యుద్ధభూమిలో ,
"శుంభముక్తాన్ శరాందేవీ శుంభస్తః ప్రహితాన్ శరాన్
చిఛేద స్వశరైః ఉగ్రైః శతశోధ సహస్రశః"
వందలకొలదిగా ప్రయోగింపబడిన శరములను దేవియు,దేవి సంధించిన బాణములను శంభుడును త్రుంచివేసిరి.
అమ్మకు అదియొక వినోదము.
దేవి శూలఘాతమునకు శుంభుడు స్పృహతప్పి నేలకొరిగెను.వెంటనే నిశుంభుడు(అప్పటివరకు స్పృహలేకయున్న) తెలివితెచ్చుకొని,ధనస్సును గైకొని బాణములతో చండికను/కాళిని/సింహమును అమ్ములతో కప్పివేసెను.
అంతటితో ఆగక మరల పదివేలచేతులను కల్పించుకుని,పదివేల చక్రములతో దేవిని కప్పివేసెను.సమయమాసన్నమయినదని దేవి,
గదనెత్తి తనపైకి వచ్చుచున్న వానిని తన ఖడ్గముతో తుంచివేసెను.
ఉత్థాన-పతనములు జీవుల లక్షణములు..కాలచక్రముచేయు చమత్కారములు.కొందరిని తన నోట కరచుకొని కొంతదూరము తనతో పాటుగా తిప్పుతూ ,కొందరిని మింగుతూ,మరి కొందరిని వదులుతూ కనికట్టు చేస్తూ పోతుంది.ఎప్పుడు ఎవరిని పట్టుకుంటుందో/వదులుతుందో,ఎక్కడ ఎవరిని పట్టుకుని మింగేస్తుందో పరాశక్తికి మాత్రమే తెలిసిన పథకము.
" భిన్నస్య తస్య శూలేన హృదయాన్నిః సృతోపరః
మహాబలో మహావీర్యః తిష్ఠేతి పురుషోవదన్"
నిశుంభుని చీలిన హృదయము నుండి మరొక మహాబలుడు నిలినిలుమని పలుకుచు బయలువెడలెను.దేవి వానికి సైతము తన శూలముతో ముక్తిని ప్రసాదించెను.
కుపుత్రా సంజాతే-కుమాతా నభవతి.
నిశుంభుని మరణముతో శుంభుడు ఉగ్రుడై,ఓ దుర్గా!
" బలావలేపాద్దుష్టే త్వం మా దుర్గే గర్వమానహ
అన్యాసాం బలమాశ్రిత్య యుద్ధస్యే యాతి మానినీ"
నీవు దుష్టవు.బలముకలదనెడి పొగరుతో గర్వపడకుము.ఇతరుల బలముచే/సహాయముచే యుద్ధము చేయు నీది ఒక క్షాత్రమేనా? అని హేలనగా పలికెను.
దానికి బదులుగా దేవి,
" అహం విభూత్యా బహుభిరిహ రూపైయదా స్థితా
తత్ సంహృతం మయైకైవ తిష్ఠాం యజో స్థిరోభవ."
నేనే పెక్కురూపములతో ఇంతవరకు యుద్ధమునందుంటిని.ఇప్పుడే నా పెక్కురూపములను ఉపసంహరించుకొనుచున్నాను.
ఇకమీదట నేనొక్కతినే నీతో పోరాడెదననెను.
వానిని అమ్మ అనుగ్రహిస్తుందో/ఆగ్రహిస్తుందో తెలుసుకునే ముందు ఒక్కసారి అమ్మతత్త్వమును తెలుసుకుందాము శ్రీ ఆదిశంకరులమాటలలో.
" కిరీటం వైరించం పరిహర పురః కైటభ భిదః
కఠోరే కోటీరే స్ఖలసిజహి జంభారి మకుటం
ప్రణమ్రే ష్వేతేషు ప్రసభముప యాతస్య భవనం
భవస్యాభ్యుత్థానే భవపరిజనోక్తిః విజయితే"
అమ్మా! నీ పతి సదాశివుని రాకను స్వాగతించుటకు సత్వరముగా నీవేగుసమయమున, నిన్ను సేవించుటకు హరిబ్రహ్మాదులు తమ కిరీటములను తీసి పక్కన పెట్టియున్నారు.వారి కిరీటములలో పొదిగిన కఠినరత్నముల తాకిడికి నీ సుకుమార పల్లవ పదములు కందిపోవునేమో తల్లి జాగ్రత్త అని జయములు పలుకుచు పరిజనములు హెచ్చరించుచున్నారట.
ఇది కథనము.దీనిలోని అంతర్మథనము మరొకటి.
తల్లీ నీవు చలనశక్తివై శివుని వీడి కుండలినీ శక్తిని/జీవులను చైతన్యమొనరించుటకు ప్రేరేపించి సుషుమ్నా నాడి ద్వారా ఊర్థ్వ పయనము చేయించునప్పుడు(సహస్రారము చేర్చునపుడు) బ్రహ్మగ్రంధి,విష్ణుగ్రంధి,రుద్రగ్రంధి అను మూడు ముడులను వదులుచేస్తూ,మిగిలిన అడ్దంకులను తొలగించుటకు అత్యంతసూక్ష్మముగా,
"బిసతంతు తనీయసీ" గరిక కొన వంటిసూక్ష్మ రూపముతో వారిని సహస్రారము వద్దనున్న శివుని చేర్చు సమయమున నీ పాదములు కందగలవు జగజ్జననీ.కనుక మూఢులను ఉద్ధరించువేళ,వారి నీతోపాటుగా సహస్రారమునుచేర్చువేళ, నీ పాదములెంత కందునో తెలుసుకొనలేని అజ్ఞానులము తల్లీ!అంటూ మర్మపు ముడిని విప్పుచున్నారు.
తల్లి వాడిని సైతము బంధవిముక్తుని కావింపదలచి తనశూలముతో ముక్తిని ప్రసాదించెను.
శుభసంకేతములుగా
మంగళవాయిద్యములు మ్రోగినవి.గంధర్వులు గానమును ప్రారంభించగా తదనుకూలముగా అప్సరసాంగనలు నాట్యముచేయసాగిరి.
జజ్వలుశ్చగ్నయః శాంతాః శంతా దిగ్జనితస్వనః"
ఆగిపోయిన యాగాగ్నుల అంకురార్పనముతో ప్రజ్వరిల్లసాగినవి.
"సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే
శర్ణ్యే త్రయంకేదేవి నారాయణి నమోస్తుతే"
అని ప్రార్థిస్తున్న దేవతలను చూసి,దేవి వారితో ఏమనినదో తరువాతి భాగములో తెలుసుకునే ప్రయత్నము చేద్దాము.
సర్వం శ్రీమాతాచరణారవిందార్పణమస్తు.
No comments:
Post a Comment