న రుద్రో రుద్రమర్చయేత్-30
*********************
"ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై
ఎవ్వడి ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం
బెవ్వడనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానైన వా
డెవ్వడు వాని నాత్మభవు ఈశ్వరుని, నే శరణంబు వేడెదన్."
బమ్మెర పోతన మహాకవి.(గజేంద్ర మోక్షము)
స్థూలమును గమనిస్తూ,దానిలో దాగిన సూక్ష్మమును గ్రహించగలుగుటయే ఈశ్వరానుగ్రహము.
స్థూలములో తాబేటిని చూస్తుంటే దాని అవయములను కాసేపు ముడుచుకొని,తన డొప్పలో దాచేసుకొని,మరికొంత సేపు బయటకు విస్తరింపచేస్తూ,తాను మాత్రము ఎటువంటి వికారమును పొందకుండా స్థిరముగా నుండు సూక్ష్మ భగవతత్త్వమును అర్థముచేసుకొనగలుట భగవంతుని మీఢుష్టత్వము.
నిక్షిప్త-ప్రక్షిప్త శక్తులను సమయానుకూలముగా వ్యక్తీకరిస్తూ,విశ్వపాలనమును నిర్వహించు పరమాత్మను, నేను శరణము వేడుచున్నాను.
ప్రియ మిత్రులారా!
ఈ కార్తిక మాసమునకు మనము చేయు బిల్వార్చనమునందు "మీఢుష్టమ" అనే పదమును అర్థము చేసుకునే ప్రయత్నమును చేద్దాము.అనుగ్రహమును వర్షించుట మీఢుష్టము.స్వామి అనుగ్రహం అవ్యాజము.అర్హతలను లెక్కించదు.
నమకములో సైతము,
అనువాకము-1-9. మంత్రము
" నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే
" అంటూ స్వామి ప్రసాదగుణమును ప్రస్తుతించినది.
మేఘముగా మారి అధికముగా వర్షించు వాడనునది
వాచ్యార్థము.అంతరార్థములు స్వామి మనకు అందించు అన్వయ అనుగ్రహములను బట్టి ఆధారపడి ఉంటుంది.
సహస్రాక్షాయ అను పదమునకు ఇంద్ర శబ్దమును అన్వయిస్తారు పెద్దలు.ఇంద్రియసామర్థ్యమే ఇంద్రుడు.
ఇంద్రియ విషయమునకు వస్తే (మీరంతా విజ్ఞులు) నా మటుకు మూడు ఉదాహరణములు
నన్ను అయోమయములో పడవేస్తుంటాయి.
మొదటిది
అసలు ఇంద్రియములన్నీ సమర్థవంతములేనా?
అయినప్పుడు అవి వాటి సామార్థ్య ప్రకటనమును వేరు వేరు సందర్భములలో నే ఎందుకు ప్రకటిస్తుంటాయి.?
ఉదాహరణమునకు నా చేతిలో రాళ్ళ ఉప్పు ఉన్నది.దానిని చూడగానే నా కన్ను ఉప్పును గుర్తించినది.స్పర్శ కూడా దానికి వత్తాసు పలికినది.
నేను దానిని నీళ్ళ పాత్రలో వేసాను.కాని తికమక.మర్చిపోయాను వేశానో/లేదో అన్న సందేహము.
పాత్ర వంక చూస్తు కన్నును అడిగాను.తెలియదన్నది.చేతిని అడిగాను చెప్పలేనన్నది.
విచిత్రము ఇంకో ఇంద్రియము జిహ్వ, అప్పటివరకు మౌనముగా నున్నది నేను చెప్తాను అంటు రుచి చూసి,నీరు ఉప్పగా నున్నదని చెప్పింది.
ఇంద్రియములను సమయానుకూలముగా పనిచేయిస్తున్న రుద్రా! నీకు నమస్కారములు.
.
అంతే కాదు బాహ్యము/స్థూలరూపము. దానిలో నిక్షిప్తముగా దాగిన సూక్ష్మము
కౌశలమును కనబడనీయుట లేదు.ఆ విషయము చెబుతాను.
మొన్నొక సభాకార్యక్రమమునకు వెళ్ళాను.అందరు ఎన్నో కళలలో ఆరితేరిన వారే.వారెవరు నాకు తెలియదు.వారి ప్రతిభను గమనిద్దామని వారిని పరికించాను.అందరి ఉపాధులు ఒకటిగానే ఉన్నాయి.గుర్తించలేకపోయినాను.
సభ ప్రారంభమయినది.
గాయని గళము అమృతము చిందుచున్నది.నర్తకి భంగిమ అద్భుతము చేయుచున్నది.చిత్రలేఖనము,కవనము అన్నీ ఒకదానికొకటి పోటీపడుతున్నాయి.
అంతవరకు కనుగొనలేని నా తెలివితక్కువను తెల్లబోయేటట్లు చేసిన రుద్రునకు నమస్కారములు.
మూడవ ఉదాహరణము
,
ఆధ్యాత్మికమైనప్పటికిని ఉపాధికి సంబంధించినదే.
ప్రవచనము వింటున్నాను.జీవికి మూడు శరీరములు అని చెప్పగానే ఏదో అంతా తెలిసినట్లు అవునవును-స్థూల-సూక్ష్మ-కారణ శరీరములని మురిసిపోయాను.
అప్పుడే తెలిసినది నా నిజ స్థితి.వాటి గురించి నాకేమి తెలియదని.అసలు వాటికైనా తెలుసో/లేదో.
అవి మూడును ఒకే ఉపాధికి సంబంధించినప్పటికిని వేటి బాధ వాటిదే.ఒకదాని అవస్థను ఇంకొకటి తీర్చలేదు.
1 స్థూల శరీరము ఆకలిదప్పులు తనకు లేవని,
2.సూక్ష్మ శరీరము జరామరణములు తనకు లేవని
3.కారణ శరీరము తనకు పై రెండింటి బాధలు లేవని,
తమకు తామే పొగుడుకుంటూ,పొగరుబోతు తనముతో ఎగురుతుంటాయి .
కాని స్థూల శరీరమునకు జరా-మరణముల భయం
సూక్ష్మ శరీరమునకు ఆకలి-దప్పికలను ఇబ్బందులు
కారణ శరీరమునకు పాప-పుణ్య ఫలితము/పునర్జన్మల భయము.
ఎంతటి విచిత్రము జీవి గమనము-గమ్యము.
ఓ రుద్రా నీ అనుగ్రహము,
5.వ అనువాకము-7.వ మంత్రము
నమో మీఢుష్టమాయచ-ఇషుమతేచ"
వర్షమూర్తి వానజల్లులు బాణములుగా కీర్తింపబడెను.
గోదాదేవి "తిరుప్పావై" 4.వ పాశురములో,
శరమళై- పెయిదిడాయ్
-శరములవంటి జల్లులతో వర్షమును కురిపించుము,అదియును,నీ చేత ధరించియున్న సుదర్శన కాంతి వంటి మెరుపులతో,స్వామి శరీర కాంతిని పోలిన మేఘకాంతితో,పాంచజన్య శబ్దమును పోలిన ఉరుముల శబ్దములతో అనుగ్రహ వర్షమును కురిపించమని ప్రార్థిస్తున్నది.
వర్షప్రభావముగా కేదారముల మధ్యన ప్రవహించుచున్న పిల్లకాలువలో ,వేదశాస్త్ర ఉపనిషత్ మడుగులలో యోగులనెడి చేపలు కేరింతలు కొడుతున్నవట.
రుద్రా! నీ అనుగ్రహ వర్షముచే సస్యకేదారములలో/సారస్వత పంటపొలములలో సన్నగా ప్రవహించుచున్న పిల్లకాలువలలో, నీ నిజతత్త్వమును తెలుసుకొనగలిగిన మహాత్ములు చేపపిల్లల వలె తుళ్ళుచున్నారట.
శివము అనగా శుభములు
శివతర-మిక్కిలి శుభములు
శివతమ-అనిర్వచనీయ శుభములు
మీఢుష్టమ-మాపై వర్షించుమా రుద్రా నమో నమః
నీ నిజతత్త్వమును తెలుసుకొనట కేవలము నీ అనుగ్రహమే కనుక దానిని నామదిలో స్థిరముగా నిలిచి యుండునట్లు మమ్ములను ఆశీర్వదించుము.
చేతులారంగ శివుని పూజింపడేని
నోరు నొవ్వంగ హరికీర్తి నుండువడేని
దయయు సత్యంబు లోనుగా తలపడేని
వానిని సైతము నీ కరుణా వాత్సల్యము కృతార్థుని చేయుగాక.
"కరచరణ కృతంవా-కర్మ వాక్కాయజంవా
శ్రవణ నయనజంవా-మానసంవాపరాధం
విహితమహితంవా-సర్వామే తత్ క్షమస్వ
శివ శివ కరుణాబ్ధే శ్రీమహాదేవ శంభో
నమస్తే నమస్తే నమస్తే నమః"
" న రుద్రో రుద్రమర్చయేత్"
పలుకులను -చూసినా-చూడకున్నా,వినినా-వినకున్నా,చదివినా-చదువకున్నా,చర్చించినా-లేకున్నా,ఎప్పుడో పుక్కిట పట్టేశామని వెక్కిరించినా,గొప్పగా ఏమిలేదు అని పెదవిని చప్పరించినా, కుప్పల తప్పులు అనినా,
తప్పులు సవరించుటకు కనికరించినా.మేమా--తప్పులను సవరించేది అని హుంకరించినా
(ఫలశృతి) గంగా స్నాన ఫలితమును ఇచ్చు గంగాధరుని ఆన
నాశ రహిత పుణ్యమును ఇచ్చు నాగాభరణుని ఆన
విభవమొసగు-విజయమొసగు విశ్వేశ్వరుని ఆన
సర్వ జనులకు శుభములు ఇచ్చు సదా శివుని ఆన.
ఏక బిల్వం శివార్పణం.
( సవినయ ధన్యవాద కుసుమాంజలి)
స్వస్తి.
++
No comments:
Post a Comment