పాశురము-18
***********
"ఒప్పుకున్న తప్పులన్ని పురుషకార లాలనలో
తప్పిపోవ దండనలు పురుషోత్తమ పాలనలో."
పిరాట్టి అనుగ్రహమనే పురుషకారమును మనకు అందిస్తున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటు,పంచేంద్రియ పరమార్థమునందించు విశేషానుగ్రహ పాశురమును అనుసంధానము చేసుకునే ప్రయత్నమునుచేద్దాము.
ఉందు మదగళిట్రన్ ఓడాద తోళ్వలియన్
నందగోపాలన్ మరుమగళే! నప్పిన్నాయ్
కందం కమళుం కుళలీ కడై తిరవాయ్
వందు ఎంగుం కోళి అళైత్తనగాణ్; మాదవి
పందల్ మేల్ పల్కాల్ కుయిల్ ఇనంగళ్ కూవిణగాన్
పందార్ విరలి; ఉన్ మైత్తునన్ పేర్పాడ
శెందామరైక్కైయ్యాల్ శీరార్ వళై యెళుప్ప
వందు తిరవాయ్ మగిందేలో రెంబావాయ్.
నప్పిన్నాయ్-యశోద సోదరుదైన కుంభగోపుని-ధర్మదల కుమార్తె.సుగంధ కేశసౌందర్యము కలది.
శెందామరల వంటి చేతులు కలది.శీరార్వళై -ఐశ్వర్యవంతమైన కరకంకణములు కలది.అంతే కాదు
"పందార్ విరలి" చేతిలో కందుకమును/బంతిని ధరించి యున్నది.
నప్పిన్నాయ్ -అనగా
నప్పినాయ్ అమ్మవారిని ముద్దుగా తమిళభాషలో పిలుచుకునే పేరు.అంటే లక్ష్మీదేవి.లక్ష్మీదేవి అంశలు మూడుగా విడివడి ఆదివరాహుని భూమాతగాను,(భూదేవి) శ్రీ రాముని సీతాదేగాను (శ్రీదేవి) శ్రీ క్రిష్ణుని నీలాదేవిగాను అనుసరించారు.నప్పిన్నాయ్ ని ఉత్తర భారతీయులు రాధా దేవిగా కొలుస్తారు. అమ్మ స్వామి ఆత్మైక స్వరూపులు.దేహములు రెండు కాని ఆత్మ ఒక్కటే.స్వామి నిదురించుట అంటే అంతర్ముఖమైనారు.
ఓ నప్పిన్నాయ్-మా వరప్రసాదమా,నీవు మా నందగోపుని యొక్క
మరుమగళై-మేనకోడలివి.
మా నమగోపుడు,వేదశాస్త్ర సంపన్నుడు మాత్రమేకాదు ,
ఉందు మదగళిట్రన్ ఓడాద తోళ్వలియన్
బాగా మదించి,మదజలమును నిరంతరముగా స్రవించుచున్న ఏనుగుల గుంపులను,(మదగళిట్రన్)
ఉందు తోళ్వళియన్-అతిశయించున భుజబలముతో (ఓడాద)తరిమివేయగల పరాక్రమము కలవాడి కోడలా మమ్ములను అనుగ్రహించు.
అదుపుతప్పి ప్రవర్తించు ఇంద్రియముల సమూహములే మదగజములగుంపులు.వాటిని తరిమివేయకల భావపరాక్రమము కలవాడు నందగోపన్.
అదేపరంపరను కొనసాగించగల ఓ నీలాదేవి స్వామిని మేల్కొలిపి మమ్ములను అనుగ్రహించునట్లు చేయవమ్మా అని ప్రాధేయపడుతున్నాడు.
వారికి అమ్మపై అంత నమ్మకము.దానికి కారణము స్వామికి నీలాదేవి
కందం కమళుం కుళలీ-సహజ సుజంధభరిత కేశపాశముపై వీడలేని వ్యామోహము.అంతేకాదు స్వామికి నీలాదేవి
శీరార్ వళై యెళుప్ప-ఐశ్వర్యవంతమయిన గాజుల శబ్దమును వినుటయందు వీడలేని ఉత్సాహము.
సాక్షాత్తు ఉపనిషత్సారముగా
పరిమళిస్తున్నవి అమ్మవారి కేశములు,ఉపకార/పురుషకార-చేతనుల తప్పులను మన్నించుమని,వారి తప్పులు తెలుసుకొని పశ్చ్హాత్తపముచెందిన ,దోషములనెంచక మన్నించమని ,మధురముగా స్వామికి నచ్చచెప్పు వాక్కులే తల్లి అందమైన చేతులకు అలంకరింపబడి శ్రావ్యముగా మ్రోగుచున్న కంకణములు.
నీలమ్మ ఒకచేతిలో లీలగా బంతిని పట్టుకుని యున్నదట.మరియొక చేతిని స్వామి భుజముమీద ఉంచి మనతరఫున స్వామిని బుజ్జగిస్తున్నదట.
చేతనులైన మనకు చైతన్యమైన స్వామికి మధ్యన తానుండి స్వామిని సముదాయిస్తూ-మనకు సంస్కరించుకునే అవకాశమినిస్తున్నది నీలాపిరాట్టి.
కాని వీరికి అమ్మ వచ్చి తలుపు తీసి,నేనున్నానులెండి.స్వామికి మీ గురించి చెప్పి నోముస్థలికి వస్తామని చెప్పలేదని ఆత్రత.
అందుకే వారు తల్లీ తెల్లవారినది.అంటూ రెండు విషయములను సంకేతించినారు.
1.ఎంగుం కోళి అళైత్తనగాణ్-అంతటను కోళ్ళు కూయుచున్నవి.
2.కుయిల్ ఇనంగళ్ కూవిణగాణ్ -
మాదవి పందలి మేల్ పల్కాల్ అని బాహ్యమునకు అమ్మను రప్పించుటకు గుర్తులు చెప్పుచున్నారు.
ఎంగుం-అన్నిచోట్ల,
కోళి-కోళ్ళు లేచి
వందు-రమ్మని,
అలైత్తన్-పిలుస్తున్నాయి
దేనికి-తమ కాళ్లను సాగించి,చకచక అటు-ఇటు నడుస్తు తమకు కావలిసిన గింజలను ఏరుకుని-ముక్కున పట్తుకుని స్వీకరించమని .
తల్లీ కణ్-అమ్మా చూడు.
ఈ కోళ్ళు గింజలను ఎక్కడ తిరుగుతు ఏరుచున్నవి.అమ్మ నీలాదేవి భవనము దగ్గర.ఆ భవనము మణిమయము.నవరత్న తాపితము.అక్కడ వాటికి కావలిసిన ఆహారములో తో పాటుగా ఎన్నో మణులు-ముత్యములు-రత్నములు అన్ని కలగలిసి ఉన్నాయి.అవి వాటిని తమ ముక్కుతో వేరుచేస్తూ,తమకు కావలిసిన దానికై అటుఇటు కదులుతు గింజలను మాత్రమే తమ ముక్కుతో గట్టిగా పట్టుకుని స్వీకరిస్తున్నాయి
ఇది వాచ్యార్థము.ఈ కోళ్ళు ఆచార్యులు/ఆళ్వారులు.వారికి కావలిసినది శ్రీకృష్ణానుగ్రహమనే ఆహారము.అది ఐహికములై దారిమరల్చు విషయవాసనలతో మిళితమై ఉన్నది.వారు తమ జ్ఞానమనే ముక్కులతో వాటిని మణులను-నవరత్నములను దూరముగా తోసేస్తు,తమకు కావలిసిన పరమాత్మ అనుగ్రహమనే గింజలను నిశ్చల భక్తి అనే ముక్కుతో గట్టిగా పట్టుకుని,ఆస్వాదిస్తు-ఆనందిస్తున్నారు.అందుకే వారు మేల్కాంచగానే ఒకరినొకరు సత్సంగమునకు పిలుచుకున్నారు.
ఇదేవిషయమును మరొక్క ఉదాహరనముతో
మాదవి పందల్-మాధవభక్తి అనే తీగ అల్లుకున్న పందిరి
మేల్-మీద/పైన కూర్చుని-స్థిరముగా
పల్కాల్-పలువిధములుగా
కుయిల్ ఇనంగళ్-కోయిలల గుంపులు
కూవిణగాన్-కీర్తిస్తున్నాయి
కోళ్ళ కూతలు-కోయిలల బృందసంకీర్తనలు
ఉన్మైందనన్-నీ భర్తయొక్క వైభవమును కీర్తిస్తున్నాయి.
ఇంక జాగుచేయక,
మము బ్రోవమని చెప్పవే నీలమ్మ తల్లి,నీ కరకంకణముల సవ్వడితో నీవు మా అజ్ఞానమనే తలుపుగడియను తీసి మమ్ములను అనుగ్రహించమని పురుషకారత్వమును మగిందు తిరవాయ్-రామానుజలను అనుగ్రహించిన తల్లిని వేడుచున్న,
ఆండాల్ దివ్య తిరువడిగళే శరణం
No comments:
Post a Comment