పాశురము-20
************
"ఉక్కముం-తట్టొళియం లేక తీరదు మా ఆర్తి
నిక్కము సురపక్షపాతివని చేరు నిను అపకీర్తి."
ఇప్పటివరకు మన గోపికలు గోదమ్మతో కలిసి నీలమ్మను నిద్రలేపుతున్నారు.కాని నీలమ్మ స్వామితో నున్నదో ఏమో వీరికి సమాధానమును ఇచ్చుటలేదు.అయినను విచిత్రము వీరు మనకెందుకులే అని నీలమ్మ ఇంటిని వదిలివెళ్ళుటలేదు.నోము చేయుతలుపును వీరిని విడనాడుటలేదు.పూర్తిగా మనలను మైమరపించే ఆత్మస్వరూప-స్వభావములను అర్థమయ్యే రీతిలో మనకు ఆచరించుటకు ఊతగా భగవానుని యోగ-క్షేమ కారకత్వమును అందించుచున్న గోదమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,పాశురమును అనుసంధానము చేసుకునే ప్రయత్నమును చేద్దాము.
ముప్పత్తు మూవర్ అమరర్కు మున్శెన్రు
కప్పం తవిర్కుం కలియే !తుయిలెళాయ్
శెప్పం ఉడయాయ్ ! తిఱలుడైయాయ్ శేత్తార్కువెప్పం కొడుక్కుం విమలా!తుయిలెళాయ్శెప్పన్మెల్-ములై చ్చెవ్వాయ్ చ్చిఱుమఱుంగళ్నప్పినై నంగాయ్ తిరువే తుయిలెళాయ్ఉక్కముం తట్టొళియుం తందు ఉన్ మణాళనైఇప్పోదో ఎమ్మై నీరాట్టు ఏలోర్ ఎంబావాయ్.
ప్రస్తుత పాశురములో
1. స్వామికి ముప్పదిమూడుకోట్ల దేవతలపై నున్న అవ్యాజ అనురాగము,వారిని వారిరాజ్యములను శత్రువులనుండి రక్షించుటకై స్వామి చూపు -శౌర్య పరాక్రమములు కీర్తించుట
2 నీలాదేవియొక్క పెదవుల-కుచముల-నడుము యొక్క సౌందర్యమును వర్ణించుట
3.వారికి కావలిసిన అద్దము-విసనకర్రతో పాటుగా స్వామిని సైతము జలకములాడుటకు నీలమ్మను అనుగ్రహించమని వేడుకొనుట చెప్ప బడినది .
అదియును గుమ్మము బయటనుండే
గోపికలకు స్వామి అర్థపంచక జ్ఞానమును అనుగ్రహించినట్లున్నాడు కనుక వారికి,
1.తాము గోపికలమన్న స్వస్వరూప జ్ఞానము ప్రాప్తించినది.
2.స్వామిని పరమాత్మగా గుర్తించే పరరూపజ్ఞానము అందినది.
3.ఎంతసేపైనను ఓపికతో గడపదగ్గర వేచియుండి స్వామి నుండి తాము పొందవలసిన అద్దము-విసనకర్రతో పాటుగా స్వామిని తమవెంట తోడ్కొని జలకములాడాలనే స్థిర/పురుషార్థజ్ఞానము కనబడుతోంది.
4.నీలమ్మ కాని-స్వామి కాని తమతో మాటలాడలేదని,నోమునకు వస్తా మనలేదను విరోధిజ్ఞానము సైతము విశదమైనది.
5.దానిని తరిమివేయుటకు వారు "ఇప్పోదు" ఇప్పుడ/ఇప్పటికిప్పుదే" మాకు అనుగ్రహించవలసినదని క్షిప్రప్రసాదత్వమును గుర్తుకు తెచ్చే ఉపాయజ్ఞానము ప్రకటితమైనది.
అసలు ఎప్పుడైతే " ముప్పత్తి మువ్వర్ అమరర్కు" అని పాశురమును ప్రారంభించారో అప్పటికే వారు స్వామి వివిధ రూప లీలా ప్రకటనలే ఆ ముప్పదిమూడుకోట్ల దేవతలుగా కీర్తిస్తున్నారు.స్వామి నీవే
ద్వాదశాదిత్యులు
ఏకాదశ రుద్రులు
అష్ట వసువులు
అశ్వినీదేవతలు మరియు వారి సమూహములు అని చెప్పకనే చెప్పారు.
కాని చమత్కారముగా గోపికలు స్వామితో,భోగపురుషులైన వారు,వారి రాజ్యము కొరకు సుఖములకొరకు అమరులైనను.అడుగకపోయినను,
మున్శెన్రు -నీ అంతట నీవే ముందుకు వెళ్ళి వారి శత్రువులను భయకంపితులను చేస్తావు.కాని నిరపేక్షకులమైన గొల్లపిల్లలము నిష్కళంక మనస్సుతో నిన్ను సేవింపకోరితే బదులీయకున్నావు అని నిందిస్తున్నట్లుగా ఉన్నది.
6.వారు నీలమ్మ సౌందర్యమును సౌశీల్యమునకు సంకేతముగా మృదుభాషణల ఎర్రని పెదవులు,భక్తిభావనల బంగరు వక్షోజములు,ఐహిక శూన్యతకు సంకేతముగా సన్నని నడుమును వర్ణిస్తూ,పిల్లలకు కావలిసినవి ,వానితో పాటుగా వారు ఆడుకొనుటకు/జలకములాడుకొనుటకు స్వామిని తమతో పంపమంటున్నారు.
ఇది వారికి స్వామి అనుగ్రహించిన యోగము.దానిని క్షేమముగా భద్రపరచుకొనుటకు వారు రెండు ఉపకరణములను అనుగ్రహించమని వేడుకుంటున్నారు.
" ఎన్నడు ఆత్మస్వరూపమను అద్దము
నా అరచేతనుండునో
కన్నని నా ప్రతిబింబముగా నేనెన్నడు
కాంచుచు మురిసిపోవుదునో
ఎన్నడు ఆత్మస్వభావమను వీవెన
నా అరచేతనుండునో
వెన్నుని నా పరిచర్యలుగా నేనెన్నడు
వీచుచు తరించిపోవుదునో"
అనుకొనుచున్న గోపికలకు గోదమ్మకు అద్దము-విసనకర్ర కాసేపు స్వామి సేవకు పరికరములు.కాదు కాదు స్వామి పర్యంకమును చేర్చు ప్రసాదములు.
ఇంకొక సేపు పరిచర్యలు స్వామి సాహచర్యమునందించు పరిశ్రమలు.
మరో కొంచముసేపు స్వామి పరిష్వంగము నీయు పారమార్థములు.అద్దమొక్కటే అడిగితే ఒకరినొకరు చూసుకుంటూ,ఒకరికొకరు చూపించుకుంటూ దాగుడుమూతలు ఆడవచ్చును. ఆడి-పాడి అలిసి-సొలిసితే సేదతీరుటకు-స్వేదము పోవుటకు వీవన తాను వస్తుంది .స్వామిని సేవిస్తుంది.సాంత్వన తానవుతుంది.
కాని స్వామితో పాటుగా ఉంటేనేకదా సంతోషము వాటికి-వాటితో ఆడుకొనుచున్నవారికి.
ఇది బాహ్యము.బహురమణీయము.కాని భావగర్భితము.భవబంధ విముక్తము.
ఆత్మస్వరూపమును దర్శింపచేయు జ్ఞానమే ఆ అద్దము.కనుకనే వారు ఏ విధముగా ముప్పదిమూడుకోట దేవతలు నీ స్వరూపమో అదేవిధముగా మేమందరము కూడా నీ స్వరూపములమే. అంటున్నారు అంతే కాదు ఆత్మానుభవమును
అందించు అనుభూతియే ఆ విసనకర్ర.తాను నిలకడగా ఉండి సర్వభూతములను కదిలించువాని ప్రతీక.మేము సర్వకాలసర్వావస్థలయందును నీ రూపమునే మాలో చూసుకొనకలగాలి.నీ దివ్యగుణానుభవమునే మాలో అనుభవిస్తుండాలి.నీ నామసంకీర్తనములో మునకలు వేస్తుండాలి.అదియే స్వామిని తోడ్కొని,అద్దమును-విసనకర్రను చేతులలో పట్టుకుని,జలకములాడుట.
స్వామియే భోగము-భోక్త-భోజ్యము.స్వామియే వ్రత సంకల్పము-వ్రతాచరణము -వ్రతఫలము-వ్రత పరమార్థము.
నప్పిన్నాయ్-తిరువే
సర్వశుభలక్షణ-పవిత్రమూర్తి,
"ఉక్కముం తట్టొళియుం తందు ఉన్ మణాళనై,"
ఉక్కముం తట్టొళియుము-పదములను అష్టాక్షరిగా కూడా అన్వయిస్తారు.నీలమ్మను వారికి అష్టాక్షరి మంత్రమును అందించమని, మంత్ర ప్రభావముతో వారు తమలో తాము శ్రీకృష్ణుని దివ్యమంగళ విగ్రహమును దర్శించుచు-లీలా గుణవైభవములలో రమించు వరమును వేడుకొనుచున్న
ఆండాల్ దివ్య తిరువడిగళే శరణం.
No comments:
Post a Comment