Friday, April 21, 2023

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(HIRAnYARETA NAMOSTUTE)

 " లోకంబులు లోకేశుడు

    లోకస్థులు దెగిన తుది నలోకంబగు పెం
    జీకటికవ్వలనెవ్వం
    డేకాకృతి వెలుగు నతని నే సేవింతున్".
               -బమ్మెర పోతనామాత్యుడు.


  అది అజ్ఞాన- అజ్ఞేయ తత్త్వపూరితమైన స్థితి.సృష్టికి పూర్వదశ.లోక త్రయములు పాతాళమునందలి బురదలో పడినవో లేక చీకటిలో కలిసినవో ,అసలున్నవో-లేవో తెలిసికొనలేని అయోమయ పరిస్థితి.జ్ఞానము లుప్తమైన/గుప్తమైన వేళ అజ్ఞానము అధిష్టించి,సమస్తమును అజ్ఞేయమను నిస్సారపు పొరతో కప్పివేసిన స్థితి.కదలికలేక కనుమమరుగైనవో లేక కాలరాయబడినవో కనుగొనలేని దుస్థితి.

  సమస్తము అస్తవ్యస్తమై,మిక్కిలి చిక్కనిదై,అట్టడుగున చేరి,అచేతనమై,తననుతాను మరుగుపరచుకొనిన మర్మస్థితి.కర్మలకు దూరమైన దయనీయపరిస్థితి.

 అట్టిస్థితిలో మనోవాక్కాయ కర్మలను త్రిశక్తులు,సత్వరజో తమో గుణములను మూడు గుణములు,స్థూల-సూక్ష-కారణమను మూడు శరీరములు,ధర్మార్థకామమోక్షములను చతుర్విధ పురుషార్థములు,కామ-క్రోధ-లోభ-మోహ-మద-మాత్సర్యములను ఆరు శత్రువులు అసలే కానరాని అయోమయస్థితి.

   మనము ఆధారములుగా-కారణములుగా వీటిని పరిగణిస్తే వీటికి ఆధేయములు-కార్యరూపములైన పక్షులు-పశువులు-పదార్థములు-ప్రాణులు,పంచభూతములు-పంచేంద్రియములు,అష్టదిక్కులు-భూగోళ-ఖగోళములు,నదీనదములు,సముద్రములు,అరణ్యములు,ఉద్యానవనములు తమ ఉనికిని కోల్పోయిన హృదయవిదారక స్థితి.

 బాహ్యము-అభ్యంతరము తమ స్వరూప- స్వభావములు సమసిపోయిన స్థితి.వృధ్ధి-క్షయములు,జనన-మరణములు,సుఖ-దుఃఖములు,సంకల్ప-వికల్పములు,చీకటి-వెలుగులు లేని చింతిత స్థితి.

  ఆకార-వికారములు లేవు.పొట్టి-పొడుగు,నలుపు-తెలుపు,ధనిక-పేద,లేదు.జాగ్రత్-నిద్ర-సుషుప్తి అవస్థలు లేవు.అంతా జగము జడముగా మారిన కూష్మాంద స్వరూపము.అంతా చీకటి.నిశ్శబ్దము.శూన్యమో/పరిపూర్ణమో పరిశీలించలేని ప్రమత్తస్థితి.పరవస్తు-స్వవస్తు విషయ పరిజ్ఞానములేని విషయములు విషమించిన ముద్ద,అది జగములు జడముగా మారిన ఒకేఒకటైన ఘనకూష్మాండము.

 కాని విచిత్రము.సంకల్పము-వికల్పము రెండును తానైన పరబ్రహ్మము ముద్దుగా తాను ఆ ముద్దలో ఇమిడిపోయినది.అవ్యాజ కరుణతో ఉధ్ధరించుటకు ఉపేక్షను వీడినది.వికల్పమునకు వీడ్కోలు పలికినది.సంకల్ప మాత్రముచే సహస్ర కిరణ తేజోపుంజముగా -శ్రావ్యమైన ప్రణవమును తోదుతెచ్చుకొని తనకు తాను ప్రచ్ఛన్నమును వీడి,స్వఛ్చందమై ప్రకటింపబడినది.

 ఏం మాయ చేసాడో చెప్పలేను కాని అయోమయము మాయమైనది.ప్రకృతి తన స్వస్వరూపమును పాంచభౌతిక రూపములతో బాటుగా ప్రస్ఫుటము చేసుకొనినది.కదలికలు మొదలైనవి.తోడుగా వచ్చిన శబ్ద సహకారముతో

 పక్షులు-పశువులు-ప్రాణులు పర-పశ్యంతి-మధ్యమ-వైఖరి శబ్దములకు ప్రాణప్రతిష్టను చేసినవి.మేఘములనుండి వచ్చు గర్జనలు.చెట్లు గాలి వీచునపుడు చేయు శబ్దములు పర-పశ్యంతిగా పరిగణిస్తే,పక్షుల కూతలు మధ్య అని,భావగర్భిత భాష వైఖరిగా తన విశిష్టతను వివరిస్తున్నది.చేతనత్వముతో నింగి నేల స్నేహ-బాంధవ్యాలను సమృధ్ధిచేసుకుంటున్నాయి.

 ఏకము అనేకమై మనతో మమేకము అవుతున్నది

తం సూర్యం ప్రణమామ్యహం.


No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...