Wednesday, November 15, 2023

KADAA TVAAM PASYAEYAM-04


కదా త్వాం పశ్యేయం-04 *********************** " జిహ్వ చిత్త శిరోంఘ్రి హస్త నయన శ్రోతైః అహం ప్రార్థితం. నమామి భగవత్పాదం శంకరంలోక శంకరం.". " త్వత్పాదాంబుజం అర్చయామి పరమంత్వాం చింతయామన్వహం త్వాం ఈశం శరణం వ్రజామి వచసా" అని శరణు వేడుతూ.ఈనాటి బిల్వార్చనను ప్రారంభిద్దాము. లేడు-కలండన్నవాడు కలడో-లేడో అంటూ తికమకపడుతున్న శంకరయ్యను చూస్తూ, మీరింకా ఆ చిన్నపిల్ల మాటనే నమ్ముతున్నట్లున్నారు.ఆ పిల్లకు ఎవరు ఏమనిచెప్పారో,ఏమి అర్థముచేసుకుందో కాని మీరు మాత్రం నా మాటలపై సందేహముతో నున్నారనిపిస్తున్నది శంకరయ్యగారు అన్నాడు మనసులో ఎక్కడ మనసు మార్చుకుని, " కంచిత్కాలముమామహేశ భవతః పాదారవిందార్చన" అంటాడేమో అన్న అనుమానముతో. శివయ్య మాటలకు తెప్పరిల్లిన శంకరయ్య అయితే ఆ చిన్నపిల్ల అలా ఊహించుకుందా! పాపం అన్నాడు, జాలిగా. అంతేగా.అంతేగా.కాకపోతే ఎంతమంది మా ఊళ్ళో అనుకుంటారు ... అయినా నాకెందుకులెండి ఆ విషయాలు. ఏదో మీతోపాటు వచ్చి నా పనిచేసుకు పోతాను.ఒకవేళ మీరు పట్టుకోవద్దులే అంటే ........ ఆలోచనలో పడ్డాడు శంకరయ్య.అసలు నేను కదా వాడిని నమ్మనిది.పట్టుకోవాలనుకున్నది.ప్రజలముందు నిలబెట్టి నిజాయితీగా ఉండమనిచెప్పాలనుకున్నది. కాని,విచిత్రం గా శివయ్య కూడా నాకు నచ్చేటట్లు మాట్లాడుతున్నాడేమిటి. నన్ను కలిసినప్పుడు పాదాలుపట్టుకుంటాను-ప్రాధేయపడతాను-పాహి-పాహి అంటాను అన్నాడు కదా.ఇప్పుడేమో అన్నీ నేరాలే చెబుతున్నాడు. సందేహ లహరి ప్రవాహము సాగుతోంది--సత్కృపా లహరి ప్రవాహము సరదా చేస్తోంది. అడగాలనుకున్నదేదో అడిగేస్తే పోలా కానీయ్ -కడిగేయ్ వాడి వైనమును అంటోంది వాక్కు. సందేహము దేహమును ప్రొత్సహిస్తోంది. నీ మాటల ధోరణి విచిత్రముగా ఉన్నాయయ్యా, ఇంతకీ నీవు వాడి పక్షమా-నా పక్షమా అన్నాడు అనుమానంగా శంకరయ్య. ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ మనసులో,పైకిమాత్రం బిక్క చూపులతో , ఏం చెప్పమంటారు నన్ను. మా వాళ్ళంతా అదోరకం.నేనేదైనా వాడిగురించినిజాలుచెప్పాననుకోండి .. ఒద్దులెండి.నా దారిన నేను పోతాను.నా తిప్పలు నేనుపడతాను అన్నాడు శివయ్య . ఒద్దని, శివయ్య చేతిని పట్టుకుని,నేను నమ్ముతానులే. నీవు నా పక్షమే.ఇప్పుడుచెప్పు ఏంజరిగిదో అన్నాడు బాధ్యతగా. మావాళ్ళంతా అదోరకం.వాడిని ఎవరైనా నిందిస్తే ఒప్పుకోరు.ముందు మాటలతో చెబుతారు.వినకపోతే... వినకపోతే రెట్టించాడు శంకరయ్య "దేహశుద్ధే." అందుకే ఇష్టంలేకపోయినా,వాళ్లకునచ్చినట్లు మాట్లాడుతూ ,అక్కడి నుంచి వచ్చేశా .నా వెనుక వాళ్ళెవరైనా అనుసరిస్తున్నారేమోనని అప్పుడు అట్లా చెప్పా.మీరు అభయం ఇచ్చారుగా.ఇంక అన్నీ నిజాలే. అయితే" నువ్వు-నేను ఒక్కటే నన్నమాట" అన్నాడు శంకరయ్య. అవును నేను-మీరు ఒక్కరే ఉన్నమాట అన్నాడు శివయ్య. గతుక్కుమన్న శంకరయ్యను చూస్తూ, మనమే కాదు-మన కర్తవ్యం కూడా ఒక్కటే కదా.అని నా ఉద్దేశ్యం అన్నాడు శివయ్య. ఇంకా ఇంకా వినాలనిపిస్తోంది వాడి వేషాలు.చెప్పు శివయ్యా.. వాడు పక్షులను చీకటిలోనే ఉంచుతాడట. మా పక్కింటి బామ్మ గారు ఎప్పుడు చెబుతూ ఉండేది ఒక పాటలా పాడుతూ, " హంసః పద్మవనం సమిచ్చతి యథా నీలాంబుదం చాతకం కోకః కోకనదప్రియం ప్రతి దినం చంద్రం చకోరస్తథా చేతో వాంఛతి మామకం ..చిన్మార్గమృగ్యం.. అంటే,అర్థంకానట్లు చూశాడు శంకరయ్య శివయ్యను. వెలుగుదారిలేకుండా, హంసలను,చాతక పక్షులను,చక్రవాకములను,చకోర పక్షులను ఒకటి కాదు-రెండుకాదు-మూడుకాదు-నాలుగు పక్షులను ..ఇంకా ఎన్నింటినో అయోమయములో పడవేసి ఆడుకుంటున్నాడట తామరతూడులే తినమని హంసలను,వాననీరు తాగమని తాగమని చాతకములను,అప్పుడప్పుడు కురిసేవెన్నెలను ఆహారముచేసుకోమని చకోర పక్షులను శాసించాడట.మార్గం మృగ్యం-వేరే మార్గము లేదు -కనపడుటలేదు అనుకుని అవి అలానే బతికేస్తున్నాయట. అయ్యో పాపం అని శంకరయ్య అంటుండంగానే ఇంకా చెబుతాను వినండి.జంట పక్షులను కులాసాగా ఉండనీయడు,చక్రవాకపక్షులను రాత్రంతావిడదీసి వినోదిస్తాడు.ఎప్పుడు తెల్లవారుతుందా-మా బ్రతుకులు ఎప్పుడెప్పుడు తెల్లవారుతాయా అంటూ అని కొన్ని-ఎప్పుడెప్పుడు చీకటి పడుతుందా అని మరి కొన్ని ఎదురుచూస్తుంటాయంట ఆశగా. అంతెందుకు ఎక్కడైనా "హే స్వామిన్-ఆదికిరాతకా" అని వినబడిందనుకోండి,అవి "కదా అహం దృష్ట్వా" మా వైపు ఎప్పుడు చూస్తాడో అని భయపడుతూనే ఉంటాయట. అంటే మన శత్రువు, పక్షులను సరిగా తిండి తిననీయడు-తీరుగా ఉండనీయుడన్నమాట. పిట్టల దొర గురించి గట్టిగానే ఆలోచిస్తూ, మార్గ పయనమును సాగిస్తున్నాడు శంకరయ్య మాయా బంధనమును బిగిస్తున్నాడు శివయ్య. కదిలేవి కథలు-కదిలిస్తున్నది కరుణ. 'తన్మై మనః శివ సంకల్పమస్తు వాచే మమశివపంచాక్షరస్తు మనసే మమ శివభావాత్మ మస్తు". పాహిమాం పరమేశ్వరా. (ఏక బిల్వం శివార్పణం)


 

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...