ఆదిత్యహృదయము-01
*****************
శ్లోకము-01
**********
ప్రార్థన
*******
"జయతు జయతు సూర్యం-సప్తలోకైక దీపం
హిరణ సమిత పాప ద్వేష దుఃఖస్య నాశం
అరుణ కిరణ గమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం
సకల భువన వంద్యం భాస్కరం తం నమామి."
శ్లోకము
*******
"తతోయుద్ధ పరిశ్రాంతం-సమరేచింతయాశ్రితం
రావణంచాగ్రతో దృష్ట్వా- యుద్ధాయ సముపాశ్రితం."
పూర్వ రంగము
************
'క్షిప్తాస్చాపి శరాస్తేన శస్త్రాణివివిధానిచ
న రణాయ వర్తంతే మృత్యుకాలేభి వర్తతః"
వానరసేనల రాతి దెబ్బలకును,రాముని శరాఘాతములకును రావణుడు వ్యాకులుడై యుద్ధము చేయలేక యుండెను.దానిని గమనించిన సారథి,రావణుని రథమును పక్కకు మరల్చెను.రావణుడును తన చేతిలోని ధనసును కిందపడవైచెను.తాత్కాలికముగా యుద్ధము ఆగినది.
రజోతమోగుణ ప్రేరేపితుడైన రావణుడు రాముని క్షమా భిక్షనడుగక,సారథిని మందలించి,తన ప్రాణ
ములను కాపాడినందులకు సారథికి కంకణములను బహూకరించి,తిరిగి రణభూమికి రథమును తరలించమని సూచించెను.
రామచంద్రుడు సైతము ఆ మహాసంగ్రామములో,
శ్రాంతం-అలిసిపోయెను.
కాదు-కాదు
పరిశ్రాంతం-పూర్తిగా అలిసిపోయెను.
ఇది దేహపు పరిస్థితి.
దానికి తోడుగా స్వామిమనసు సైతము చింత తో-శోకముతో నిండి మరింత మరింతవిచారమును కలిగిస్తున్నది.
యుద్ధము బాహ్యము-సమరము ఆంతరంగికము.
ప్రస్తుతము రామ-రావణులు యుద్ధముచేయుటలేదు.కాని అలసట ఆశ్రితవాత్సల్యుని ఆశ్రయించినది.అదియును గతములో జరిగిన సీతాపహరణము-సుగ్రీవునితో మైత్రి,వానసేనల సహాయము గతమైతే-రావణుని జయించు మార్గమును,ధర్మ స్థాపనను చేయుట తన కర్తవ్యమను చింతతో నున్న రాముని ఎదురుగా ,యుద్ధ సన్నద్ధుదై,రావణుడు వచ్చి నిలిచెను.
అట్టి రావణుని-సీతపై రాగము-రాముని పై ద్వేషము కలవానిని,
మథనపడుతున్న రాముడు,
దృష్ట్వా-చూసెను.
ఇది కథనము.
సత్యము-ధర్మము శాశ్వతములు.అజరామరములు.సత్యము అన్నియుగములలోను ఒకే విధముగా ఉంటుందికాని ధర్మము యుగములను/కాలమును అనుసరించి సవరింపబడుతుంది.
పాపములకు పశ్చాత్తాపమును మించిన ప్రాయశ్చిత్తము లేదు.కాని రాగద్వేషములు దానిని దరిచేరనీయవు.
కనుక రాముడు క్షమించుటకు సిద్ధముగా నున్నప్పటికిని రావణుడు రణమునే చేయుటకు సిద్ధపడినాడు.
దశేంద్రియములకు లోబడినవాడు దశకంఠుడు.
దశేంద్రియములను సన్మార్గమున నడింపించువాడు దశరథ నందనుడు
ఇంద్రియ వివశత్వము-ఇంద్రియ నిగ్రహముతో పోరునకు సిద్ధమవుతున్నది.
ఇది మథనము.కాదు కాదు అంతర్మథనము.
తం సూర్యం ప్రణమామ్యహం.
No comments:
Post a Comment