శ్రీసూక్తము-01
************
"ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం
చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం " జాతవేదో" మ ఆవహ."
ఇది అమ్మవారి సాకార సంకీర్తనము.సహాయకుడు జాతవేదుడు.అమ్మ బంగారు మేనిఛాయతో మెరిసిపోతున్నది.మేనిఛాయకు మెరుగులు అద్దుతూ సువర్ణ వెండి ఆభరణములు కదులుతూ కాంతులను వెదజల్లుతున్నవి.తల్లి బంగారు మేనిఛాయయే బంగారుమయముగా మరింత ముచ్చట గొలుపుతున్నది.దానికి తోడుగా తల్లి ధరించిన చంద్రరేఖ ఆహ్లాదమును కలిగించుచున్నది.అట్టి పరాశక్తి కరుణతో నా చుట్టు ఉన్న మాయతెరలను తొలగించివేసి,అనుగ్రహరూపముగా నన్ను నిండియుండుటకై,చైతన్యస్వరూపమైన ఓ జ్ఞానమా నీవు నా విన్నపమును అమ్మకు హవిస్సు రూపముగా అందించి,ఆమె అనుగ్రహము నాలో సంపూర్ణముగా నిండియుండునట్లు ఆశీర్వదించుటకు సహాయపడుము.
ఇది బాహ్యార్థము.సాకార దర్శనము.
ఇంకొంచము నిశితముగా అర్థము చేసుకొన కలిగితే అమ్మ "ఈం "బీజ ప్రదాయిని.సర్వానుగ్రహకారిణి.ఆమె లక్ష్మీ-హరిణీం.
హరి మనోవల్లభి కనుక హరిణి
ప్రకృతి స్వరూప-స్వభావము కనుక హరిణి
అశుభములను హరించివేసే తల్లి హరిణి.
అమ్మ ధరించిన సువర్ణ-రజత స్రజములు కేవలము లోహ సరములు కానేకావు.
హిరణ్యము సూర్యుని-రజతము చంద్రునికి వారి నిరంత కదలికలు హారములకు సంకేతములుగా చెప్పబడినవి.
అంతేకాదు అమ్మవారి పాశాంకుశములు రక్షణ-శిక్షణ సంకేతములు
అమ్మవారి స్వరూపము తేజోమయము.స్వభావము కరుణభరితము.
మరికొందరు అమ్మను సువర్ణా,హిరణ్య వర్ణ అక్షరస్వరూపిణిగా ఆరాధిస్తారు.
శ్లోకములో అమ్మ లక్ష్మీ శబ్దముతో సంబోధింపబడినది.
"లక్ష్యతే శ్రేయతే "లక్ష్మీ,
శ్రేయో మార్గమును లక్ష్యముగా భావింపచేయునది లక్ష్మీ
లక్ష్యతే దృశ్యతే లక్ష్మీ-లక్ష్య మార్గమును చూపించునది లక్ష్మీ
జాతవేదుని సహాయముతో నా ప్రార్థనలను విని లక్ష్మీదేవి మనదగ్గర ఉండునుగాక
"హిరణ్మయీం లక్ష్మీ మనసా భజామి"
No comments:
Post a Comment