జై బోలో గణేశ్ మహరాజ్ కి
ముజ్జగములు కొలువ ఓ బొజ్జ గణపయ్య
ముచ్చటైన ఎలుకని ఎక్కి ఒజ్జవైన గణపయ్య
చవితి పూజలు అందుకొనగ చక చకరావయ్యా
....
కీర్తి మూర్తీభవించిన తెల్లని వస్త్రముతో
విష్ణువు అని స్తుతియించగ వ్యాపకత్వముతో
స్పూర్తి ప్రదాయకమైన చంద్రకాంతి శరీరముతో
శత్రు దుర్భేద్యమైన చతుర్భుజములతో
ప్రపన్నతలు తొలగించే ప్రసన్న వదనముతో
అడ్డంకులు అడ్డుకునే దొడ్డదైన కరుణతో
అంబ వదన అంబుజపు వికసిత రవి కిరణముతో
రేయి పగలు చేరుచున్న సుముఖుడివి అను స్తుతులతో
"ఏక దంత" అని కొలుచు అనేకమంది భక్తులతో
కరివదన కనికరమున కదిలి వేగ రావయ్యా.
........
పత్రి పూజలు అందుకొనగ మిత్రుడియై రావయ్యా
ఉండ్రాళ్ళను ఆరగించ మెండు ప్రీతి రావయ్యా
మొక్కులను స్వీకరించ చక్కని దొర రావయ్యా
పది దినములు పలుకరించ,పదికాలాలు బ్రోవ రావయ్యా
..........
ఉత్సవాలు ప్రోత్సహించు,ఉత్త పూజలైన సహించు
కాని పనులు క్షమించు,కానుకలు అనుగ్రహించు
వినతిని స్వీకరించు,వినుతులు స్వీకరించు
పంపిచేస్తామయ్యా కనుల సొంపైన వేడుకగా
మళ్ళీ మళ్ళీ రమ్మంటూ కన్నీళ్ళ వీడ్కోలుగా
మనసులోనే పూజిస్తు మళ్ళీ సంవత్సరానికై
"మజ్జారే" అనిపించే నిమజ్జనాలతో
ఓ ముద్దు గణపయ్య మమ్ము సరిదిద్దగ రావయ్యా..
No comments:
Post a Comment