Monday, July 3, 2017

NAMOSTUTAE SARASVATI



సరస్వతీ నమోస్తుతే
*******************
జగమున శారద నమోస్తుతే _ గగనపు శారద నమోస్తుతే
సుత నారద నమోస్తుతే -సిత నీరద నమోస్తుతే
ఇందిర సఖి నమోస్తుతే -ఇందు ముఖి నమోస్తుతే
వేదసారమా నమోస్తుతే - ఘనసారమా నమోస్తుతే
పటిమ అనుపమ నమోస్తుతే - పటీర ఉపమ నమోస్తుతే
మాఘ శుక్ల పంచమి నమోస్తుతే - మరాళ వాహన నమోస్తుతే
తల్లి ఆకార నమోస్తుతే -మల్లికాహార నమోస్తుతే
నిషాద ఏలిక నమోస్తుతే - తుషార పోలిక నమోస్తుతే
చేత కచ్చపి నమోస్తుతే - ఫేన స్వచ్చత నమోస్తుతే
అజుని నాయికా నమోస్తుతే - రజతాచలమా నమోస్తుతే
కాంతి సంకాశ నమోస్తుతే -కాస ప్రకాశ నమోస్తుతే
పుష్ప కేశిని నమోస్తుతే- పూజ్య ఫణీశ నమోస్తుతే
భక్త మందార నమోస్తుతే - కుంద మందార నమోస్తుతే
వసుధ నాదనిధి నమోస్తుతే - సుధా పయోధి నమోస్తుతే
ఆశ్రిత పోషిత నమోస్తుతే _ సిత తామరస నమోస్తుతే
ఆగమ విహారి నమోస్తుతే -అమర వాహిని నమోస్తుతే
ఓంకార రూప నమోస్తుతే - శుభాకార రూప నమోస్తుతే
పోతన శుభస్తుత నమోస్తుతే - శ్వేత వస్త్రధర నమోస్తుతే
సకల బుద్ధివి నమోస్తుతే - సకల సిద్ధివి నమోస్తుతే
సర్వశుక్ల రూపమా నమోస్తుతే -సరస్వతీ నామమా నమోస్తుతే
మనసా-వచసా- శిరసా సతతం స్మరామి.
పురుషార్థ ప్రదాయినీ పున: పున: నమామి.
భావము
శరదృతువులో పిండారబోసినట్లుండే వెన్నెల- శారద
నీటిని తనలో దాచుకుని తెల్లగా ప్రకాశించే మేఘము- నీరదము
మరల మరల అభివృద్ధిని పొందువాడు చంద్రుడు- ఇందు
ఆత్మార్పణములో అవశేషమే లేనిది కర్పూరము- ఘనసారము
పరిమళము-ప్రశాంతత కలది- మంచి గంధము-- -పటీరము
పాలు-నీరు వేరుచేయ గలిగినది హంస- మరాళము
శబ్ద-స్పర్శ-రూప-రస-గంధాదులు కలిగినది-మల్లెపువ్వు--మల్లిక హార
అర్ద్రతయే స్వభావముగా గలది-మంచు--తుషార
పరుగుల ఒరవడి-నడవడి గలది నురుగు-ఫేనము
చల్లదనము-తెల్లదనము కల కొండ- వెండి కొండ--రజతాచలము
పరమాత్మ సూక్ష్మ రూపములో వసించు గడ్డి(పువ్వు)--రెల్లుపువ్వు--కాశ
అగ్నిని-జలమును సమతౌల్యము చేయగలది-ఆదిశేషుడు-- ఫణీశ
స్వయం ప్రకాశ -సత్వగుణ ప్రతీక-దేవతా పుష్పము--కుంద
కోరిన కోరికలు తీర్చు కల్పవృక్షము---మందార
అవధులులేని అమృతగుణము- పాల సముద్రము-- సుధా పయోధి
సకల జ్ఞాన స్థానమే తెల్ల పద్మము ---సిత తామరస
పైనుండి క్రిందికి దిగివచ్చినది-ఆకాశ గంగ-- అమర వాహినీ
ఓంకార స్వరూపమైన సంపూర్ణత్వము శుభాకారత
ప్రకాశించుట యందు ఆసక్తిగలది భారతి.(జ్ఞాన స్వరూపము)

పోతనగారి సహజకవిత్వపు లోతులగురించి తెలిసికొనుటకు భక్తి-భావన అను రెండు దివ్య నేత్రముల సహకారము ఎంతో అవసరము.వారు ఈ పద్యములో ఎన్నో తాత్త్విక విషయములను పొందుపరచిరి అనిపిస్తోంది.ఇవి అలంకారిక శాస్త్ర ప్రకారము తీసుకున్న ఉపమానములు మాత్రమే కావేమో.కొంచం పరిశీలిద్దాము.
1 స్థూల సూక్ష్మ విషయ విచారణ చేశారనుటకు వారు ప్రయోగించిన
మేఘము-వెన్నెల, మంచు బిందువు-మంచు కొండ,నురుగు-సముద్రము, రెల్లు-కల్పవృక్షము,పద్మము-జ్ఞానము రెండు అమ్మయే అయితే అమ్మ అంటే ఎవరు. ఇంకొంచము దర్శించగలిగితే
పంచభౌతికతత్త్వము ఈ జ్ఞాన ప్రకాశము అనిపిస్తుంది.ఉదాహరణకు,
1.ఆకాశ తత్త్వము- మేఘము-వెన్నెల-చందమామ
2.జల తత్త్వము-మంచు బిందువు,నురుగు,ఆకాశ గంగ,సముద్రము.
3.అగ్ని తత్త్వము- ఆదిశేషుడు {విషము-అగ్నికీలలు)
4.భూతత్త్వము-రెల్లు,కల్ప వృక్షము
5.వాయు తత్త్వము-పువ్వులు చందనము కర్పూరము (సువాసనను వ్యాపింపచేయును)
పంచేంద్రియ సంకేతములు కూడా గోచరిస్తున్నాయి.
సముద్రము- నాదము -కర్ణము (చెవి)
వెన్నెల-గంగ-స్పర్శ (చర్మము)
పువ్వులు-గంధము-నాసిక ముక్కు)
మకరందము-వాక్కు-రసనము (జిహ్వ)
సర్వ శుక్లరూపము-నయనము. (కన్ను)
అంతేకాదు,
శరదృతువు,మేఘము,చంద్రుడు,కర్పూరము,మంచిగంధము,మల్లెపూలు,కల్పవృక్షము,మంచుకొండ.ఆకాశ గంగ,రజో-తమో గుణములనధిగమించితమని తాము స్వఛ్చందముగా సమర్పించుకుంటూ,పరోపకారం ఇదం శరీరం గా ప్రకాశించునవి.
చర్మ చక్షువులకు సరస్వతీదేవి సర్వశుక్ల స్త్రీమూర్తిగా ద్యోతకమగును కాని కొంచము ఆలోచిస్తే పోతన ఆ మూర్తిని పరోపకారమైన పంచభూత స్థూల-సూక్ష్మ ప్రాకృతిక ప్రవాహ జ్ఞానముగా కనుగొనినాడనిపిస్తోంది.
అట్టి జ్ఞానగంగా ప్రవహాము మనలనందరిని అనుగ్రహించుగాక.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...