Monday, July 10, 2017

RAKSHAABANDHANAMU-3

వసుధైక బంధనము రక్షాబంధం.
*************************************
చెల్లీ,
పుట్టినప్పుడు నిన్నుచూసి పులకించిన నా మనసును,
పట్టుపరుపుగా ఒడిని పరిపించింది ఒక బంధం.
అన్నా,
పట్టుపరుపు మీద ఒదిగి పవళించిన నా మనసుకు,
పుట్టింటి చుట్టరికమును తెలిపింది ముచ్చటైన అన్న బంధం.

నువ్వు,
గట్టిగా కొట్టినప్పుడు నిన్నుచూసి బెట్టుచేసిన నా మనసును,
చెట్టుమీది దోరపండు తెంపించేలా చేసింది ఆ బంధం.

నవ్వుతూ,
చెట్టుమీది దోరపండు తింటున్న నా మనసుకు,
చెట్టంత అన్నను చూపించింది,ఎప్పటికి తెంపలేని అనుబంధం.

అమ్మతో,
పితూరీలు చెప్పినప్పుడు నిన్నుచూసి కుతకుతలాడిన నా మనసును,
నా దోసమేమి లేకున్నను దెబ్బలు తినిపించింది అబ్బో అనిపించే బంధం.

నమ్మవు,
దోసిలొగ్గిన నిర్దోషిలో దేవుని చూస్తున్న నా మనసుకు,
తప్పుతెలియ చెప్పింది ఎప్పటికి విడిపోని గొప్పదైన మెప్పు బంధం.

బడిలో,
జాగుగా సాగుతున్న నిన్నుచూసి దిగులుగున్న నా మనసును,
పేగు పంచుకున్నట్లు బాగు బాధ్యతగా మార్చింది సాగుచున్న బంధం.

ఒరవడిలో,
పొరబడనీయని నేరుపును గౌరవముగ చూస్తున్న నా మనసుకు,
గుండెలో గుడికట్టించింది నిండుతనపు తోడబుట్టిన బంధం.

పెళ్ళిలో,
బావకు భార్యవైన నిన్నుచూసి భారమైన నా మనసును,
మేనమామ కాగలవని మేనాగా మార్చింది మేలిమియైన బంధం.

పెళ్ళితో,
పుట్టినిల్లు-మెట్టినిల్లు అని పులకించిన నా మనసుకు,
అమ్మా-నాన్న అన్నీ అన్నలో చూపింది,ఆశీస్సులైన బంధం.

గమనములో,
అహరహము శ్రమించు నిన్ను చూసి అసహనమైన నా మనసును,
విజయోత్సాహ విహంగమును చేసింది ఈ బంధం.

నా మనములో,
వేరులు పాతుకొని వేరుచేయలేని నా మనసుకు
పందిరిగా మారి నందనవనము తానైంది తాడురూపమైన బంధం.


లక్షణముగా,
ఆరుపదుల ఆడపడచుగా నిన్నుచూసిన ముసలి అన్న మనసును,.
వసివాడని వాత్సల్యపు వారధిగా మలచింది వసుధైక బంధం.

రక్షణగా,
ఆ చంద్ర తారార్క అపురూప రక్షా బంధనమునకు నా మనసు,
అజరామర ఆనందమువైపు అడుగులు కదిలించమంది.
(రక్షాబంధన శుభాకాంక్షలు.)

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...