సౌందర్య-బాలాత్రిపుర సుందరి
పరమపావనమైన నీ పాదరజకణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
ఉద్దండ భండాసుర సుతులను ఖండింపగ
తల్లి కవచమందించిన పాలవెల్లి నీవుగ
కర్తవ్యమును నెరవేర్చగ కల్ హార వాసిని
హంసలున్న రథమెక్కిన ప్రాణశక్తి నీవుగ
నవనవోన్మేషముతో నవ వర్ష బాలికగ
నవ్యాలంకృతులతో నవరాత్రి పూజలందు
మాలా-పుస్తక-వరద-అభయ హస్తాలతో
బాలా త్రిపుర సుందరివై పాలించుచున్న వేళ
నీ మ్రోలనే నున్న నాకేలు విడనాడకమ్మా,నా
మానస విహారి! ఓ సౌందర్య లహరి.
" భండాసుర వధోద్యుక్తా బాలా విక్రమ వందితా"
కాముని భస్మమునుండి జనియించిన వాడు భండుడు.మూర్ఖుడు. కొందరిని సంస్కరించి మరికొందరిని సంహరించి అమ్మ వానిలోని అసురతను తన ఆయుధమస్పర్శ ద్వారా తొలగించి వానికి ముక్తిని అనుగ్రహిస్తుంది..భండుని కుమారులు తల్లిపై పగ తీర్చుకొనుటకు చారుబాహుని పంపగా,తల్లి సువర్ణ కవచము నుండి ఆవిర్భవించిన బాల అసుర సంహారమునకు తాను వెడలెదనని,అనుమతించమని శ్రీ మాతను కోరెను.తొమ్మిది వర్షముల లలిత కోమలాంగిని యుద్ధమునకు పంపుటకు అంగీకరించకున్నను, అమ్మబాలాదేవి దృఢ నిశ్చయమునకు దీవించి,ఆయుధములనిచ్చి , పంపినది .వీర శృంగార భరితమైన ఆ పోరులో బాలాదేవి ఆదిశక్తియై అసురతనణచి,సర్వదేవతా స్తుతులను అందుకొనుచున్న సమయమున , చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.
No comments:
Post a Comment