Monday, September 14, 2020

SIVA SANKALPAMU-107

ఓం నమః శివాయ-107 ******************** భక్తుల కంఠస్థమైన శితికంఠుని స్తోత్రములకు-దండాలు శివా పృథ్వీలింగమైన ఏకామ్రేశ్వరునికి -దండాలు శివా అగ్నిలింగమైన అరుణాచలేశునికి-దండాలు శివా జల లింగమైన జంబుకేశ్వరునికి-దండాలు శివా వాయు లింగమైన శ్రీ కాళహస్తీశ్వరునికి- దండాలు శివా ఆకాశలింగమైన చిదంబరేశ్వరునికి- దండాలు శివా సూర్యబింబ లింగమైన కోణార్క దేవునికి-దండాలు శివా చంద్ర బింబలింగమైన చంద్రకోన దేవునికి-దండాలు శివా భక్తి ఆలింగనమైన మహాలింగమునకు -దండాలు శివా (ఓం) న-మ:-శి-వా-య అను పంచాక్షరికి-దండాలు శివా దం-డా-లు-శి-వా అను ఐదు అక్షరములకు-దండాలు శివా సుస్పష్టపు ఇష్టమైన అష్టమూర్తికి-దండాలు శివా. పంచభూతములు-సూర్యుడు-చంద్రుడు-జీవుని కలయికయే అష్టమూర్తితత్త్వము. జగత్ ఈశ ధీయుక్త సేవనం-భగవాన్ రమణమహర్షి. చరాచరాత్మకములన్నియు ఈ ఎనిమిది శక్తుల సంగమమే.సూక్ష్మముగా మనలో పంచభూతములుగా,సూర్యునిగా కంటిని-బుధ్ధిని పాలిస్తూ,చంద్రునిగా మనసును మళ్ళిస్తూ,జీవుని లోని శక్తిగా అష్టమూర్తి సంగమము నెలకొన్నది. సదా శివుడు అష్టమూర్తి తత్త్వముతో ఎనిమిది పేర్లతో ,భూతత్త్వమును వివరించు శర్వునిగా,జలతత్త్వమును వివరించు భవునిగా,అగ్నితత్త్వ ప్రతీకగా రుద్రనామముతో,వాయు తత్త్వధారియై ఉగ్ర నామముతో,ఆకాశ తత్త్వధారిగా గ్రీవా నామముతో,సూర్య ప్రతీకయైన ఈశాన నామముతో,చంద్ర తత్త్వ ప్రతినిధిగా మహాదేవ నామముతో,జీవునికి ప్రతినిధిగా యజమాన మూర్తి పశుపతి నామముతో ప్రకాశిస్తున్నాడు.శివుని అష్తమూర్తి తత్త్వమును అవగతము చేసుకొన్న జీవుడు శివుడుగా పరిణిని చెందుచున్నాడు. శివోహం-శివోహం. తెల్లారి పోయింది పల్లె లేచింది పల్లియలో ప్రతి ఇల్లు కళ్ళు తెరిచింది. స్వామీ నీ దయతో ఈ రాతిరి తెల్లారుట వలన నా శరీరమునకు కమ్ముకున్న చీకట్లు తొలగి వెలుగు రేఖలతో నా కళ్ళు తెరుచుకుంటున్నవి.నా లోని ప్రతి అణువణువు జ్ఞానమయమవుతున్నది,నందివాహనా! .దీనిని కదలకుండా కళ్యాణ కర్తవై నన్ను అనుగ్రహించు . ఇన్నాళ్ళు నేను పూజగా భావించబడినది పూజకాదని,నన్ను నేను మరిచిపోయి త్వమేవాహం (నువ్వే నేను-నేనే నువ్వు) భావనయే తరింపచేయగలిగినదను సత్యము ఇప్పుడిప్పుడే అర్థమగుచున్నది ఆదిదేవా.ఈ భావనను నాలో స్థిరముగా నిలుపు తండ్రీ. నిజమును గ్రహించగలుగు వానికి శివమందిర ప్రాకారములు-ధ్వజస్తంభము-శివలింగము-అర్చకులు-నంది-బలిపీఠము-భక్తులు అన్నీ-అందరు శివస్వరూపముగానే దర్శనమిస్తారు అన్న నిర్ద్వంద్వము నీ దయతో అవగతమగుచున్నది.అనుగ్రహింపుము ఆదిదేవా. ఏక బిల్వం శివార్పణం.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...