Friday, October 9, 2020

PRASEEDA MAMA SARVADAA-08

ప్రసీద మమ సర్వదా-08 మహాగౌరి నమోస్తుతే శ్వేతవృషే సమారూఢా శ్వేతాంబర ధరా శుభాః మహాగౌరి శుభం దద్యాత్ మహాదేవ ప్రమోదదా" అష్టవర్షా భవేద్గౌరీ మహా అత్యంత గౌరి తెల్లని శరీరకాంతి కలది.అత్యంత గౌరవ ప్రదాయిని. శుంభ-నిశుంభులను రాక్షసులు తమకు పార్వతీదేవి పుత్రికతో తప్ప అన్యులతో మరణమును పొందని వరము కలవారైరి.వరబల గర్వితులైన వారు యుక్తాయుక్తములను మరచి ధర్మమునకు గ్లానిని కలిగించసాగిరి. పరమేశ్వరి లీలలు పరమదాయార్ద్రశీలములు.ధర్మసంస్థాపనకు శుంభనిశుంభులు నిర్గమించాలి.దానికి తన సరీరమునుండి ఒక మహాశక్తి తన పుత్రికగా ఆవిర్భవించాలి.దానికొక బాహ్య కారణమును చూపించాలి(మనకు అర్థమగుటకు) కనుక తల్లి తన కాళి రూపము లోని నల్లని రంగును నెపముగా మలచుకొని,దానిని విడనాడుటకు మానససరోవములో మునిగినది.తల్లి తలచుకుంటే కానిది ఏముంది? మానస సరోవరము తన బాధ్యతగా తల్లి నల్లని చర్మమును తల్లి నుండి వేరుచేసి,మహాగౌరిగా అమ్మను ప్రకాశింపచేసినది. తల్లినుండి విడివడిన చర్మమునుండి మహాద్భుత శక్తి "కౌశికి" గా (కోశమునుండి వెలువడినది) ఆవిర్భవించి,అసురుని అస్తమింప చేసినది.తమస్సు ఉషస్సును చేరినది.ఎంతటి దయామయి గౌరీదేవి. సాధకులు గతములో చేసిన పాపములను-వర్తమానములో చేయుచున్న పాపములను తన క్షమాగుణముతో తొలగించి వేసి,భవిష్యత్తులో పాపములు చేయని వారుగా బాగుపరచును. అంతే కాదు.పరబ్రహ్మమును చేరుటకు శిష్యురాలిగా బ్రహ్మచారిణియై,తన గమనమును ప్రారంభించి,మార్గ మధ్యములో అనేక అద్భుతములను మనకు పరిచయము చేస్తూ-మనలను ప్రభావితులను చేస్తూ,గురుస్థానమునకు చేరి గౌరవమునకు పాత్రతను కల్పిస్తూ,మనలను సిధ్ధిదాత్రిమాత వద్దకు చేర్చుచున్నది.ఇంక మనకు కావలిసినది ఏమున్నది. అమ్మ చెంతననున్న మనకు అన్యచింతనలేల? అమ్మ దయతో మన ప్రయాణము కొనసాగుతుంది. అమ్మ చరణములే శరణము.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...