Wednesday, November 10, 2021

murty nayanar

మూర్తి నాయనారు ************ శిశుశశిరేఖా ప్రకాశములవానికి దండాలు శివా సుందరంబగు దరహాసంబులవానికి దండాలు శివా వెండికొండ చరియలందుండు వానికి దండాలు శివా మెండుగ కరుణించు పశుపతినాధునకు దండాలు శివా ******** [08:46, 10/11/2021] విమల: మూర్తి నాయనారు. ******* నిరాకార భగవత్స్వరూపముగా తాను సాకారముగా ప్రకటింపబడుటయే మూర్తిమంతము.ప్రకటింపబడిన స్వరూపముయే మూర్తి. మనము ఈ రోజు సాకారరూపియైన భగవంతుని మూర్తినాయనరుగా కీర్తించుకుందాము. " గంధము పూయరుగా-కస్తూరి గంధము పూయర్య్గా" అని యదునందనుని గంధపుసేవు గానముతో చేస్తూ పరవశిస్తూ ధన్యుడైనాడు త్యాగరాజస్వామి. అదే విధముగా షోడశోపచారములలో ఒకటైన గంధపుసేవా ప్రాశస్త్యమునకు నిలువెత్తు నిదర్శనమైనాడు మన మూర్తి నాయనారు. మంగళకరమైన మధుర పట్టనమున వ్యాపారకుటుంబములో జన్మించిన మూర్తి నయనరు గంధపుచెక్కల వ్యాపారమును చేసేవాడట. మధురలోని చొక్కనాథస్వామికి చందనసేవార్చనాసక్తుడు. ప్రతి ఉదయము స్వామికి తానే స్వయముగా చందనమును అరగదీసి స్వామికి అలంకరించి ఆనందించేవాడు.ఇది బాహ్యార్థము. కాసేపు మనము రాయిని పాంచభౌతిక ప్రపంచమనుకుందాము.దానికి మంచి-చెడులతో సంబంధము లేదు.వేటిపైనను పక్షపాతమును లేదు.ఏ విధముగా నేల-నింగి-నీరు-నిప్పు-గాలి అన్నింటిని/అందరిని సమముగా భావిస్తాయో సాన/రాయి కూడా అంతే.దానిపైన అరగదీయుటకు ఉంచిన చెక్క మన ఉపాధి.మన్సుతో కూడిన శరీరము.అది అరగటము కాలము అనగా మన జీవన పరిమానము తరుగుచున్నదని చెప్పుటకు గుర్తు.ఉపాధిని సద్వినియోగ పరచుకుంటే అది గంధపుచెక్క అనుకోవచ్చును.లేకపోతే నిరుపయోగ చెక్కగా భావించవచ్చును. సాన మీద గంధపుచెక్కను ఉంచినంత మాత్రమున పరిమళము వచ్చి,దిగంతములు వ్యాపించదు.ఎందుకంటే గంధపుచెక్కకు తాను పరిమళభరితమని తెలియదు.నిరంతరము సానపై అరుగుట వలన తెలుసుకోగలుగుతుంది. మన ఉపాధికి కూడ తన పరమార్థము తెలియదు.అది ప్రపంచము మనకందించుచున్న పంచభూతముల సహకారముతో నిరంతరము వానిని ప్రసాదించిన వాని ప్రార్థనము అను పనిలో మునిగితే కాని మన జన్మను సార్థకము చేసుకుని తరించలేము. రాయి మీద గంధపుచెక్క ఉన్నంత మాత్రమున అది మృదుత్వముతో కూడిన పరిమళములను అందించలేదు.అరగదీయుట తెలిసిన వాడే అదృష్టవంతుడు.మన జీవితములో తారసపడు అనేకానేక సంఘటలపై దృష్టిని సారించక సద్గుణములతో కూడిన మన ఉపాధిని,సాధన అదియును నిరంతర సాధన యను పనిలో నిమగ్మమైనప్పుడే సత్కృప అను పరిమళ చందనము మనకు లభిస్తుంది. గంధార్చనతో నాయనారును బంధవిముక్తుని చేయాలనుకున్నాడేమో ఆ సుగంధపుష్టికర్త ,రాజకీయమును రాజీపడకుండాచేసి,మధురనగరములోనికి గంధపుచెక్కల రాకను తప్పించాడు. క్రమక్రమముగా మూర్తినయనరు దగ్గర ఉన్న గంధపుచెక్కలు నిండుకున్నవి.కొత్తవి దొరికే అవకాశము లేదు. ఆట ఆడిస్తున్నాడు మూడుకన్నులవాడు.లోటు చేయనంటున్నాడు వానిని నమ్ముకున్న వాడు. ఇది కాదనలేని సోదాహరణము. కపర్ది కరుణ కఠిన రూపముగా కనపడినను కషటములను కడతీర్చి,కైవల్యమును ప్రసాదించినదనుట శిలా శాసనము. అయిపోయినవి నాయనారు దగ్గర నున్న గంధపుచెక్కలు.సేవా బంధమునకు పరీక్ష పెడుతూ. సుగంధ పుష్టికర్తకు చూడముచ్చటైన వినోదము. సుగంధ సేవాసక్తునకు గంధపుచెక్కకానరాని,దొరుకు ప్రదేశము తెలిసికొనలేని విచారము. కారుణ్యము తాను వస్తూ తనకంటె ముందరగా తమాషా చూపిద్దామని కాఠిన్యమును పంపించిందేమో. సర్వస్యశరణాగతి సానుకూలమైనదా అన్నట్లుగా నాయనారు మనసులోనికి ప్రవేశించినది పరీక్షగా/శివుని రక్షగా ఒక అద్భుత ఆలోచన. చందనము ఒక చెట్టు కట్టే.తన శరీరము ఒక కట్టెనే.నిర్మల-నిశ్చల-భక్తితో నిండిన ఈ కట్టె సైతము అరిగించినచో పరిమళ గంధమును ప్రసాదించగలదు అను తలంపు,తహ తహలాడు మనసును అర్చనకు ఉపక్రమింపచేసినది. తన్మయత్వముతో తన చేతిని రాతిమీద అరగదీస్తున్నాడు మూర్తినాయనారు. బాహ్యము భయపడుతూ పారిపోయినా ,భక్తి భావనలో ఊహాతీత సేవ జరుగుతున్నది. చర్మము చిట్లి పోతున్నది.రక్తము కారిపోతున్నది.మాంసము అరిగిపోతున్నది.ఎముకలు విరిగిపోతున్నాయి.సప్తధాతువులు తమ పట్టును సడలించుకుని విడిపోతున్నాయి. సరగున వచ్చి అక్కున చేర్చుకున్నారు పార్వతీపరమేశ్వరులు. మెచ్చిన కరుణతో మధుర రాజ్యము మైమరచిపోయినది.ఒక్కరోజులో రాజ్యమును అంతా శివమయము చేసాడు,దానికి రాజుని చేసాడు మూర్తి నాయనారునమ్మిన నందివాహనుడు. స్థిత ప్రజ్ఞుడైన మూర్తినాయనారు శివానుగ్రహముతో రుద్రాక్ష కిరీటమును ధరించి,శివదండమును పట్టుకుని,మూడు పూవులు -ఆరుకాయలుగా రాజ్య పరిపాలనను శివాజ్ఞచే కొనసాగించి,అంత్యమున శివస్వరూపమైనాడు. మూర్తి నాయనారును అనుగ్రహించిన సదా శివుడు సర్వవేళల కంటికి రెప్పవలె మనలను కాపాడును గాక. ఏక బిల్వం శివార్పణం.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...