Tuesday, November 9, 2021
SAKKIYA NAYANAR
సక్కియ నాయనారు
******************
[05:42, 09/11/2021] విమల: ఆపదద్రి భేద టంక హస్తతే నమః శివాయ
పాపహారి దివ్య సింధు మస్తతే నమః శివాయ
పాపధారిణే లసన్నమస్తతే నమః శివాయ
శాపదోష ఖండన ప్రశస్తతే నమః శివాయ
ఆపదలు నశింపచేయు ఆయుధునకు దండాలు శివా
పాపములు నశింపచేయు గంగాధరునకు దండాలు శివా
శాపములు తొలగచేయు భక్తవశంకరునకు దండాలు శివా
దండాలు స్వీకరించు దయాసింధువునకు దండాలు శివా.(చంద్రుని శాపమును/పాపమును నశింపచేసిన శివా)
చిదానందరూపా-సక్కియ నాయనారు
************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
శివపూజకు అనుమతిలేని పాలనలో
ఏమి తక్కువచేసెను స్వామి లాలనలో
కనపడులింగము పూర్వము తానును రాయియే కదా
ఆ రాయికి రాతిపూజ అపూర్వపు సేవయే కదా
దూషణలన్నియు చేరు నిన్నుప్రదోష పూజలుగ చాలు చాలు
భావము గ్రహియించలేని నిన్ను భజియించుట భావ్యము కాదు కాదు
అనినను,లెక్కకుమించిన పున్నెము సక్కియ నాయనారుకు
సదాశివుని కరుణను పొందగ విసిరిన రాళ్ళే కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు శివోహం జపంబ నా చింతలు తీర్చు గాక.
సత్యాన్వేషణ సాధనముగా ఏ మతమైనను వారికి ఆమోద యోగ్యమే.సర్వమత సత్కారము-స్వీయ మత స్వీకారము వారి అభిమతము.అన్యమతముల వారిని నొప్పించకుండా బాహ్యమున నడుచుకుంటూ,ఆంతర్యమును ఆరాధనతో సుసంపన్నము చేసుకొనే చాకచక్య భక్తులులలో సక్కియ ఒక్కరు.
అన్నమాచార్యులు కీర్తించినట్లు,
" అన్ని దైవములిందే ఆవహించెను" అనుకొనుచు,అర్చన చేయగల,అదియును పూజాద్రవ్యము యొక్క బాహ్య రూపమును గమనించగలిగినప్పటికి,ఆంతరంగిక శుధ్ధితో వాటిని అతిపవిత్ర పూజాద్రవ్యములుగా భావించుకొనగలిగిన అత్యున్నత సంస్కారులు.
నాలుగు విషయముల సమాహారమే ప్రపంచము అని నమ్మువాడు సక్కియ నాయనారు.అవి,
1.భక్తి
2.భక్తుడు
3.ఫలితము
4.ఫలితమునందించు పరమాత్మ
సత్యము-శివము-సుందరము తానైన పరమాత్మను ఏ రూపములో ఆరాధించినను,ఏ సంప్రదాయమును పాటించినను కావలిసినది సర్వస్య శరణాగతి మాత్రమే అని నమ్ముతూ,బాహ్యమునకు బౌధ్ధ భిక్షువు ఆహార్యముతో,అంతరంగమున సదాశివుని ఆరాధనతో నుండేవాడు.
స్వామిని సమీపించగనే సక్కియ మనసు సెగ తగిలిన వెన్నవలె కరిగిపోతుండేది.హృత్పుండరీకము స్వామి ఆసనముగా మారి వికసనము చెందేది.కన్నులు అనిర్వచనీయానందముతో హర్ష వర్షములయేవి.
" పవి పుష్పంబగు-అగ్ని మంచగు"
అని శ్రీకాళహస్తీశ్వర శతకములో ధూర్జటి మహాకవి సెలవిచ్చినట్లు ,
నిధనపతిని(పాపములను నిధనము చేసి రక్షించు స్వామిని)
ప్రసన్నము చేసుకొనుటకుు కావలిసినది భక్తితత్పరతయే కాని బాహ్యపూజలు కావని చాటిన సక్కియ నాయనారుగా కీర్తింపబడు "సాక్కయ నాయనారు" తిరుశంగమలై లోని వ్యవసాయ కుటుంబములో జన్మించాడు.బౌధ్ధమత అవగాహనకై కాంచీపురములో విద్యాభ్యాసమును చేసెను.సమయస్పూర్తి కల సక్కియ నాయనారు సత్య-శివ-సుందరుని భక్తుడైనప్పటికిని(ఆంతర్యములో) బాహ్యమునకు మాత్రము బౌధ్ధ భిక్షకుని వలె కనిపిస్తూ,క్రమము తప్పక రూపి/అరూపిగా,ద్వంద్వముగా/ద్వంద్వాతీతునిగా నున్న శివలింగముపై రాళ్ళు తిడుతూ విసిరికాని భోజనమును చేయని నియమము కలవాడు.
.
స్వామిపై రాళ్ళు విసురుట అపచారము కాదా అన్న సందేహము మనలో చోటు చేసుకొనవచ్చును.ఆంతర్యము అపరాధమును సవరించుచున్నట్లున్నది.పరవశముతో నాయనారు అర్చనను స్వీకరిస్తున్నాడు పరమేశ్వరుడు.
ఏలేవాడు ఎందుకో సక్కియ మనసున ఏమరపాటును కలిగించాడు.వడివడిగా నడుస్తూ,ఇంటికి వెళ్ళి భోజనము చేయుటకు సిధ్ధమయ్యాడు.
భజన మానిన వానిని భుజింపచేయనిస్తాడా ఆ భుజంగభూషణుడు.
తప్పిదమును గ్రహించిన నాయనారు,చప్పున రాయిని చేత తీసుకుని పెద్దరాయి మీద విసరడానికి వచ్చాడు.బాహ్యము.
ముసిరిన చీకట్లను స్వామిచే తొలగింప చేయుటకు విసిరిన రాయి వికసిత కుసుమముగా పరివర్తనమును చెందింది.పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు.
సాక్షాత్కరించిన సామికి సాష్టాంగ దండప్రణామాలు సక్కియతో పాటు మనవి కూడా సమర్పిద్దాముు.సక్కియను తన దాసునిగా స్వీకరించిన దయాంతరంగుడు మనలను అనిశము రక్షించును గాక.
( ఏక బిల్వం శివార్పణం.)
Subscribe to:
Post Comments (Atom)
TANOTU NAH SIVAH SIVAM-13
. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...
No comments:
Post a Comment