Tuesday, December 3, 2019

MARGALI MALAI-22

  మార్గళి మాలై-22
    ***********


       ఇరువదిరెండవ పాశురం
   ************************

  మార్గళి మాలై-22
  ************

 అంగన్ మాల్యాలత్తు !అరశర్ అభిమాన
 బంగమాయ్ వందు నిన్ పళ్ళికట్టిల్ కీళే
 శంగవిందుప్పార్ పోల్ వందుతలై ప్పెయిదోం
 కింగిణివాయ్ చ్చెయద తామరై పూప్పోలే
 శెంగణ్ శిరిచ్చిరిదే ఎమ్మేల్ విళియావో?
 తింగళుం ఆదిత్తియనుం ఎళుందార్ పోల్
 అంగణ్ ఇరండు గొండు ఎంగుల్మేల్ నోక్కదియేల్
 ఎంగళ్మేల్ శాబం ఇళిందు ఏలో రెంబావాయ్.


   తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో.
   ***********************


 శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము
 శ్రీ నీళా రంగనాథుల అనుగ్రహము అనవరతము

 సుందర-సువిశాల భూమండలమేలిన రాజులు
 నీ ముందర నిలబడినారు జితబాణులు నిరహంకారులు

 సుందర-సువిశాల సంసారాంబుధి మునిగిన భామలు
 నీ ముందర నిలబడినారు జితగుణులు నిరహంకారులు

 మారాకను ప్రశ్నించుట మా పాపపు శాపము పంచుట
మావాడవు నీవనుకొను మమ్ముల దూరమునుంచుట

 ఉదయించనీ సూర్యుని-చంద్రుని ఒకపరి ఉత్సవమనుకొని
 మెమెల్లగ తాకుతు నెమ్మది శాపం దహియించమని

 అరతెరచిన కన్నుల వేడుక అగుపించని మువ్వల పోలిక
 ఆలస్యము చేయక మన వ్రతమునకు రారాదో



  ఈ పాశురములో గోదమ్మ స్వామి విరిసి-విరియని( తెరిచి-తెరవని) నేత్ర సౌందర్యమును వాచ్యార్థముగా చెప్పినప్పటికిని,అభిమాన రాహిత్యమును,అనన్య శరణత్వమును,ఆశ్రిత వాత్సల్యత్వమును అన్యాపదేశముగా వివరించుచున్నది.

 క్రిందటి పాశురములో రాజులు బాణజితులై యుధ్ధములో ఓడిపోయి స్వామి ముంగిట నిలిచియున్నారు.గోపికలును  స్వామి ముంగిట నిలిచియున్నారు.వీరు బాణ జితులు కారు.స్వామి యొక్క సద్గుణములచే ఓడింపబడిన వారు.వీడి యుండ లేని వారు.గుమ్మము దగ్గర నిలబడిన వారు లోపలికి రావచ్చును.లేక తిరిగి వెళ్ళి పోవచ్చును.కాని గోపెమ్మలు వచ్చేశాము అంటున్నారు.తిరిగి వేళ్ళే అభిప్రాయము వారికి లేదు.

 వారి పూర్వపు మనోభావములు వేరు.ఇప్పుడు వారు ఆచార్యుల సాంగత్య ప్రభావితులై.రాజులు ఏ విధముగా అందమైన గొప్పవైన సువిశాలమైన తమ రాజ్యములను తృణప్రాయముగా వదిలివేసి వస్తారో,అదేవిధముగా గోపికలు,మమకారము అను అందమైన,అహంకారము అను గొప్పదిగా భావించు విశాల సామ్రాజ్యమును వదిలివేసి వచ్చి తలుపు దగ్గర నిలబడక,నీ మంచము కోళ్ళ క్రింద ఉన్నాము అంటున్నారు. అంతే కాదు వారు అభిమానమును అవమాన పరచి వచ్చేసాము అంటున్నారు.ఆరు సూత్రముల అందమైన అరవిందము అభిమాన రాహిత్యము.అవి,1) అనుకూల సంకల్పము.2.) ప్రతికూల వర్జనము.3.) రక్షకుని యందు విశ్వాసము.4) రక్షకుని యందు విధేయత.5.)తన తక్కువ తనమును ఒప్పుకొనుట.6.)నీవే మాకు దిక్కు నిత్యము  కృష్ణా అను నమ్మిక.

 గోదమ్మ ఈ పాశురములో ఎమ్మేల్-ఎంగళ్ మేల్-ఎంగళ్ మేల్ అని మూడుసార్లు ముక్కరణముల (త్రికరణముల) అని పలుకుచు ఆశ్రయణ అతిశయమును అర్థవంతముచేసినది.చీకటికొట్టు వంటి "ఇరు తరుళ్ మాల్యానాలను" అంగన్ మాన్యాలు గా ప్రకాశవంతము చేస్తూ,స్వామి అణ్-అందమైన,ఇరండు-రెండు, కణ్ కన్నులను, కొంచము కొంచముగా తెరచి అనుగ్రహించమని ,అరవిరిసిన కన్నుల మరంద ధారలలో మునిగి జలకములాడనీయమని వేడుకొనుచున్నది.
 .
 నియమ పాలన చేయు సూర్య నేత్రము "న క్షమామి" అని అంటుంటే,అమ్మ పురుషకారము స్వామిని అనునయిస్తుండగా "న త్యజామి" అని పలికించునది చల్లని చంద్ర నేత్రమట.ఎంతటి చక్కని ఉపమానము.అదే విధముగా ఆచార్యులు ఆర్య భాషా అనుగ్రహణము సూర్య నేత్రమైతే,ద్రవిడ వేదానుగ్రహము చంద్ర నేత్రమట." యద్భావం తద్భవతి.
 తామర వంటి నోటిని తెరిచి,తేనెలూరునటుల తమతో మాటలాడి,ఆనందాబ్ధిలో జలకములాడించుట అనన్య శేషత్వమునందించుట.
.

 తమో భూయిష్ఠమైన భూలోకము సత్సంగ సద్గుణ ప్రభావముతో కాంతివంతమగునట్లు ,స్వామి 'తింగళుం ఆదియనుం ఎళుందార్" తో ప్రకాశవంతము చేయమనుచు,వ్రతము కొనసాగించుటకు మనము ఆశ్రయణ దశను అధిగమించి,అనుభవ దశలోనికి ప్రవేశిస్తున్నాము.


  జై శ్రీమన్నారాయణ-జైజై శ్రీమన్నారాయణ.

 ( ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.)







No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...