నీ చిన్మయముద్రను నేను అనురక్తితోచూస్తుంటే
నీ తలపని గంగమ్మ నన్ను తుంగతొక్కుతానంటున్నది
నీ జటాజూటము నన్ను దక్షుడు అనుకుంటున్నది
నీ శిరమున శశి గ్రహణము నాకేనని అంటున్నది
నీ కంఠములోని విషము నన్ను కబళించాలనుకుంటున్నది
నీ చేతి డమరుకము నా వివరము అడుగుతున్నది
నీ నడుము పులితోలు కలవరమేఅంటున్నది
నీ వాహనమైన ఎద్దు నన్ను గద్దిస్తోంది
నీ మంజీరమైన పాము నాపై బుసలు కొట్టుతున్నది
నీ వైనము ఏమిటి? నావైపు చూడవు భయముతో
ఉక్కిరిబిక్కిరి అవుతున్నానురా ఓ తిక్క శంకరా!
శివ దర్శనమునకై వెళ్ళిన భక్తుని శివుని గంగ-జటాజూటము-చంద్రుడు-విషము-డమరుకము-పులితోలు-మంజీరము ఎద్దు ఎద్దేవా చేస్తూస్వామి దగ్గరకు వెళ్ళనీయకున్నవి.శివుడు వాటిని మందలించలేని అసమర్థతతో,కళ్ళుమూసుకొని ధ్యానముద్రలో నున్నట్లు నటిస్తున్నాడు.
వైనము నమః శివాయ-ధ్యానము నమః శివాయ
భయము నమః శివాయ-అభయము నమః శివాయ
నమఃశివాయ నమః శివాయ ఓం నమః శివాయ
" జటాభిర్లంబమానాభిరృత్యంత మభయప్రదం
దేవం శిచుస్మితం ధ్యాయేత్ వ్యాఘ్రచర్మ పరిష్కృతం"
వ్రేలాడుచున్న జటలతో కూడినవాడై,నృత్యము చేయుచున్న వాడును,అభయమునిచ్చువాడును,స్వచ్చమైన చిరునగవు కలవాడును,వ్యాఘ్రచర్మముచే అలంకరింపబడినవాడును అగు సదాశివుని ధ్యానించెదను.
No comments:
Post a Comment