Monday, June 1, 2020

OM NAMA SIVAAYA-73


  ఓం నమః శివాయ-73
  ******************

 నీకన్న నీగుడులు నిరతము కిక్కిరిసి పోతుండగ
 నీకన్న నీ బసవని అనయము కొనియాడుతుండగ

 నీకన్న నీసిగశశి చాంద్రమానమగుచుండగ
 నీకన్న నీజటలో గంగ నీరాజనములను పొందుచుండ

 నీకన్న నీ కృత్తిక నిఖిలకీర్తినొందుచుండ
 నీకన్న నీనామము నలుదెసల నర్తించుచుండ

 నీకన్న నీ పరివారము ప్రస్తుతింపబడుచుండగ
 నీకన్న నీభక్తుల కథలు మారుమ్రోగుచుండగ

 నీకన్న నీ భోళాతనమే వేళాకోళమగుచుండగ
నువు చూసి-చూడనట్లుగా-తెలిసి తెలియనట్లుగా

 పోనీలే అంటుంటే-కానీలే అని మిన్నకుంటే
 తొక్కేస్తారుర నిన్ను ఓ తిక్క శంకరా


 శివుని కన్న శివుని గుడులు-బసవడు-చంద్రుడు-గంగ-కృత్తిక-నామము-ప్రమథగణములు-పరివారము మిక్కిలి ప్రశస్తిని గాంచినవి కాని శివుడు మాత్రము కిమ్మనకుండా ముక్కుమూసుకొని జపము చేస్తూ కూర్చుంటాడు కాని తన వైభవమును ప్రదర్శించుటకు సిధ్ధముకాడు-నింద.

 చంద్రుడు నమః శివాయ-బసవడు నమః శివాయ
 కృత్తిక నమః శివాయ-కృత్యము నమః శివాయ

 నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.



  " నిత్యానంద రసాలయం సురమునిస్వాంతాంబుజజాతాశ్రయం
    స్వచ్ఛం సత్ద్విజ సేవితం కలుషహృత్సద్వాసనావిష్కృతం
    శంభుధ్యాన సరోవరం వ్రజ మనోహంసావతంసస్థిరం
    కిం క్షుద్రాశ్రయ వల్వల భ్రమణ సంజాత శ్రమం ప్రాప్స్యసి."

  శివధ్యానము నిత్యానందమనే సరోవరము.శివుని దయతో దేవతల-మునుల-భక్తుల హృదయమనే పద్మములకు ఆ సరోవరము ఆశ్రయమిచ్చినది.చిత్తచాంచల్యములనే కాలుష్యములను తొలగించి,సంస్కారములనే సువానలను వెదజల్లునది అది.శివా నేనింతవరకు అజ్ఞానమనే తెరచే కప్పబడి నిన్ను-నీ బసవని-గుడులను-చంద్రుని-గంగను-కృత్తికను-నామమును-ప్రమథులను-పరివారమును అన్యముగా భావించితిని.అజ్ఞానమనే బురదగుంటలో నుండుటచే వాటికి ఆ వైభవమును కల్పించినవాడివి నీవేనని తెలిసికొనలేకపోతిని.పరమ దయాళు!నీ అనుగ్రహవీక్షణము నా కనులను తెరిపించినది.నన్ను నిశ్చలమనసుతో నిత్యానంద సరోవరములో నిర్మల సరోజము వలె ప్రకాశించనీయితండ్రీ.నమస్కారములు.-స్తుతి.

  ఏకబిల్వం శివార్పణం.

.

















No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...