ఓం నమః శివాయ-66
**********
నీ రూపము చూపించే కన్ను కన్నుమిన్నుకానకుంది
మళ్ళీ చూప్[ఇంచమంటే మళ్లను నేను అంటున్నది
నీ నామము వినిపించే చెవి చెవిటివాడనని అంటోంది
మళ్లీ వినిపించమంటే శంఖమూదరని అంటున్నది
నీ నామము పలికించే వాక్కు నన్ను సన్నగా నొక్కుతోంది
మళ్ళీ పలికించమంటే కిక్కిరుమనకు అంటున్నది
నీ చుట్టు తిరుగుకాలు నాపై ఒంటికాలిపై లేస్తున్నది
మళ్ళీ తిరుగుదామంటే పనిలేదా అంటున్నది
నీ చెంత వంగు తల నన్ను అతలాకుతలము చేస్తున్నది
మళ్ళీ వంగమన్నానని అవతలకు పొమ్మని అంటున్నది
శివునికేమి చేయాలని చీకాకుపెడుతున్న వాని
కొక్కిరాయి పనులను ఆపవేర ఓ తిక్కశంకరా.
శివుడు సర్వము తన కనుసన్నలలోనే నడుస్తుందని గొప్పలు చెప్పుకుంటాడు కాని భక్టుడు తన ఇంద్రియములు తన మాట వినటములేదని మొరపెట్టుకుంటున్నా ,వాటిని మందలించి,సరిచేయలేని అసమర్థుడు-నింద.
కన్ను నమః శివాయ-కనుసన్న నమః శివాయ
కరుణ నమః శివాయ-కైవల్యము నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
" మనస్తే పాదాబ్జే నివసతుః వచః స్తోత్రఫణితౌ
కరౌచాభ్యర్చాయం శ్త్రుతిరపి కథాకర్ణనవిధౌ
తవధ్యానే బుధ్ధిర్నయన యుగళం మూర్తివిభవే
పరగ్రంధైః కిం వా పరమశివ జానే పరమతః"
శివానందలహరి.
ఓ సదాశివా! నా మనస్సు నీ పాదపద్మములందు,వాక్కు నీ స్తోత్రపఠనము నందు,చేతులు నీ పూజయందు,చెవులు నీ కథలను వినుట యందు,బుధ్ధి నీ ధ్యానమునందు,కన్నులు నీ దివ్య స్వరూపమును దర్శించుట యందు,లగ్నమగునట్లు చేయువాడవు నీవొక్కడివే.ఇతరులకు సాధ్యము కానిపని.నీ అనుగ్రహము లేని మానవప్రయత్నము వృధాప్రయాస.నా ఇంద్రియములను సంస్కరించి,నన్ను కృతార్థుడను చేయుము శివా.అనేకానేక నమస్కారములు.-స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
No comments:
Post a Comment