స్మరణ భక్తి
పరమపావనమైన నీ పాదరజకణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
చపలత్వముతో ఎగురుచున్న చేపవంటి నన్ను చూస్తూ
కపటత్వముతో మింగనున్న కొంగనుండి రక్షిస్తూ
తప్పుడు పనులనే మునుగుతున్న ఉప్పెనలో నన్ను చూస్తూ
చెప్పరాని దయతో తేలుతున్న తెప్పవేసి రక్షిస్తూ
పాతాళములోని సుడిగుండములో నన్ను చూస్తూ
మాతవై పడనీయక పైకిలాగి రక్షిస్తూ
వీక్షణమాత్రమైన పాదధూళి విస్తారణ కరుణగా
విస్మయ పరచుచు నాలో స్మరణభక్తియైన వేళ
నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి ఓ సౌందర్య లహరి.
బింబాధరం పృథులమౌక్తికశోభినాసమ్ |
ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం
మందస్మితం మృగమదోజ్జ్వలఫాలదేశమ్"
ఆది శంకరాచార్య స్మరణభక్తి కనక ధారలనే వర్షించి అమ్మ దయను అనుభూతిగ మలిచినది.నిరాటంక-నిశ్చల-నిర్విరామ భగవత్ తపనయే,ఎప్పుడు తల్లి దర్శన-సంభాషణ-అనుగ్రహ రసానుభూతిలో మునకలు వేయుచుండుటయే స్మరణము.ఒక విధముగా ఇది అనుభవము యొక్క అనుభూతిగా అనవరతము అనందడోలికలను ఊగుతుంటుంది.
" అడిగో రామయ్య నా ఆ అడుగులు నా తండ్రివి-ఇదిగో శబరి-శబరి వస్తున్నానంటున్నవి"స్మరణ బత్తికి పరాకాష్ఠ.పామరతగా పైకి తోచినను పండిన భక్తి కదా!
మందార మకరంద మరందమును గ్రోలించిన ప్రహ్లాదునిది చిరస్మరణీయ భక్తి. సర్వకాల సర్వావస్థలలో సహచరించుచు,సత్వగుణ శోభితమై, సదాశివ స్వరూపిణిని రూప స్మరణము-భావ స్మరణము-తాదాత్మ్య స్మరణముతో తల్లిని సేవించుబారిని బ్రోచు సమయమున,చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.