న రుద్రో రుద్రమర్చయేత్-19
**************************
కృపాకటాక్ష అక్షర స్వరూపునకు దండాలు శివా
నందివాహనుడు చిదానందమునకు దండాలు శివా
సద్గతి ప్రసాదక భక్త మందారకునకు దండాలు శివా
ప్రియమిత్రులారా ఈ రోజు బిల్వార్చనలో మనము "వృషభ" శబ్దమును గురించి తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము.
"వరపుత్రునికై కఠోరముగ ప్రార్థించెను శిలాదుడు పరమేశుని
ఫలితముగ అయోనిజుడై ఆనందుడు ఆవిర్భవించెగ యజ్ఞవాటికను
సకలవిద్యలు కరతలామలకములైనవి శివానుగ్రహమున బాలునికి
మిత్రావరుణుల వారికి చేసిన సేవలైనది భావిసూచకము
"దీర్ఘాయుష్మాన్ భవ" అను దీవెన చేరగ తడబడినది
కారణజన్ముడు కైలాసమును చేరవలసిన తడవాయినది
సత్యము-ధర్మము-శాంతము-శౌచము అను నాలుగు పాదములతో
ఆశీర్వదించబడి హరునికి నందివాహనమగుటకు కారణమాయెగ"
శిలాద మహర్షి సత్యకాముడు.పరమ శివభక్తుడు.అతని భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఏదైన వరమును కోరుకొమ్మనెను.అందులకు శిలాదుడు శివా నిన్ను నా పుత్రునిగా చూడాలను కోరికను అనుగ్రహించమని వేడుకొనగా ,తథాస్తు అని శివుడు అంతర్థానమయ్యాడు.
ఈశ్వరానుగ్రహ సూచకముగా శిలాదునకు తన క్షేత్రములో ఒక దివ్యతేజస్సుగల బాలుడు లభించెను.ఆనందదాయకునిగా గుర్తించి "నంది" అను నామకరణమును చేసెను.బాలుడు సదాచారపరునిగా దినదిన ప్రవర్థమానమగుచుండెను.ఒకపరి వారి ఆశ్రమమునకు మిత్ర-వరుణ అను ఇద్దరు మహర్షులు (సూర్య-జలము) అతిథులుగా వచ్చిరి."అథిథిదేవోభవ" అన్న సూక్తిని నిజముచేస్తూ,అత్యంత భక్తి శ్రద్ధలతో వారిని సేవించెను.సంతృప్తులైన వారు నందిని దీవించునపుడు విచారవదనులై యుండుటను గమనించిన శిలాదుడు కారణమడుగగా వారు నంది అల్పాయుష్కుడని అందులకు దీర్ఘాయుషుమాన్ భవ అని దీవించలేకపోతున్నామని చెప్పిరి.తండ్రి విచారమునకు కారణమును తెలుసుకొనిన నంది స్వామిని సేవించుటకై వెడలి,కఠోర దీక్షతో తపమును చేసెను.ప్రసన్నుడైన శివుడు నంది భక్తికి మెచ్చి,కొన్ని సంస్కారములను జరిపించి,తన వాహనముగా ఆశీర్వదించెను.
మనము గమనించవలసిన విషయము కథ కాదు.కథలోని పరమార్థము.వాహకునకు-వాహనమునకు గల అభేదము.స్వామి-స్వామి వాహనము చర్మచక్షువులకు మాత్రమే ద్వంద్వము.నిజమునకు అది నిద్వంద్వము.నిరాకారము.నిర్గుణము.నిరంజనము.
ఇంకో విషయము నరరూపముగా నున్న నంది పశురూపముగా ప్రకటింపబడుటను సంస్కారమంటున్నారు.నిజమేనా.
ధర్మమును నాలుగు పాదములా నడిపించుటకు రెండుపాదములు నాలుగు పాదములైనవి.సత్యమును అధిరోహింపచేయుటకు మూపురమేర్పడినది.స్థితికార్యమును కొనసాగించుటకు బీడుపొలములను సాగుచేయుటకు వృషభరూపము ప్రకటింపబడినది.
ఆధ్యాత్మికముగా ఆలోచిస్తే ధర్మ-అర్థ-కామ-మోక్షములను నాలుగు దశలను చేర్చునవి ఆ నాలుగు పాదములు.తురీయావస్థనందు కూర్చుండునట్లు చేయునది ఆ మూపురము.ధర్మపరిపాలన ప్రకటనమే నంది స్వరూపము.ఆనందప్రదానమే నందిధామము.
రుద్రము నందు సైతము నంది ప్రస్తావనమును
2వ అనువాకము 4వ మంత్రము
" నమో బభ్లుశాయ వివ్యాధినేజ్ న్నానాం పతయే నమః"
బభ్లుశాయ అను పదమునకు వృషభవాహనుడు,
వృషభమునందు శయనించువాడు/ధర్మమే తానైనవాడు
కపిల/గోరోజన వర్ణముతో ప్రకాశించువాడు
వృషభరాశి-ఊర్థమునకు పయనించువాడు
ల,ర ల అభేదమును పాటిస్తే
బభ్రువు-సకల చరాచరములను భరించువాడు అను పెక్కు అర్థములను చెబుతారు.
అన్నానాం వివ్యాధినే-అన్నసంపదలకు శత్రువులను దూరముచేయువాడు-అన్నపూర్ణేశ్వరునిగా,సమస్తకళ్యాణ ప్రదునిగా,నమకము
బభ్లుశాయ అని ప్రస్తుతించినది.
3. వ అనువాకము 13 వ మంత్రము
" నమః ఆసీనేభ్యః శయానేభ్యశ్చవో నమః"
ఉభయనమస్కార యజుస్సు.వాక్య ప్రారంభము ముగింపు నమ శబ్దమును కలిగియున్నది.
ఈ మంత్రమును మనము నంది పరముగాను,మన దేహ పరముగాను అన్వయించుకుంటే ధర్మమునధిష్ఠించిన వానికి,ధర్మములో శయనించినవానికి,సూక్ష్మ -స్థూల ధర్మములో తానైన రుద్రునకు నమస్కారములు.
శరీరపరముగా అన్వయించుకుంటే సూక్ష్మ -స్థూల-కారణ శరీరములు తానైన రుద్రునకు నమస్కారములు.
నమః శంగాయచ-పశుపతియేచా పశుపతిగా శుభములను వర్షించు రుద్రునకు నమస్కారములు.
రుద్ర చమకములో సైతముకోడెదూడల ప్రసక్తివచ్చినది తల్లికడుపులోనున్న దూడలు,అప్పుడే పుట్టిన దూడలు,ఒకటిన్నర,రెండున్నర,మూడున్నర సంవత్సరముల దూడలు సంకేతించబడినవి.
వివిధ జీవిత ఆశ్రమ వ్యవస్థలేమో.
అంతే కాకుండా
అనడ్వాంచమే అంటూ బండిని లాగెడి ఎద్దులను ప్రస్తావిచినది.
ఉక్షాచమే-వీర్యసేచన సామర్థ్యత కల ఎద్దు
ఋషభశ్చమే-ఉక్షముకన్నా పెద్ద వయసు గల ఎద్దు
అనడ్వాంచమే-ఆధ్యాత్మికతను ప్రతిష్ఠించగల ఎద్దు
అంటు సంకేతముగా ఎద్దు పదము ప్రయోగింపబడినది.
ధర్మప్రతిష్ఠాపనలోని వివిధ దశలను వివిధ ఎద్దులతో సంకేతించబడినది.
{తప్పులున్న నన్ను సరిదిద్దగలరు )
నందివాహనుడు నందిగా ప్రకటితమగుతు పాండవులను మనలను అనుగ్రహించిన కథను చెప్పుకుందాము.
అదియే కేదారనాథ క్షేత్రము.కేదారము పంటపొలమును పరిరక్షించు స్వామి.ఆ పంట అన్న ప్రసాదమైనా కావచ్చును/ఆధ్యాత్మికమైనా కావచ్చును.
పురాణకథనము ప్రకారము కురుక్షేత్ర సంగ్రామానంతరము గోత్రహత్యా పాతకమునకు ప్రాయశ్చిత్తముగా పాండవులు కాశిలో విశ్వనాథుని సేవించుకొనుచుండిరి.స్వామికి కావలిసినది వారికి గుప్తకాశి దర్శనము-సేవము.లీలగా తాను కాశియందు లేనట్లుగా వారిని భ్రమింపచేసి,వారు వెతుకుచుండగా ఎద్దురూపమున ,మందాకినీతీరమున,6 నెలలు మంచుతో కప్పబడి,తన గుడి మూసియుండుటను సమ్మతించి,జ్యోతిర్లింగముగా అనుగ్రహించుటకు సిద్ధమైనాడు.అనువుగా అక్కడ వృషభరూపములో గడ్ది మేస్తున్నట్లు భీమునకు కనిపించాడట.దాగుడుమూతలు దయ యొక్క కాగడాలుగా మార్గాన్ని చేరుస్తాయి.పాండవులను సైతము పావనులను చేశాయి.పారిపోతున్నాడు స్వామి.పట్టుకోవాలనుకున్నారు వారు.ధావతే సత్వనాం పతి.స్వామి పృష్టభాగము లభించినది.పునీతులను చేసినది.
పంచకేదారములలో మొడటిది గా కేదారనాథుని కన్నులముందు సాక్షాత్కరింపచేసినది.అంతర్ద్వార దర్శనము ఇక్కడ ప్రత్యేకత.కడియము గుండా స్వామిని దర్శించుకుందామా.అదే మన మనోవలయము ద్వారా.
నరనారాయణులను అనుగ్రహించిన ఆ కేదారనాథుడు మన ఆధ్యాత్మిక సేద్యమును సుసంపన్నము చేయుగాక.
మరొక కథాకథనముతో రేపటి బిల్వార్చనలో కలుసుకుందాము.
ఏక బిల్వం శివార్పణం.
నచ్చింది
వ్యాఖ్య
షేర్ చేయి
No comments:
Post a Comment