న రుద్రో రుద్రమర్చయేత్-13
*********************
' హటకేశ్వర సంరక్షమాం
తత్త్వ నాటక భూతేశ్వర"
బిళరి
ప్రియ మిత్రులారా,ఈనాటి బిల్వార్చనను మనము "కుమ్మరి" అను పదము యొక్క ప్రాధాన్యతను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూ చేసుకుందాము.
హాటకేశ్వరా అనే పదము హాటకము-ఈశ్వరము అను రెండుపదముల కలయిక.హాటకము అనగా బంగారము.బంగారు ఈశ్వర లింగము.కరుణాంతరంగ ఈశ్వరత్వము.
ఈ స్వామి చరితను మహిమలను పండితులు ఒక విధముగాను/పామరులు మరొక విధముగాను చెప్పుకుంటారు.పండిత ప్రస్తావనములో
మహన్యాసమును మరొకసారి గుర్తుచేస్తూ,
" ఊర్థ్వాయనమః-ఊర్థ్వలింగాయనమః
హిరణ్యాయనమః-హిరణ్యలింగాయనమః
సువర్ణాయనమః-సువర్ణ లింగాయ నమః"
అంటూ భక్తుని అనుగ్రహించాలని స్వామి కుమ్మరి సారెనుండి ఊర్ధ్వముఖుడై సువర్ణకాంతులతో ప్రకటింపబడెనట.
హాటక శబ్దమును పోతన కవి సైతము కాటుక కంటి నీరు ..పద్యములో "హాటకగర్భురాణి" అని హిరణ్యగర్భుని
ఇల్లాలుగా కీర్తించెను.
స్వామి హిరణ్యమూర్తిగా కుమ్మరి సారెనుండి ప్రకటింపబడి పాలించినాడని విశ్వాసము.
పామర కథనము ప్రకారముగా భక్తులను మూడు విధములుగా వర్గీకరిస్తే,జ్ఞాన భక్తులు,వైరాగ్య భక్తులు,కర్మభక్తులు .అందులో మనము మాట్లాడుకుంటున్న భక్తుడు కర్మభక్తుడు.
ఘటోవా-మృత్పిండోవా అని ఆదిశంకరులు శ్రీశైలక్షేత్రమునండి దర్శించిన స్వామితత్త్వము జగత్ప్రసిద్ధమే.
నమకము సైతము స్వామి సర్వవ్యాపకత్వముతోపాటుగా ,సర్వ ఉపాధితత్త్వమును వివరిస్తూ,
4వ అనువాకము 13 వ మంత్రము
" నమో కులాలేభ్యో' అంటూ కుమ్మరిగా ప్రస్తుతించింది.
కుమ్మరియై జీవులను కుండలు చేయువానికి,తన కుమ్మరి రూపమునకు ప్రతిరూపములుగా అనేకానేక కుమ్మరులను సృష్టించు రుద్రునకు నమస్కారములు.
ప్రథ్వీశ్చమే -అంతరిక్షంచమే" అంటు చమకము మట్టిని ,మట్టి గంధ తత్త్వమును ప్రస్తావించినది
.
అనేకానేక ఖనిజములను లోహములను భూమియందు ఆవిర్భవింపచేసి,జీవుల శరీరములను సైతము సప్తధాతు మిళితముగా తయారుచేసి,తన కుమ్మరి చక్రము వంటి ఆరు చక్రములను ఆ ఉపాధిలో నిక్షిప్తపరచి
,వానిని తిప్పుచు,వాని కట్టిపడవేయుచున్న ముడులనుండి పైపైకి కదిలిస్తూ ఆడుకొనుచున్నాడు.
చమకము సైతము కుమ్మరిని, కావలిసిన మట్టిని రెండువిధములుగా,
"కృష్ట పచ్యంచమే-అకృష్టపచ్యంచమే" అని దున్నిన భూములయందు,దున్నని భూములయందు ఉన్న రుద్రునకు నమస్కారములు చెప్పినది.
కుమ్మరి-కుమ్మరి చక్రము-కుమ్మరి చేతియందలి మట్టి-చేతలలోని నేర్పరితనము-తయారు చేయుచున్న వివిధ పాత్రలు అన్నీ తానై యున్న రుద్రునకు నమస్కారములు.
యజ్ఞమునకు కావలిసిన పాత్రలు,మూకుడులు,,ఇటుకలు ప్రమిదలు,పెంకులు మున్నగు ఎన్నో ఎన్నో రూపములను వాటి ప్రయోజనములను
' హవిర్భావశ్చమే" అంటూ ప్రస్తావించినది.మట్టిలో జలమును గాలిని,వాయువును,అగ్నిని కలిపి అమృత హస్తములతో తన చక్రము మీద దానిని తిప్పుతూ ఎన్నెన్నో పాత్రధారులను/పాత్రలను/పాత్రతను తయారు చేసిన/చేస్తున్న కుమ్మరి కాదా ఆ పరమేశ్వరుడు.
ఇప్పటికిని మనము పచ్చికుండనెక్కి భవిష్యవాణిని వినిపించు అద్భుతశక్తులను చూస్తూనే ఉన్నాము.
పండితులు హాటక శబ్దమునకు హిరణ్యముగా అన్వయించి అర్థము చేసుకుంటే
పామరులు ఆటికె-కుమ్మరి చక్రము అను పదమునకు దానిని అన్వయించుకొని,కుమ్మరి తిప్పుచున్న సారె నుండి ప్రకటితమై అనుగ్రహించిన స్వామిగా కొలుతురు.
అంటే ఆటికె-హాటక అను రెండు పదములు "యద్భావం-తద్భవతి" అనుకుంటే అసలు సమస్యయే లేదు.
పండిత కథనము ప్రకారము మల్లన్న అను కుమ్మరి కర్మభక్తి పరాయణుడు.వృత్తి కుండలుచేయుట-ప్రవృత్తి కొత్తకుండను తనకు అతి దగ్గరలో నున్న శ్రీశైలమల్లికార్జున స్వామి నైవేద్యమును వండుటకు సమర్పించుట.
విచిత్రము అ కుమ్మరి ఎప్పుడూ తన పనిని వదిలి అతిదగ్గరలో నున్న స్వామి దర్శనమునకు వెళ్ళాలనుకోలేదు. సంకల్ప-వికల్పములు స్వామి లీలలు. అదే విధముగా కొత్తకుండను స్వామి ప్రసాద తయారీ పాత్రగా పంపటమునందు నిర్లక్ష్యమును చేయలేదు.తనకున్న సొమ్ములో నిరాడంబరముగా జీవిస్తూ,శ్రీశైలమునకు వచ్చు యాత్రికులను అన్న సంతర్పణమును చేసెడివాడు
.
కదులుచున్న కాలము కరుణను వర్షిచాలనుకున్నది.కాకతాళీయమైన సంభాషణమును ఎంచుకుంది.
రెండురోజులలో మహాశివరాత్రి.ఎందరెందరో ఎక్కడెక్కడినుంచో శ్రీశైలస్వామిదర్శనమునకు వస్తున్నారు.ఒక్కటే సందడి.మల్లన భక్తికి మల్లికార్జునుడు పరీక్షపెట్టాలనుకున్నాడు.
మల్లన్న పెట్టిన భోజనమును తినిన భక్తుడు కదిలిపోకుండా కబురులు ప్రారంభించాడు.
మల్లన్నా నీవు స్వామి క్షేత్రమునకు అతిదగ్గరగా ఉన్నావు కదా.నీవు ఎన్నిసార్లు మహాశివరాత్రి రోజు స్వామిని దర్శించుకున్నావు? నేనంటే జన్మకో శివరాత్రి అన్న తీరున ఇప్పుడే మొట్టమొదటి దర్శనమునకు వచ్చాను అన్నాడట.అయినా శివునాజ్ఞ లేనిదే చీమైన కదలదు అంటారుగా అన్నాడు.
మల్లన్న మనసుకుసూటిగా తాకినది ఆ మాట.అయినా తనకున్న బాధ్యతలను,భక్తుల సమారాధనమును విడిచి తానెలా శ్రీశైలమునకు వెళ్ళి స్వామిని దర్శించగలడు.
బాహ్యమును గమనించలేని పరిస్థితి.మథనము జరుగుచున్నది తనచేతిలోని మట్టిముద్దకే కాదు.తన మనసు కూడా తోడయినది.తనచేతులు తిప్పుచున్నవి తన కుమ్మరి సారెను/చక్రమును.దానితో జతకలిసినవి మనసులోని.అసంఖ్యాక ఆలోచనలు.ఆగేదెప్పుడో-ఆపగలిగేదెవరో-ఓం నమః శివాయ..
అద్భుతము.తిరుగుచున్న చక్రము నుండి ధగధగలతో ఉర్థ్వముఖముగా హిరణ్యరూపుని ఆవిర్భావము.ఏమిటి మల్లన్నా.నిన్ను కలచివేస్తున్న సందేహము అంటూ ప్రశ్నించినది కాదుకాదు ప్రసన్నమైనది.ఆ సందేహనివృత్తికి సాక్ష్యముగా.
ఇంతలో తాముకూడా స్వామి కరుణకు తరలివస్తున్న భక్తులను మల్లన్న ఇంట సమారాధనమని చెబుతూ తండోపతండములుగా పంపిస్తున్నారు ఇరుగుపొరుగువారు.నిజమునకు వారికి కావలిసినది మల్లన్న అసహాయతను చూసి ఆనందపడటము.ఇంతమందికి భోజనమును పెట్టలేని నిందను పొందటము. ఆయనకే నిందలు తప్పలేదు.
అన్నిదిక్కులనున్నవాడే అసలు దిక్కు అనుకుంటూ ఆహానిస్తున్నాడు.మల్లన్న..ఇరుగుపొరుగు అక్కసుగా వచ్చి మల్లన్న చేసిపెట్టుకున్న కుండలను,ముందు చేయటాంకిని వీలులేకుండా చక్రమును పగులకొట్టారు.
అద్భుతానుగ్రహమునకు అదే అదను అని విరిగిన పెంకును ఆసరగా చేసుకుని అవతరించాడు ఆ విశ్వేశ్వరుడు.
అక్షయముగా అన్న పదార్థములు వస్తున్నవి.అందరు కడుపునిండా తిని కైంకర్యమునకు కదులుచున్నారు.
మనము ఇప్పటివరకు ముచ్చటించుకొనిన కథనము జరిగిన స్థలమే మహిమాన్విత క్షేత్రముగా మారిన ఆ హాటకేశ్వరము.శ్రీశైలమునకు అతి సమీపములో పాలధార-పంచధారలతో పాటు ప్రసాదగుణ మహిమాన్వితము.
ఈ క్షేత్రములో
మహాబిల్వవృక్షము ప్రత్యేకతను కలిగియున్నది.దాని మూలము దగ్గర నిలబడితే నేరుగా సామి దర్శనమును చేసుకోవచ్చునట.
మల్లనను అనుగ్రహించిన స్వామి మనలనందరిని అనుగ్రహించుగాక.
రేపు మరొక కథా కథనముతో
బిల్వార్చనలో కలుసుకుందాము.
ఏక బిల్వం శివార్పణం.
No comments:
Post a Comment