న రుద్రో రుద్రమర్చయేత్-15
***********************
ప్రియ మిత్రులారా ఈ రోజు బిల్వార్చనను మనము వస్త్ర
పదము యొక్క ప్రాముఖ్యతను తెలుసుకునే ప్రయత్నముతో ప్రారంభిద్దాము.(కన్నడము వ్రాయుటలో తప్పులుంటే మన్నించండి)
గోకర్ణక్షేత్ర
మహిమను తెలుసుకునే సందర్భములో మనము రావణుడు శివుని ఆలిని తన ఆలిగా ఎలా తలచాడో,తప్పు తెలుసుకుని తిరిగి ప్రార్థించి,ఆత్మలింగమును స్వీకరించి,దైవఘటనగా దానిని గోకర్ణములో ప్రతిష్ఠించవలసి వచ్చెను తెలుసుకున్నాము..దైవలీలలో మరొక భాగముగా జరిగిన తప్పిదమునకు కృద్ధుడైన రావణుడు ఆ ఆత్మలింగమును భూమి నుండి పైకితీయవలెనని మిక్కిలి ప్రయత్నించి,ఫలితము కానరాక దానిని కప్పియున్న వస్త్రమును కోపముగా విసిరి వేయగా ఆ వస్త్రము నేలను తాకిన స్థలమే మురుడాలయముగా ప్రసిద్ధికెక్కినదట.
కన్నడములో మురుడ అన్న పదమునకు వస్త్రము/సంతోషము అను అర్థముగా భావిస్తారు.వస్త్ర సంకేతముగా కందుక గిరిపై వెలిసిన స్వామి మురుడేశ్వరుడు.అరేబియ సముద్రము అనవరతము స్వామి పాదాలకు పాద్యసేవ చేస్తుంటుంది.అలల ఘోషతో ప్రణవమును నినదిస్తుంటుంది.
21 అంతస్థులతో అతిపెద్దదైనది ఎత్తైనది ఆలయ గోపురము.నిత్యము సత్యమైన మురుడేశ్వరుడు వస్త్రరూపుడే కాదు.తన భక్తులను పరీక్షించాలన్న వస్త్రములనే సాకుగా ఎంచుకోగలడు సాలెగూటిని మెచ్చి,సాయుజ్యమునిచ్చిన స్వామి.
నమకములో వస్త్ర ప్రసక్తి చాలా తక్కువగా ఉన్నప్పటికిని స్వామిని తలపాగా ధరించిన దొంగగా వర్ణించింది.
నమకము 3వ అనువాకము 8వ మంత్రము
నమః ఉష్ణీషిణే గిరిచరాయ కులుంచానాం పతయే నమః
తలకు గుడ్డను ధరించి గ్రామములందుండు జనుల వలెనే తిరుగుచుండు రుద్రునకు నమస్కారములు.
పర్వతములందు తిరుగుచు అచటికి కట్టెలు కొట్టుకొనుటకు వచ్చినవారి వస్త్రములను దొంగిలించు రుద్రునకు నమస్కారములు.
పాపకర్మములను,పలు జన్మములు దొంగిలించువానికి నమస్కారములు.
స్వామి వస్త్ర సంకేత.భక్తుడు వస్త్ర దాత.పేరు నేశ నాయనారు.అనగా నేతగాడు అని అర్థము.
నేశన్-నేతగాడు/ప్రభువు అని రెండు అర్థములను మనము కనుక అన్వయించుకుంటే,
శివనేశ నాయనారు కర్ణాటక రాష్ట్రకంపిలి గ్రామములో జన్మించినప్పటికిని,బాల్యములోనే వారి కుటుంబము తమిళనాడులోని కురైనాడునకు వలస వెళ్ళినది.
మగ్గముపై దారములను సర్దుతూ వస్త్రములను నేయుట వృత్తి.
మనముపై పంచాక్షరి నామములను దారములను సర్దుతు భక్తియను వస్త్రములను నేయుట ప్రవృత్తి.
కామేశుని భక్తులకు పంచిపెట్టుటకై కౌపీనములను నేయుట ,
శివ భక్తులను సాక్షాత్తు శివ స్వరూపముగా దర్శిస్తూ,వారికి పంచెలు-కౌపీనములను పంచుతూ,పరమ సంతోషపడు వాడు.
ఉచ్చారణమాత్రము చేతనే ముక్తిని ప్రసాదించు శబ్దరూపములేమంత్రములు.
"యుగధర్మములననుసరించి అనుష్ఠాన విధానములలో మార్పులు వచ్చినప్పటికిని,అనుగ్రహవిషయములలో ఎటువంటి మార్పుయును లేదు."
నామమునకు-నామికిని అభేదమును గుర్తించిన ప్రతివారును నామ జపమునకు అర్హులే.
పంచాక్షరి అనుష్టానము సర్వశాస్త్ర సమానము కనుకనే,
"జిహ్వాగ్రే వర్తతే యత్ర సఫలం తస్య జీవనం" అన్నది ఆర్యోక్తి.
అక్షరము అను శబ్దమునకు వర్ణమునకు
భాషకు ఆయువుపట్టుగా కనుక అన్వయించుకుంటే అవి శివుని డమరుక ప్రసాదమే.
శివ పంచాక్షరిని మనము కనుక ఈ విధముగా అన్వయించుకోగలితే మన కనుల ముందర సచ్చిదానందమే సాక్షాత్కరిస్తుంది.మనచే సన్నుతింపబడుతుంది.మనకు సద్గతిని ప్రసాదిస్తుంది.
జీవులచే తల్లి-తండ్రి-భార్యాపిల్లలు అను బంధములతో నటనము చేయించు శక్తి,
"న" కారముగా,
జీవుని నటనమునకు కావలిసిన మాయ/మోహమనే తెరచే కప్పివేయు అదేశక్తి,
"మ" కారముగా,
ఏ మహాశక్తి మోహ వశుడై నటించు జీవునికి నిర్హేతుక కృపతో శుభములను/శివమును ప్రసాదించు,
"శి" కారముగా,
తాను ఉపాధియని,తనలో దాగి
వసతిని కల్పిస్తున్న శక్తిని,
"వ" కారముగా,
మార్కండేయుని యమపాశము నుండి విడిపించి ,రక్షించిన కరుణావృష్టిని,
నాలుగు అక్షరములను కలుపు "య" కారముగా కనుక గుర్తించిన పుణ్యశీలి ఆ నాయనారు.,
పట్టులేని పోగులను తీసివేస్తూ,పటిమగల నూలుతో నేస్తూ,వస్త్రములను-కౌపీనములను శివభక్తులకు సవినయముగా సమర్పించి తన జన్మను చరితార్థము చేసుకొన్న మహానుభావుడు.,
అదే విధముగా స్వామి కరుణతో మన మనసనే మగ్గమును సవరించుకొని,అజ్ఞానమునకు తోడ్పడుఅరిషడ్వర్గములను పట్టులేని దారములను తీసివేస్తూ,ధర్మ-అర్థ.కామ-మోక్ష మార్గములను పటిమగల దారములతో ,పంచాక్షరిని జపిస్తూ,పరమేశుని /భక్తుల పాద సమర్పణము గావించుకొనగలిగినప్పుడు ఇంక కావలిసినదేమున్నది.
స్వామి కరుణకటాక్షము మనలనందరిని ఆశీర్వదించునుగాక.
మరొక కథా కథనముతో రేపు బిల్వార్చనలో కలుసుకుందాము.
ఏక బిల్వం శివార్పణం.
No comments:
Post a Comment