న రుద్రో రుద్రమర్చయేత్-14
************************
" వృషాధిరూఢం దేవేశం సర్వలోకైక కారణం
ధ్యాయేత్ బ్రహ్మాదిభిః స్తుత్యం పార్వతీసహితం శివం."
వృషభమును ఆరోహించువాడును, దేవతలకు నియామకుడును,సమస్త లోకములకు మూలకారణమైనవాడును,బ్రహ్మాదులచే పొగడబడువాడును,అన్నింటికి మించి,పారవతీసమేతుడును అగు శివునకు నమస్కారములు.
ప్రియ మిత్రులారా ఈరోజు మనము తారాయ అదే తరింపచేయు పరమాత్మ,తారణ శబ్దమును తెలుసుకునే ప్రయత్నముగా బిల్వార్చనను జరుపుకుందాము.ఈ నాటి మన బిల్వార్చనలో పార్వతీదేవి ఆలిగా కథను నడిపిస్తుంది.
ఇంకొక ప్రత్యేకత సాక్షాత్తు పరమేశ్వరుడే భక్తుని పరీక్షించాలని అర్థియై ఆలిని అడుగుతాడు.
నమకము
8 వ అనువాకము 8 వ మంత్రము
" నమస్తారాయచ" అని స్వామిని కీర్తిస్తోంది.
విచిత్రము
8 వ అనువాకములోని 15 వ మంత్రము దానికి విరుద్ధముగా
" నమః ఆతార్యాయచ-అలాద్యాయచ" అని చెబుతున్నది
అర్థములోనికి వెళితే,
సంసారము నుండి తరింపచేయని అడ్డంకిని కలుగచేయుట ఆతారము.
వ్యాకరణ ప్రకారముగా న తారము-తరింపచేయలేనిది.
తత్త్వజ్ఞానము లభించుచున్నను దానిని గ్రహించుటకు ఇష్టపడక,మన భాషలో చెప్పాలంటే తీరము స్పష్టముగా కనిపిస్తున్నప్పటికిని చేరాలనుకోకుండా,కామ్యకర్మల యందు ఆసక్తితో,సాగరములోనే మునకలువేయుటకు ఇష్టపదటం..ఆ భావమును కలుగ చేసే వాడు కూడా రుద్రుడేనట.
మరొక విధముగా అన్వయించుకుంటే కర్మఫలములను
సంపూర్ణముగా అనుభవించువాడు అలాదుడు.
వెలుతురును అందించుచున్నది రుద్రుడే.దానినంటి వచ్చుచున్న చీకటిని అందించుచునది రుద్రుడే.శబ్దమును అందించినది రుద్రుడే.శబ్దమునకు శబ్దమునకు మధ్యన నిశ్శబ్దమును నియంత్రించినది రుద్రుడే.ద్వంద్వములద్వారా మనకు నిర్ద్వంద్వమును అనుగ్రహిస్తున్న
రుద్రునకు నమస్కారములు.
చమకము సైతము ఇవే విరుద్ధభావములను
కూయవాశ్చమే-దోషములతో కూడుకొనిన భావములు అని చెబుతూ,గ్రామ్యాస్చమే-నిజతత్త్వమును తెలుసుఓగలిగిన భావములను ప్రసక్తిని తెచ్చినది.
నా అజ్ఞానము స్వామిని నిందించుటలో వీరవిహారము చేస్తూ దాగిన నిజతత్త్వమును మీతో పంచుకోలేక పోతున్నది.
ఈ రోజు మన కథలో స్వామి అర్థాంగి పార్వతీదేవి,భక్తుని అర్థాంగి పాత్రధారులు.
భక్తుని విషయమునకు వస్తే
అరూప బహురూపాని అన్నట్లుగా అసలు తనకంటూ ఏ రూపము లేని నిర్గుణుడు ఏ రూపమునైనా ధరిస్తాడు.ఏ గుణముతో నైన నటిస్తాడు.అవి ధర్మార్థకామమోక్ష సోపానములే కావచ్చును,కామక్రోధాది మద మాత్సర్యములే కావచ్చును.స్వామి లీలా ప్రదర్శనమునకు అన్ని అర్హతకలిగినవే.
కావేరి పట్టణ వాసుడైన ఇయర్వగై నాయనారు నరనరాల్లో దాతృత్వమును జీర్ణించుకొన్న గొప్పశివ భక్తుడు.శివ భక్తులను శివ స్వరూపముగాభావించి,అడిగిన దానిని దానమిచ్చి,వారి సంతోషమే పరమేశ్వర అనుగ్రహ విశేషముగా భావించి,సంతసించెడివాడు.
అడిగిన దానమిచ్చి అన్నది ఇక్కడ జరుగబోవు కథ.
జీవుడు దేవుడు కావాలంటే శివుడు ఎన్ని పావులు కదపాలో-ఎన్ని కథలను నడపాలో.ఆ రావణ బ్రహ్మకు ఆలినిచ్చిన దాత కదా.వేరొకరి ఆలినికోరగా యాచకుడిగా మారదలచాడు." ఓం నమః శివాయ" త్రిపుండ్ర ధారియైనాయనారు ఇంటిముందు నిలిచాడు.శివ స్వరూపము అత్యంత భక్తిశ్రద్ధలతో సేవించారు నాయనారు దంపతులు.చల్లకు వచ్చి ముంతను దాచటమెందుకని చల్లగా సంభాషణలో నాయనారు అడిగినది లేదనక ఇస్తావట.నిజమేనా అని సందేహముగా అడిగాడు.స్వామి నా దగ్గర ఉన్నది అయితే తప్పకుండా ఇస్తాను అన్నాడు అమాయకంగా ఇయర్వగై.నీ భార్యను కోరుతున్నానన్నడు.వెంటనే సంశయించక అందుకు అంగీకరించినాడు.పతివ్రతా శిరోమణి పరమప్రీతితో యతి సేవకు సిద్ధమయింది.
ఎంతటి అపురూప దృశ్యము.నమస్తారాయచ-ఆతార్యుడిగా,
పినాకపాణి పిరికితనమును నటిస్తూ నాయనారు భార్యను తనతో తీసుకువెళతానని,దారిలో ఎవరైనతనను అడ్డగించవచ్చని,కనుక వారిద్దరు ఊరు దాటువరకు రక్షణగా నాయనారును తోడు రమ్మన్నాడు.
ఆతతావియైన అనగాఆయుధమునుధరించి రక్షించు రుద్రుని వలె నాయనారుఆయుధధారియై వారిని అనుసరించాడు.అడ్డువచ్చిన వారినిచూసి బెదిరిన బ్రాహ్మణునితో నాయనారు భార్య మీరు భయపడవలదు.నా భర్తవారిని మట్టికరిపించి,మనలను క్షేమముగా పొలిమేర దాటిస్తారని సెలవిచ్చింది.బలిచక్రవర్తి వలె స్వామిచేయి క్రింద-నాచేయి దాతగ పైన అని ఆనుకోని నాయనారు మాటకు కట్టుబడి, అడ్డువచ్చిన వారిని ఓడించి,వీరిద్దరిని అనుసరించుచుండెను.
తిరుచ్చైకాడు దేవాలయము దగ్గర శివుడు నాయనారును తిరిగి వెళ్లిపొమ్మనెను.కొంత దూరము వెళ్ళినాడో లేదో నాయనారు అని గట్టిగా పిలిచి అదృశ్యమయ్యాడు శివుడు " నమః శంకరాయచ-మయస్కరాయచ." ఇహపరములను అనుగ్రహించు రుద్రా నీకు నమో వాకమ-ములు
.త్రికరణ శుద్ధిగా ధర్మపత్నిని శివునకు సమర్పించిన ఇయర్వగై నాయనారును అర్థియై కటాక్షించిన పార్వతి పరమేశ్వరులు ,మరొక భక్తుని సైతము దాతలై అనుగ్రహించారు.ఆత్మలింగ క్షేత్రమూ మనకు ప్రసాదించారు.
లింగము అను పదమునకు సంకేతము గుర్తు అను అర్థమును పెద్దలు చెబుతారు.లింగములలో అష్టమూర్తితత్త్వము ప్రసిద్ధము.భక్తులు వారివారి సుకృతముల ప్రకారము లింగమును నిర్మించుకొని స్వామిని అర్చిస్తారు.అదేవిధముగా రావణబ్రహ్మ మాత కైకసి
ప్రతి ఉదయము సముద్రతీరమున సైకతలింగమును(ఇసుక లింగము) ప్రతిష్టించుకొని,సూషాచమే-సుదినంచమే అని చమకములో చెప్పినట్లు సార్థకత కలిగించుకునేది.స్వామిలీల అద్భుతములు.అర్థముకావు
.ఒకరోజున కైకసి సైకతలింగమును మాయముచేసినది సముద్రపు అల.తల్లికి నిత్యపూజ నిమిత్తము ఆత్మలింగమును తెద్దామని బయలుదేరాడు రావణుడు.ఘోర తపమును ఆచరించాడు.తప తీవ్రతకు భువనము అల్లకల్లోలమైనవి.కరుణించక తప్పలేదు కపర్దికి.పార్వతీ సమేతముగా ప్రత్యక్షమైనాడు ప్రసన్నుడై వరమును కోరుకోమన్నాడు.భక్తుని తరింపచేయవలసిన బాధ్యత యున్నప్పటికిని చమత్కారము స్వామిని
ఆ తార్యునిగా భక్తుని ఆలాదునిగా చేసినది.
స్వామి స్వస్వరూపమును గ్రహించగల జ్ఞాని అయినప్పటికిని ఆత్మలింగమును అర్థించుటయే కర్తవ్యముఅయినప్పటికిని,అమ్మవైపు దృష్టి మరలినది.అజ్ఞానము కదిలినది.కోరుకున్నాడు అమ్మను ఆలిగా.అనుగ్రహించాడు స్వామి.నారదుడు కనపడటము,బ్రహ్మరాక్షసిని చూపించటము,తిరిగి తప్పుతెలిసికొని,ఆత్మలింగావిర్భావమునకు కారణమగుటము అంతా భగవదేఛ్చ.
ఈ విధముగా రావణుని అలాదుని చేసిన అతారుడు రుద్రుడు ఆత్మలింగేశ్వరునిగా అనుగ్రహించిన క్షేత్రమే గోకర్ణము.
గోకర్ణము అను పేరు వచ్చుటకు రెండు కథనములను చెబుతారు.ఒకటి మానవ రూపముతో గోవు కర్ణములతో ఊదయించిన బాలకుని కథ.
మరొకటి అఘనాశిని+గంగావళి నదుల సంగమము గోవు యొక్క చెవి రూపముగా కనపడు ప్రదేశము కనుక గోకర్ణ క్షేత్రముగా ప్రసిద్ధికెక్కినది.అంతేకాదు,స్వామి భూమి నుండి గోకర్ణ రూపమున ప్రకటింపబడెనను కథయును కలదు.
ఎవరి విశ్వాసము వారిది.ఎవరేమనుకున్న విశ్వేశ్వరుడు భక్తుని అలిని కోరెనన్న కథనము,భక్తునకు తన ఆలిని అనుగ్రహించెనన్నకథనము రెండును స్వామి లీలలేకదా. ఆత్మలింగానుగ్రహమునకు ముందు ఆలిని అనుగ్రహించి,భక్తుని పశ్చాత్తాప పడునట్లు
చేసి,తరింపచేసినాడనుట మాత్రము నిర్వివాదము.తన మనసులోనే స్వామి వెలిసి యున్నాడని మనందరికి తెలియచేస్తున్న ఆ గోకర్ణేశ్వరుడు అనవరతము మనలనందరిని రక్షించుగాక.
మరొక కథాకథనముతో రేపటి
బిల్వార్చనలో కలుసుకుందాము.
ఏక బిల్వం శివార్పణం
No comments:
Post a Comment