Sunday, September 13, 2020

SIVA SANKALPAMU-53

ఓం నమః శివాయ-53 ****************** వైభవమను పేరజరుగు ప్రలోభములు నీ సేవలు నెత్తిన పోసిన నీటిని నాదని గంగ తాగేస్తోంది భక్తితో పోసిన పాలను పాములు కానిచ్చేస్తున్నవి చక్కెర-తేనెల తీపిని చీమలు పట్టేస్తున్నవి చందన ధారలు మొత్తము జాబిలి దాచేస్తున్నది జర్రున జారిన నేతిని విషము జుర్రుకుంటున్నది కురిసిన పూలకుప్పలను భ్రమరము కప్పేస్తున్నది రాలిన బూడిదరాశులకై లొల్లి వల్లకాడు చేస్తున్నది ఆరురుచుల ఆరగింపు నంది తనది అంటున్నది దొంగతనము నేర్పించిన దొంగలదొర,నీ సన్నిధి నిమిషములో నామనసు దొంగగ మారుతున్నది చక్కదము ఇదేనురా ఓ తిక్కశంకరా. శివునికి అభిషేకము చేయు ద్రవ్యములను గంగ,పాములు,జాబిలి,చీమలు,విషము,తుమ్మెదలు,శ్మశానము,నంది అవి శివుని అర్పణము అని తెలిసినను పెద్దలోభమునకు వశులై తాము తీసుకుంటూ,స్వామి స్వామికి అందకుండ చేస్తున్నది.ఒక విధముగా ఇది చోరత్వమే.వాటి చోర స్వభావమునకు కారణము అవితస్కరపతి దగ్గర ఉండటమే.అంతేకాదు,శివుడు తనను సమీపించిన భక్తుని మనసులో కూడ చోరత్వమును ప్రవేశపెడుతున్నాడు.---నింద. దొంగయు నమః శివాయ-దొరయు నమః శివాయ తప్పు నమః శివాయ-ఒప్పు నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ " స్వేరాననం చంద్రకళావతంసం గంగాధరం శైలసుతా సహాయం భస్మ భుజంగ భూషణం ధ్యాయత్ పశూనాం పతిమీశితారం." చిరునగవుతో కూడిన మోముకలవాడును,చంద్రకళ శిరోభూషణముగా కలవాడును,గంగను ధరించువాడను,పార్వతితో కూడినవాడును,మూడుకన్నుల వాడును,విభూతియు-పాములు ఆభరనములుగా గలవాడును పశువులకు పతియైన ఈశ్వరుని త్రికరణములతో ధ్యానించెదను. "ప్రలోభాద్యైరర్థాహరణ వరతంత్రో ధనిగృహే ప్రవేశోద్యుక్తః సన్ భ్రమతి బహుధా తస్కరపతే" శివానందలహరి. దొంగలరాజగు ఓ శంకరా!నీవు మాపాపములను దోచుకొను దొంగవు అయినప్పటికిని కలుషితమైన నా మనసు నీ ప్రసాదమును స్వీకరించువానిని,అన్యముగా చింతించినది.దీనిని నేనెట్లు సహించగలను? కనుక ఓ దయాంతరంగా,దొంగతనమునకు ధనికుని ఇంట (విషయవాసనలను సంపదగల సంసారము నందు ) ప్రవేశింపగ ప్రయత్నించుచున్న సమయమున దానిని నీ అధీనములో నుంచుకొని నన్ను సంస్కరింపుము సదాశివా. ఏక బిల్వం శివార్పణం.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...