Sunday, September 13, 2020

SIVA SANKALPAMU-66

ఓం నమః శివాయ-77 ********************** నీ కళ్యాణపు కర్తయైనాడుగ ఆ రతిరాజు నీ సేమపు మామ యైనాడు ఆ హిమరాజు నీ సిగపై కొలువైనాడు ఆ నెలరాజు నీ మేనికి వస్త్రమైనాడు ఆ కరిరాజు నీ కంఠపు కంటెయైనాడు ఆ భుజగరాజు నీమ్రోలన్ నిలిచినాడు ఆ వృషభరాజు నీతో పాటుగ కొలువైనాడు ఆ యమరాజు నీవంటే నిరసనతో యున్నాడుగ ఆ దక్షరాజు విరాజమానుడిని అని నీవు అన్నా,నువ్వు రాజువు కాదని ఇందరు రాజులు నిన్ను ఆడించగ మందహాసముతో నటరాజను ఒక రాజును నీకొసగిరి ,నీ తక్కువ చాటేందుకేర ఓ తిక్కశంకరా. మన్మథుడు,హిమవంతుడు,చంద్రుడు,ఏనుగులరాజు,సర్పరాజు,వృషభరాజు,యమరాజు,దక్షరాజు రాజథీవితో అలరారుచు,అందరు కలిసి పరిహాసమునకు శివునికి నతరాజు అను బిరుదునొసగి,తైతక్కలాడిస్తుంటే అమాయకముగా అది గ్రహించక,తాను వివిధరాజ విరాజమానుడనని సంతసితాడు కాని అసలు విషయమును అర్థము చేసుకోలేని అమాయకుడు శివుడు-నింద. రాజు నమః శివాయ-బంటు నమః శివాయ జటిలము నమః శివాయ-నటనము నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ " నటనం ఆడెనే భవతిమిరహంశుడా పరమశివుడు నటనా వతన్సుడై తకధిమి తకయని" నటనము నందు ఆసక్తిగలవాడట.ఏమా నటనము? సామాన్య హస్తపాద కదలికలే? లేక సకల చరాచర సృష్టి చైతన్యపు కదలికలా అంతే అవుననే చెప్పాలి.అయితే స్వామి చిదంబరములోనే తిల్లవనములోనే నృత్యము చేయుట ఎందుకు? అని ప్రశ్నించుకుంటే అఖిలభువనభాండములు తాను వ్యాపించియున్నప్పటికిని,విశ్వమనే క్షత్రము(క్షేత్రమునకు శరీరము అను మరో అర్థమును తీసుకుంటే) హృదయము వంటిది చిదంబరములోని తిల్లవనము.ఆ ప్రదేశమునకే శివనాట్యమును తిలకించగల-తరించగల శక్తిగలది.ఇంకొక విధముగా అన్వయించుకోవాలంటే ఇడ-పింగళ అను కుడి-ఎడమ నాడుల మధ్య గల సుషుమ్న నాడి వంటిది చిదంబరము.కుండలినిని జాగృత పరచి సహస్రారమునకు చేర్చగలిగిన శక్తికలది.అంతే కాకుండ అక్కడ మనకు వ్యాఘ్రపాదులవారు-పతంజలి స్తొత్రము చేస్తు స్వామి నాట్యమును అవలోకిస్తూ ఆనందిస్తుంటారు.వారి నామములు కూడ సంకేతములే.వ్యాఘ్రపాదములు స్వామిచే వారికి అతికింపబడినవి.కనుక అవి కదలకుండ స్థిరముగా నిలబడ శక్తి కలవి.అట్లు నిలబడిన ఆధ్యాత్మిక సాధనను,పతంజలి పైకి వేగముగా పాకు శక్తి సహస్రారమునకు పట్టు తప్పకుండ చేర్చి,ముముక్షువులుగా మార్చగలదు. స్వామి చేయు సృష్టి-స్థితి-సమ్హార-తిరోధాన-అనుగ్రహములను పంచకృత్య సంకేతములే నటరాజ తత్త్వము.అజ్ఞానమనే అపస్మారకుని కాలికింద నొక్కివేసి,సృష్టికి రెండు కుడిచేతులతో ముందున్నది అభయముద్రతో,వెనుక ఉన్నది డమరుకముతో ,జ్ఞాన సంకేతములై ఉండగా ,ఎడమవైపున ముందున్న గజహస్తము తిరోధాన ప్రతీకగాను,వెనుకనున్న చేయి అగ్ని పాత్రతో విషవాసనలను దహించివేసే దయాళువుగాను దర్శనమిస్తుంటాయి.స్వామి విస్తరించిన జడలు సర్వ వ్యాపకత్వమును చాటిచెప్పుచుండగా ,వాటిలో చుట్తిన గంగ,చంద్రరేక స్వామి చల్లని మనసుకు చక్కని ప్రతీకలై చెలువారుచున్నవి. రుద్రము స్వామిని " సభాభ్యో-సభాపతిభ్యశ్చవో నమో నమః" అని కీర్తిస్తున్నది.కడలిలోని నీరే కడలి అలలోను ఉన్నట్లు,స్వామి కదలికలే నా కదలికలను సత్యమును నిరంతరము నా మనసులో నిలుపుము శివా.నమస్కారములు.-స్తుతి ఏక బిల్వం శివార్పణం.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...