Sunday, September 13, 2020

SIVA SANKALPAMU-89

ఓం నమ: శివాయ-89 ****************** " అనిశము వశమగుతావు" పశునామములకు నీవు "పశుపతి" అని పిలువగానే పరవశమేగా నీకు "కాల భైరవుని" కాశికాపురపతిని చేసావు "శరభమువై" నరసిమ్హుని శాంతింప చేసావు మిక్కుటమగు ప్రేమగల "కుక్కుటేశ్వరుడివి" నీవు వ్యాళము మీద మోజుగల "కాళేశ్వరుడివి" నీవు "స్కంధోత్పత్తికి" వనమున లేడిగ క్రీడించావు వ్యాఘ్రమునకు మోక్షమిచ్చి "వ్యాఘ్రేశ్వరుడివి" అయ్యావు జంబుకమును అనుగ్రహించిన " జంబుకేశ్వరుడివి" శ్రీ,హస్తి,కాళములను దయ తలచిన "శ్రీ కాళ హస్తీశ్వరుడవు" " పాశమేసి" నన్ను బ్రోవ రమ్మంటే,నా భక్తిని "కప్పల తక్కెడ" అంటావురా ఓ తిక్క శంకరా. శివునికి పశువులన్నా-పశునామములన్న పక్షపాత బుధ్ధిని ప్రదర్శిస్తుంటాడు.వాటిని అనుగ్రహించడమే కాకుండా వాటిపేర్లను తన పేర్లగా ప్రకటించుకొని మురిసిపోతుంటాడు.శరభము (సగము పక్షి+సగము సింహము),కుక్కుటము (కోడి),కాళము/వ్యాళము,(పాము),వ్యాఘ్రము (పెద్దపులి),జంబుకము (నక్క),కుక్క వాహనమెక్కిన కాలభైరవునిగా గొప్పలు పోతుంటాడు.నన్ను నీ కరుణ అను పాశముతో బంధించి,కాపాడమంటే,నా భక్తి సరిపోలేదని చెప్పవచ్చునుకదా! అహ అలాకాకుండా కప్పలు అను మరొక ఉభయచరమును తలచుకొనుచు,నేను దాని వలె నిలకడగా త్రాసులో లేనని నిష్ఠూరములాడుతున్నాడు-నింద. పశువు నమః శివాయ-పాశము నమః శివాయ కప్ప నమః శివాయ-తక్కెడ నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. పశుపతి అష్టకము ************** స్తుతించు పశుపతి శశిపతి సతిపతిని స్మరించు నాగపతి లోకపతి జగపతిని జనార్తిహరుని చరణములు శరణమని భజింపుము భక్తితో మనుజ గిరిజపతిని. నిత్యముకారు రారు తలితండ్రులు బాంధవులు సత్యముకావు చూడు తరలు సిరిసంపదలు మృత్యు కబళించువీని కాలవసములని భజింపుము భక్తితో మనుజ గిరిజపతిని. చిన్న మురజను పెద్ద డిండిమను శివుడు మథుర పంచమ నాదములు పలుకుచున్నాడు ప్రమథగణ సేవితుడు పరమేశ్వరుదని భజింపుము భక్తితో మనుజ గిరిజపతిని, శరణుఘోషల ఆవిరి గ్రహియించు సూరీడు కరుణధారలు వర్షించుకాలమేఘమాతడు శివుడు లేనిదిలేదు ఇలను లేనే లేదని భజింపుము భక్తితో మనుజ గిరిజపతిని. చితాభస్మాలంకృత సిత చిత్ప్రకాశమువాడు మణికుండలముల భుజగ హారముల రేడు నగజనాథుని దయ నరశిరో రచితుని భజింపుము భక్తితో మనుజగిరిజపతిని. యజ్ఞకర్త యజ్ఞభోక్త యజ్ఞస్వరూపము తాను యజ్ఞఫలితములనిచ్చు సద్గురు శంకరుడు దుష్టత్వమణచిన దక్షయజ్ఞ విధ్వంసకుని భజింపుము భక్తితో మనుజ గిరిజపతిని. జాలిలేని జరామరణములకు జడియక సారహీనపు సంసార భయమును తోసివేయుచు సాగుచునున్న చరాచర హృదయ సంస్థితుని భజింపుము భక్తితో మనుజ గిరిజపతిని. హరి విరించి సురాధిపులు కొలువుతీరగ యమ కుబేర దిక్పతులు నమస్కరించుచుండ భవరోగ భంజనుని భువనత్రయాధీశుని భజింపుము భక్తితో మనుజ గిరిజ పతిని. కవి సూరి ఒక మహారాజు శివ భక్తుడు అన్నవివరములే లభ్యమైనవి. పరమపవిత్రమైన ఈ స్తోత్ర పఠనము శ్రవణము స్మరణము సకలముక్తిప్రదము. సర్వేజనా సుఖినో భవంతు.సమస్త సమ్మంగళాని భవతు. సర్వేశ్వర కృపా కటాక్ష ప్రాప్తి తథ్యం. ( ఏక బిల్వం శివార్పణం.)

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...