ఓం నమః శివాయ-31
********************
కళల మార్పు-చేర్పులతో కదులుచున్న చంద్రుడు
నీ సిగముడుల చీకట్లలో చింతిస్తు ఉంటాడట
కుబుసపు మార్పుచేర్పులతో కదలాడు పాములు
నీలలోహిత చీకట్లలో చింతిస్తు ఉంటాయట
కునుకురాక తెరువలేక కుదురులేని మూడోకన్ను
తెరతీయని చీకట్లలో చింతిస్తు ఉంటుందట
ఆకాశము నుండి సాగి,జార అవకాశములేని గంగ
బందిఖాన చీకట్లలో చింతిస్తు ఉంటుందట
చీకటిని తొలగించలేని చిత్ జ్యోతి శివుడేనట
చింతలు తొలగించలేని వింతశక్తి శివుడేనట
దోషము తొలగించలేని వానికి ప్రదోషపూజలా అంటు
వెక్కిరిస్తున్నారురా ఓ తిక్కశంకరా.
శివుడు చంద్రుని కళల మార్పును అరికట్టలేడు.పాముల కుబుసములను కూడ సవరించలేడు.మూడో కన్నుకు కుదురునివ్వలేడు.గంగను సైతము తన జటలలోని చీకట్లలో బంధించి,వెలుగును చూపలేక పోతున్నాడు.కాని తాను మాత్రము జ్యోతిర్లింగమునని ,దోషరహితుడనని చెబుతూ,ప్రదోష పూజలను అందుకుంటాడు.దోషమూను పదమును చీకటి-పాపము అను అర్థములలో కూడ అలంకారికులు ప్రయోగిస్తారు.(చీకటి ఆవరించుటకు ముందుకల సమయము ప్రదోషము) చీకట్లను తొలగించలేని శివుడు తాను దోషరహితుడనని చెప్పుకుంటూ ,ప్రదోషపూజలను అందుకుంటాడు.-నింద.
తిమిరం-నమః శివాయ-తిరిపం- నమః శివాయ
త్రిదళం నమః శివాయ-త్రిగుణం- నమః శివాయ.
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
"ప్రాక్పుణ్యాచల మార్గదర్శిత సుధామూర్తిః ప్రసన్న శివః
సోమః సద్గుణ సేవితో మృగధరః పూర్ణస్తమోమోచకః"
శివానందలహరి.
పూర్వపుణ్యమనే తూర్పుకొండపై వెలుగొందు అమృతస్వరూపుడు-ప్రసన్నుడు-శుభకరుడు-సద్గుణవంతులచే పూజింపబడు మృగధరుడు చీకట్లను పూర్తిగా తొలగించి, ప్రకాశించుచు మనలనందరిని పరిపాలించును గాక.-స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
No comments:
Post a Comment