ఓం నమ: శివాయ -12
****************
చేతులార పూజసేయ చెంతకు రావాలంటే
చెట్టువు కమ్మంటావని చెప్పలేని భయం
కనులారా దర్శించి కొలవాలనుకుంటేను
కుక్కవు కమ్మంటావని ఎక్కడో భయం
పాహి పాహి అంటూ పాదములు పట్టుకోవాలంటే
పాముగ మారమంటావని పాపిష్ఠి భయం
తోడుగ ఉండమని వేడుకోవాలంటేను
కోడివి కమ్మంటావని నీడలా ఏదో భయం
హరహర మహదేవుడని వరముకోరుకోవాలనుకుంటే
శరభము కమ్మంటావని నరనరములలో భయం
అభయము అడగాలంటే అడుగడుగున భయము నాకు
బిక్కుబిక్కునున్నానురా ఓ తిక్క శంకరా.
భక్తుడు పూజలు చేయుటకు శివుని సమీపించాలంటే మద్ది చెట్టుగానో,కుక్కగానో,పాముగానో,కోడిగానో,శరభము గానో (పక్షి శరీరము-సింహపుతల)శివుడు మారి పొమ్మంటాడని,భయమని నింద.
1.శ్రీశైలములో శివుడు తెల్ల మద్ది చెట్టు రూపములో (మల్లికార్జున స్వామిగా భక్తుల పూజలను,ప్రదక్షిణములను అందుకుంటు,అనుగ్రహిస్తున్నాడని,(చెట్టు నేపథ్యము)
2.కాశిలో ( నేపాలు,ఉజ్జయిని మొదలగు ప్రదేశములలో) శివుని గోటి నుండి జనించి,నాలుగు వేదములు నాలుగు కుక్కలుగా అనుసరించుచుండగా,బ్రహ్మ రాక్షసుల పీడ (మన మనసుకు పట్టిన పీడ) తొలగించుచు మనలను రక్షించు చున్నాడని,(కుక్క నేపథ్యము)
3.ఆదిశేషుని అనుగ్రహించిన ఆదిదేవుడు కుంభకోణములో జ్యోతిర్లింగముగా ప్రకాశించుచున్న నాగేశ్వరస్వామి మనలను రక్షించు చున్నాడని,(పాము నేపథ్యము)
4.పిఠాపురములో (పాద గయ) గయాసురుని శరీరమును యజ్ఞవాటిక చేసి,ధర్మ సంస్థాపనకై కోడి రూపమును ధరించి,(మన మానసిక అజ్ఞాన నిద్రనుండి మేల్కొలుపుచు)కుక్కుటేశ్వరుడై మనలను రక్షించు చున్నాడని,(కోడి నేపథ్యము)
5.మనలోని ఉగ్రత్వమును తొలగించి,శాంత స్వభావమును వ్యాపింప చేయుటకు,అతి తక్కువ సమయము ఉన్న ఉగ్ర నరసింహదేవుని శాంతింపచేసిన శివుడు తమిళనాడులో శరభేశ్వర స్వామియై సకల శుభములను అందచేయుచున్నాడని స్తుతి.
( ఏక బిల్వం శివార్పణం)
No comments:
Post a Comment