Thursday, June 29, 2017

saraswati namoestutae

సరస్వతీ   నమోస్తుతే
        *******************

  జగమున శారద  నమోస్తుతే _ గగనపు  శారద నమోస్తుతే
  సుత  నారద  నమోస్తుతే  -సిత  నీరద  నమోస్తుతే

  ఇందిర  సఖి నమోస్తుతే  -ఇందు ముఖి  నమోస్తుతే
  వేదసారమా నమోస్తుతే  - ఘనసారమా నమోస్తుతే

  పటిమ  అనుపమ  నమోస్తుతే  - పటీర  ఉపమ  నమోస్తుతే
  మాఘ శుక్ల పంచమి  నమోస్తుతే - మరాళ వాహన నమోస్తుతే

  తల్లి  ఆకార  నమోస్తుతే  -మల్లికాహార  నమోస్తుతే
  నిషాద ఏలిక నమోస్తుతే  - తుషార  పోలిక  నమోస్తుతే

  చేత  కచ్చపి  నమోస్తుతే  - ఫేన  స్వచ్చత  నమోస్తుతే
  అజుని  నాయికా  నమోస్తుతే - రజతాచలమా  నమోస్తుతే

  కాంతి సంకాశ   నమోస్తుతే  -కాస  ప్రకాశ  నమోస్తుతే
  పుష్ప కేశిని  నమోస్తుతే- పూజ్య ఫణీశ నమోస్తుతే

  భక్త  మందార   నమోస్తుతే  - కుంద మందార  నమోస్తుతే
  వసుధ నాదనిధి నమోస్తుతే  - సుధా  పయోధి  నమోస్తుతే

  ఆశ్రిత  పోషిత  నమోస్తుతే  _  సిత  తామరస నమోస్తుతే
  ఆగమ  విహారి నమోస్తుతే  -అమర  వాహిని  నమోస్తుతే

  ఓంకార రూప  నమోస్తుతే  - శుభాకార రూప  నమోస్తుతే
  పోతన  శుభస్తుత  నమోస్తుతే -  శ్వేత వస్త్రధర  నమోస్తుతే
  
  సకల బుద్ధివి నమోస్తుతే  - సకల సిద్ధివి  నమోస్తుతే
  సర్వశుక్ల రూపమా నమోస్తుతే  -సరస్వతీ నామమా  నమోస్తుతే

  మనసా-వచసా- శిరసా సతతం స్మరామి.
  పురుషార్థ  ప్రదాయినీ పున: పున: నమామి. 

    భావము

  శరదృతువులో  పిండారబోసినట్లుండే  వెన్నెల-  శారద
  నీటిని తనలో దాచుకుని  తెల్లగా ప్రకాశించే  మేఘము- నీరదము
 
  మరల మరల  అభివృద్ధిని పొందువాడు  చంద్రుడు- ఇందు
  ఆత్మార్పణములో  అవశేషమే  లేనిది కర్పూరము- ఘనసారము

  పరిమళము-ప్రశాంతత కలది- మంచి గంధము-- -పటీరము
  పాలు-నీరు వేరుచేయ గలిగినది  హంస-  మరాళము

  శబ్ద-స్పర్శ-రూప-రస-గంధాదులు కలిగినది-మల్లెపువ్వు--మల్లిక హార
  అర్ద్రతయే  స్వభావముగా గలది-మంచు--తుషార

  పరుగుల ఒరవడి-నడవడి గలది  నురుగు-ఫేనము
  చల్లదనము-తెల్లదనము కల కొండ- వెండి కొండ--రజతాచలము

  పరమాత్మ సూక్ష్మ రూపములో వసించు గడ్డి(పువ్వు)--రెల్లుపువ్వు--కాశ
  అగ్నిని-జలమును సమతౌల్యము చేయగలది-ఆదిశేషుడు--  ఫణీశ

  స్వయం ప్రకాశ -సత్వగుణ  ప్రతీక-దేవతా పుష్పము--కుంద
  కోరిన కోరికలు తీర్చు కల్పవృక్షము---మందార

  అవధులులేని అమృతగుణము- పాల సముద్రము-- సుధా పయోధి
  సకల జ్ఞాన స్థానమే  తెల్ల పద్మము ---సిత తామరస

  పైనుండి క్రిందికి దిగివచ్చినది-ఆకాశ గంగ-- అమర వాహినీ
  ఓంకార స్వరూపమైన  సంపూర్ణత్వము   శుభాకారత
  ప్రకాశించుట యందు  ఆసక్తిగలది  భారతి.(జ్ఞాన స్వరూపము)  

  
   పోతనగారి సహజకవిత్వపు లోతులగురించి తెలిసికొనుటకు భక్తి-భావన అను రెండు దివ్య నేత్రముల సహకారము ఎంతో అవసరము.వారు ఈ పద్యములో ఎన్నో తాత్త్విక విషయములను పొందుపరచిరి అనిపిస్తోంది.ఇవి అలంకారిక శాస్త్ర ప్రకారమే తీసుకున్న ఉపమానములు కావేమో.కొంచం పరిశీలిద్దాము.

1 స్థూల సూక్ష్మ విషయ విచారణ చేశారనుటకు వారు ప్రయోగించిన

 మేఘము-వెన్నెల, మంచు బిందువు-మంచు కొండ,నురుగు-సముద్రము, రెల్లు-కల్పవృక్షము,పద్మము-జ్ఞానము రెండు అమ్మయే అయితే అమ్మ అంటే ఎవరు. ఇంకొంచము దర్శించగలిగితే

 పంచభౌతికతత్త్వము ఈ జ్ఞాన ప్రకాశము అనిపిస్తుంది.ఉదాహరణకు,

 1.ఆకాశ తత్త్వము- మేఘము-వెన్నెల-చందమామ
 2.జల తత్త్వము-మంచు బిందువు,నురుగు,ఆకాశ గంగ,సముద్రము.
 3.అగ్ని తత్త్వము- ఆదిశేషుడు {విషము-అగ్నికీలలు)
 4.భూతత్త్వము-రెల్లు,కల్ప వృక్షము
 5.వాయు తత్త్వము-పువ్వులు చందనము కర్పూరము (సువాసనను వ్యాపింపచేయును)
     
  పంచేంద్రియ సంకేతములు కూడా గోచరిస్తున్నాయి.

 సముద్రము- నాదము -కర్ణము (చెవి)
  వెన్నెల-గంగ-స్పర్శ  (చర్మము)
  పువ్వులు-గంధము-నాసిక ముక్కు)
  మకరందము-వాక్కు-రసనము (జిహ్వ)
  సర్వ శుక్లరూపము-నయనము. (కన్ను)

   అంతేకాదు,

 శరదృతువు,మేఘము,చంద్రుడు,కర్పూరము,మంచిగంధము,మల్లెపూలు,కల్పవృక్షము,మంచుకొండ.ఆకాశ గంగ,రజో-తమో గుణములనధిగమించితమని తాము స్వఛ్చందముగా సమర్పించుకుంటూ,పరోపకారం ఇదం శరీరం గా ప్రకాశించునవి.

 చర్మ చక్షువులకు సరస్వతీదేవి సర్వశుక్ల స్త్రీమూర్తిగా ద్యోతకమగును కాని కొంచము ఆలోచిస్తే పోతన ఆ మూర్తిని పరోపకారమైన పంచభూత స్థూల-సూక్ష్మ ప్రాకృతిక ప్రవాహ జ్ఞానముగా కనుగొనినాడనిపిస్తోంది.

   అట్టి జ్ఞానగంగా  ప్రవహాము మనలనందరిని  అనుగ్రహించుగాక. 

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...