నాయగనాయ్ నిన్ర నందగోపనుడైయ
కోయిల్కాప్పానే! కొడి తోన్రు తోరణ
వాశల్ కాప్పానే మణిక్కదవం తాళ్ తిరవాయ్
ఆయర్ శిరు మియరో ముక్కు అఱై పఱై
మాయన్ మణివణ్ణన్ నెన్న వేవాయ్, నేరందాన్
తూయో మాయ్ వందోం తుయిలెరప్పాడువాన్
వాయాల్ మున్నం మాత్తాదే అమ్మ
నీ నేశ నిలైక్కదవం నీక్కు ఏలో రెంబావాయ్.
ఓం నమో నారాయణాయ-16
విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది
విష్ణుచిత్తీయమై శ్రీహరి నామ సంకీర్తనమే కోరుతోంది.
"మాధవం-మణివణ్ణన్ సేవకు ఆటంకించుచున్న వారైన
ద్వారకాపతి " ఆ"నందభవనపు ద్వారపాలకులలో
"శిఱు మియరో ముక్కు " అనుభావము అనుభవైకవేద్యమైన
చిన్నవారమని అన్న గోపికల ఉన్నత సంస్కారములో
సంకల్పము సాధ్యపరచు భక్త కల్పతరువైన
శిరమొడ్డిన పరవశమై విడిన అడ్డ గడియలో
సిరిసంపదలను మించిన సౌభాగ్యప్రదమైన
తులసిదళముతో స్వామిని తులతూచిన తక్కెడలో
అతి పవిత్రమైన వ్రతము ఆచరింప రారె
" ఆముక్త మాల్యద" ఆండాళ్ అమ్మ వెంట నేడె.
భావము
ఐదు జ్ఞానేద్రియములు-ఐదు కర్మేంద్రియములు కలిపి పది ఇంద్రియములు పది గోపికల రూపమున నిద్రించుచున్న సమయమున అమ్మ ఆండాళ్ వాటిని జాగృతము చేసి, తనతో వ్రతమునకు తీసుకొని వళ్ళుచున్నది.కనుక వారు నిస్సంగులై ,స్వామి నిస్తుల వైభవమును కీర్తించుటకు వచ్చినపుడు,ద్వార పాలకులు వారిని అడ్డగించిన సమయమున ఏ మాత్రమును చలించకుండ,వినయ సంభాషణమును చేయ గలిగిన వివేక సంపన్నులైనారు.నియమ నిష్ఠలను పాటిస్తున్నామన్న అహంకారముతో నున్న విప్రులు పరమాత్మ సందర్శనమునకు,సేవా సౌభాగ్యమునకు( వారిలో నున్న అహంకారముచే) నోచుకోలేదు.
నంద భవన ప్రవేశమునకు గోపికలను ద్వార పాలకులు అడ్దగించినారు.అప్పుడు గోపికలు తాము నియమ నిష్ఠలు లేనివారమని,ముక్కుపచ్చలారని చిన్నివారమని
ఒక్కసారి స్వామిని దర్శించి మరలివెళ్ళెదమనితలుపుతీయమని,శిరసువంచి ద్వారపాలకులను అర్థించినారు.వంగిన వారి శిరము(లు) తగిలి,తలుపు గడియ విడినది.దానిని దగ్గరుండిచూసిన మన గోపికకు తులసిదళముతో స్వామిని తూచిన తక్కెడ గుర్తుకు వచ్చినది.(ఇది సామాన్యార్థము)
"మా" మాయొక్క "ధవన్" వాడు/దేవుడు.శ్రీ కృష్ణుడు గోపికల యొక్క సఖుడు/దేవుడు.ఆ మాధవుడు ఎటువంటి వాడంటే "మణివణ్నన్" మణివలె స్వయం ప్రకాశము కలవాడు మాత్రమే కాదు.కోరిన కోరికలు తీర్చు చింతామణి.కనుక తప్పక మాకు దర్శనమును అనుగ్రహిస్తాడు.కాని గోపికలను లోనికి వెళ్ళనీయకుండా అడ్డుకుంటున్న ద్వారపాలకులు కామము-క్రోధము,మదము-మాత్సర్యము,అహంకారము-అజ్ఞానము అను క్షణమాత్రము కమ్మివేసిన వారి గుణదోషములు.వారు నియమ నిష్ఠలు లేనివారము అని అన్నారు.అంటే వారు ప్రాపంచిక విషయములకు అతీతులైన నిస్సంగులు. వారి నిష్కళంక భక్తి, శిరమువంచి నీలమేఘశ్యాముని శరణాగతిని కోరగానే, కల్పతరువైన పరమాత్మ వారిని అనుగ్రహించి,తరువుతో చేయబడిన మణిమయాలంకృతమైన తలుపు అడ్దగడియ విడిపోవునట్లు అనుగ్రహించాడు అంటే మాయామోహ
తెరలు తొలగి స్వామితొ మమేకము కాగలిగినారు..పరమాత్ముని పరమాద్భుతమును చూడగానే స్వామి భక్తపరాధీనతను ప్రకటించు తులసిదళముతో స్వామిని తూచిన తక్కెడ, మన గోపికకు తలపుకు వచ్చి,తానును "సర్వస్య శరణాగతికి"సిద్ధమవుతున్నదన్న తలపులో నిమగ్నమైన నా మనసు,పాశురములను కీర్తించుచు,అమ్మతో వ్రతమునకు సాగుచున్న చెలులతో కలిసి ముందుకు అడుగులు వేయుచున్నది.
( ఆండాళ్ తిరువడిగళే శరణం )
No comments:
Post a Comment