Friday, June 23, 2017

ఓం నమో నారాయణాయ-01

 " శ్రీ విష్ణుచిత్త కులనందన కల్పవల్లీం
శ్రీ రంగనాథ హరిచందన యోగ దృశ్యాం
సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం
గోదామనన్య శరణం - శరణం ప్రపద్యే"
ఓం నమో నారాయణాయ-1
***********************
విచిత్రముగ నామది " శ్రీ విల్లిపుత్తూరుగా" గా మారినది
"విష్ణు చిత్తీయమై" శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది
బ్రాహ్మీ ముహూర్తమనే సత్వగుణ ప్రధానమైన
సమ శీతోష్ణత గల " శ్రీ మహా విష్ణు మాసములో"
ధన్యతనందించ గలుగు "ధనుర్మాస వ్రతమైన"
అంగనలారా! మంగళ "శ్రీ రంగనాథుని సేవలలో"
భక్తి తత్పరతయే భవతారణ భాగ్యమైన
బాహ్యాభ్యంతర శుచియగు " భాగీరథీ స్నానములో"
"పర-రూప-విభవ-అర్చ-ఆంతర్యాది" రూపమైన
" ధర్మార్థకామమోక్ష" భాసురమను పాశురములలో
తెల్లవార వచ్చెనమ్మ చెలులారా రారె
తెల్ల బరచగ "భక్తి"పూల మాలలతో నేడె
భావము
"మార్గళి" సుప్రభాత సమయము శుభ ప్రదమైన " శ్రీ వ్రతమును" మనందరము కలిసి ఆచరించుటకు సానుకూలముగా నున్నది.పరమ పావనమైన "శ్రీ గోదా-రంగనాథ" మూర్తులయందు విహరించుచున్న నా మనసు,పవిత్రమై,పాశురములను కీర్తించుచు,భక్తి పువ్వులను,శరణాగతి అను దారముతో అల్లుచున్న హారములను స్వామికి సమర్పించుటకు, చెలులారా!కదిలి రండి.తెల్లవారు చున్నది.


No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...