పారిజాత అర్చనల పాదములకు వందనం
పాపనాశిని పావని పార్వతి వందనం
............
గులాబీలు గుబాళించు గుల్భములకు వందనం
గణపూజిత గుణాతిశయ గౌరి వందనం
.........
ముద్దు గణపయ్య కూర్చున్న ఊరువులకు వందనం
ఎద్దునెక్కు శివునిరాణి గిరిజ వందనం
..........
అఘరహిత తల్లి శుభ జఘనమునకు వందనం
గిరితనయ విరిపూజిత దుర్గ వందనం
........
విదుషీమణి అలంకృత మణిమేఖలకు వందనం
శక్తిపీఠనిలయ శ్రీశైల భ్రమరాంబిక వందనం
.......
భక్తానుగ్రహ హృదయారవిందమునకు వందనం
అఖిలాండ పోషిణి ఆదిశక్తి అన్నపూర్ణ వందనం
.......
సకలశాస్త్రధర శుభ కరకంకణములకు వందనం
పరిపాలిని శుభకారిణి గాయత్రి వందనం
........
త్రయంబకరాణి భవాని కంబుకంఠమునకు వందనం
సృష్టి స్థితి రూపిణి త్రిపురసుందరి వందనం
.........
విబుధ స్తుతుల విరాజిల్లు చుబుకమునకు వందనం
లక్షణరూపిణి కొళపురి మహాలక్ష్మి వందనం
.........
బీజాక్షరపూరిత ఓష్ఠమునకు వందనం
పూజావిరాజిత విశాలాక్షి వందనం
..........
ముక్తిప్రదాతయోగశక్తి వక్త్రమునకు వందనం
భావ ప్రవాహ భాషా ప్రదీప వాగ్దేవి వందనం
.......
నవమౌక్తిక నాట్యాల నాసాగ్రమునకు వందనం
ఆదరించు అమ్మ రాజరాజేశ్వరి వందనం
..........
తపోధనులతల్లి నీ కపోలములకు వందనం
కన్నతల్లి కల్పవల్లి శ్రీ లలితాంబ వందనం
.........
సూర్య చంద్ర చిత్స్వరూప నేత్రములకు వందనం
స్తోత్రప్రియ మూర్తిత్రయ త్రిపురసుందరి వందనం
.......
ఫాలలోచనునిరాణి ఫాలమునకు వందనం
పాలాభిషేకప్రియ నందిని బాల వందనం
.......
మణికుందలముల మెరయు కర్ణములకు వందనం
శృతి స్మృతి విరాజిత అపర్ణ వందనం
......
అక్షయప్రశస్తిగ కస్తూరి కుంకుమకు వందనం
లక్ష లక్షణ ప్రస్తుత దాక్షాయణి వందనం
.......
క్లేశహరిణి పరిమళ కేశములకు వందనం
వాసవాది వినుత కేశవసోదరి వందనం
.......
సంకటనాశిని పొంకపు మకుటములకు వందనం
కింకరపాలిని శుభగాత్రి మహిషాసురమర్దిని వందనం
అపరాధములు క్షమిస్తూ అమ్మలా పదే పదే
నన్నేలుచున్నట్టి నవదుర్గ నమోస్తుతే.
No comments:
Post a Comment