సౌందర్య లహరి-గౌరీదేవి
పరమపావనమైన నీ పాదరజకణము
పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము
తారకాసుర సంహార తరుణమని భావించి
పరమ శివునితో పరిణయ ప్రతినబూనె పార్వతి
పంచాగ్నుల మధ్యనుండి ఘోరతపమునాచరించె
పర్ణగా-అపర్ణగా అకుంఠిత దీక్ష దక్షపుత్రి
అరుణకాంతి మాయమాతె-అసితామయమాయె మేను
గురుతెరిగిన ప్రాణేశుడు కాళిని గౌరిని చేసెను
అభయ-వరద ముద్రలతో,త్రిశూలము-డమరుకముతో
పెద్దతల్లి గౌరమ్మ ఎద్దునెక్కి యున్న వేళ
నీ మ్రోలనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా
మానస విహారి! ఓ సౌందర్య లహరి.
స్కాంధపురాణము-మత్స్య పురాణము-శివ పురాణము గౌరి నామములో అమ్మ తత్త్వమును దర్శించింది.ఆహారమునకు దూరముగా-పంచేంద్రియ లోలత్వమునకు దూరముగా నుండి పరమేశుని భర్తగా పొందగలిగినది తల్లి.కనుక ప్రత్యాహార సమాధి సమాధి భాజాం అని కీర్తిస్తారు.నల్లనిఛాయతో ప్రకాశించే తల్లిని భర్త "కాళి" నల్లని దానా అని మేలమాడినాడని,అందులకు చిన్నబుచ్చుకొని తపమాచరించుటకు కైలాసమును వీడి వెళ్ళగా,ఆసమయమున ఆడి అను అసురుడు పాముగా కైలాస ప్రవేశమును చేసి(మాయా)పార్వతిగా మారెనని,శివుని చేతిలో ముక్తినొందెనను విషయమును నారదుని వలన విని, పార్వతి ప్రకటించిన కోపము సింహముగా మారినదని పార్వతి తెల్లని మేనిఛాయతో గౌరిగా ప్రకాశించించినదని,శివుడే కాళిని గౌరిగా చేసెనని ప్రచారములోనున్నది.
ఆహారమునకు దూరముగా ఉండుట ప్రత్యాహారము.దీనితోపాటు పంచేంద్రియములకు దూరముగా ఉండుట సమాధిస్థితి.వీనితో లోక కళ్యాణమైన గిరిజాకళ్యాణముతో,ఆశాపాశ క్లేశ వినాశినిగా,శబ్ద బ్రహ్మానందమయిగా,సత్య జ్ఞానందముగా,ఆది శంకర విరచిత "గౌరీ దశకము" కీర్తించుచుండగా,చెంతనే నున్న నా చేతిని విడిచి పెట్టకమ్మా.అనేక నమస్కారములు.