మీడుష్టమ శివతమ-02
*********************
న రుద్రో రుద్రమర్చయేత్-రుద్రుడు కానివాడు రుద్రుని అర్చించలేడు.దర్శించలేడు.దయను పొందలేడు.
ముముక్షువుగా మారాలని ముక్కుమూసుకొని కూర్చున్నాడు సాధకుడు.పక్కనే ఉన్న శివాలయమునుండి రుద్రము సుస్వరముతో వినిపిస్తోంది.
" నమః కృత్స్నవీతాయ ధావతే సత్వనాం పతయేనమః" అంటూ.
ఎవరీ కృత్స్నవీతుడు? ఎందుకు భక్తుల వెంట పరుగిడుతుంటాడు?దాని వలన వానికేమి ప్రయోజనము?సందేహములతో సతమవుతున్నాడు సాధకుడు.
ముందుగా సాక్షాత్కరించాడు రుద్రుడు మందహాసముతో.
కలయా/నిజమా అని తనను గిల్లుకొని చూశాడు సాధకుడు.
భ్రమ కాదు బ్రహ్మమే.ఆలోచనలో పడ్డాడు
ఎవడు వీడు? శత్రుసేనలను తానే చుట్టి,పరుగెత్తువాడును/సాత్వికుల కొరకు రక్షణగా వారి వెనుక పరుగెత్తువాడు వీడేనా? అన్నట్లు చూశాడు .
అర్థము చేసుకొన్నాడు రుద్రుడు.
బ్రహ్మము నుండి భావములు బహుముఖములుగా పయనిస్తూ బహిర్ముఖుని చేస్తున్నవి సాధకుని.
అడుగు, నీకు ఏమికావాలో, అనుగ్రహిస్తాను అంటున్నాడు రుద్రుడు.పైగా ఒకటికాదు,-రెండు కాదు, ఎన్నైనా కోరుకో.అనుగ్రహిస్తాను అంటున్నాడు రుద్రుడు.
అనాలోచితమయ్యాడు సాధకుడు క్షణముసేపు.ఆలకిస్తున్నాడు ఆలయములోనుంచి వస్తున్న సుస్వరమును నాటకమునకు నాందిగా. తేరుకున్నాడు.
రుద్రా!
మే-నాకు,నాకొరకు
శం-ఐహిక సుఖములు కావాలి.కనుక శంచమే.
ఐహిక శుఖములను పొందుటకు శరీరమునకు ఆహారము కావాలి.కనుక వాజశ్చమే.
ఆహారముతో పాటుగా నీరు కూడ కావాలి.కనుక అంబశ్చమే.
అన్న-పానాదులను అనుగ్రహిస్తాను.చాలా అంటు ఇరకాటములో పడేసాడు రుద్రుడు సాధకుని.
చాలా అంటే సరిపోదు.
తలదాచుకోవటానికి ఇల్లు కావాలి.కనుక-వస్యశ్చమే.
సరేఇల్లుకూడా ఇస్తాను.నేను వెళ్ళిరానా?అనగానే
భలేవాడివయ్యా రుద్రా! ఎన్నైనా అడుగు అన్నావు.మూడింటిని ఇచ్చి వెళ్ళిరానా అంటున్నావు.ఇయ్యలేకపోతే ఒద్దులే అన్నాడు సాధకుడు.
.
ముద్దుగా ఉన్నాయా మాటలు రుద్రుని.సరే ఇంకేమికావాలో కోరుకో.అనుగ్రహిస్తాను అన్నాడు.
గూటిలోనికి చేరిన తరువాత పూట-పూట కూడు కావాలి కదా.అందుకు వ్యవసాయము చేసుకొనుటకు,నాగలి-పరికరములు కావాలి కనుక-సీరంచమే.
అదీ ఇచ్చాను అన్నాడు రుద్రుడు.
అన్ని నేను పండించుకోలేను కదయ్యా.కావలిసిన వాటిని కొనుగోలు చేయుటకు ధనము కావాలి కనుక-ద్రవిణంచమే.
తథాస్తు-తథాస్తు అంటూ తరలిపోయాడు రుద్రుడు.
తనివితీర అనుభవించుటకు సిధ్ధమయ్యాడు సాధకుడు.
కదిలేది ప్రపంచము-కదలనిది పరమాత్మ.
అణువు అణువు శివమే-అడుగు అడుగు శివమే.
శివానుగ్రహముతో రేపు కలుసుకుందాం.
No comments:
Post a Comment