Monday, November 30, 2020

MEEDHUSHTAMA SIVATAMA-09

 మీఢుష్టమ శివతమ-09

***************
న రుద్రో రుద్రమర్చయేత్-రుద్రుడు కానివాడు రుద్రుని సేవింపలేడు.
తేలికపడిన మనసుతో నిద్రకుపక్రమించాడు సాధకుడు.
ఆటను మధ్యలో ఆపేస్తాడా రుద్రుడు తాను సంపూర్ణానుగ్రహమును అందించకుండా.అది ఎప్పటికిని జరగని పని.
"ప్రతరణాయచ-ఉత్తరణాయచ"
అందుకే జరుపుతున్నాడు పావులను పారమార్థిక చింతనవైపుకు.
" ఆత్మాచమే-శరీరానిచమే" అత్యద్భుతముగా ఆలపిస్తున్నారు చమకమును ఆలయములో.
అల్లకల్లోలమైన మనసుతో ఇదేమిటి? నిన్ననేగా అనుకున్నాము అహం ఏకో బ్రహ్మం అని అది నిజమైతే చమకము రుద్రుని ఆత్మను-శరీరమును అనుగ్రహించమని ఎందుకు అర్థించమంటున్నది?
ఆత్మ శరీరమునకు ఆధారమా?శరీరము ఆత్మకు ఆధారమా? అసలు వీటికి సంబంధము ఉందా?లేదా?
పిచ్చిగా పిచ్చిగాఉందంటు వచ్చి పచ్చిక మీద కూర్చున్నాడు.
పక్కననున్నవాడి రేడియోలో
వ్యాపారప్రకటన మొదలైనది.నల్లని జుత్తుకు ఫలానా తైలము వాడండి.ఫలితమును చూడండి అంటూ.మళ్ళీ రెండు ముక్కలు వినిపించాయో లేదో పచ్చని మీ శరీర కాంతికి..మిమ్మల్ని మీరే నమ్మలేరు.
యథాలాపముగా విన్నా యథార్థము తెలిసినది.శరీరమునకే ప్రాముఖ్యత కాని ఆత్మకు కానేకాదని అలవోకగా అర్థమయినది.
నమః ఆసీనేభ్య శ్శయనేభ్య్శ్చవో నమః.
నవ్వు తున్నాడు రుద్రుడు పచ్చికకాంతిని తాను అలుముకొని
,.రంగులో రంగు కలిసిపోయి ఉన్నదేమో నా ఎదురుగా పచ్చికలో పడుకుని పడీ పడీ నవ్వుతున్నాడు.సస్పింజరుడు.
ఎప్పుడొస్తాడో-ఎందుకొస్తాడో-ఎందుకు నన్ను ఏమారుస్తుంటాడో అంతే చిక్కదు.,
పరిహాసముగా నవ్వుతున్నాడు.
సాధకుడు చూస్తుంటే గంభీరముగా ఉంటున్నాడు.పక్కకు తిరుగగానే కిసుక్కున కొంటెగా నవ్వుతున్నాడు
అంత నవ్వెందుకు వస్తోందో తమరికి నన్ను చూడగానే? కినుకగా అడిగాడు సాధకుడు.కిక్కిరుమనలేదు రుద్రుడు.
ఈ రుద్రుని బెడదను వదిలించుకోవాలనుకున్నది వాని మందబుధ్ధి.
బాగా నిందించు . అవకాశమును అందిపుచ్చుకో గిచ్చుతోంది వాచాలత్వము. మరింత రెచ్చిపోతూ.,
పనీపాటా లేకపోతే నా వెంటపడాలా !ఏదో నిన్ను పలుకరించిన పాపానికి.ఇంతగా నన్ను విసిగించాలా?
.
నన్ను అడగకుండా, నాతో చెప్పకుండా, నా అనుమతిలేకుండా నేనెక్కడికి వెళితే అక్కడకు పిలువని పేరంటములా, మొన్న సముద్రతీరానికి,నిన్న ఆ తోటకు,నేడు ఈ పచ్చిక దగ్గరకు రావటమే కాకుండా, పైపెచ్చు, నేను నొచ్చుకునేల పగలబడి నవ్వటము చాల్లే! ఆపు! అంటు గదమాయించాయాడు రుద్రుని.గ్రక్కున ఆపేసాడు పాపం ఎంతైన భక్తపరాధీనత.సాధకుని దృష్టిలో అది అశక్తతత.
.ఆ చనువే కదా అనుంగు ప్రియము రుద్రునికి.
" నమో మహద్భ్యః క్షుల్లకేభ్యశ్చవో నమః"
అణిమాది మహిమలుగలవానిగా-అవి లేనివానిగా రెండు రూపములలో నున్న రుద్రుడు శాంతముగా,
సరే సాధకా! నీకు ,నేను నీతో చెప్ప పెట్టకుండ రావటము ఇష్టము లేకుండాఉందికదా.కాని,
ఇప్పుడే నువ్వు గొప్పదని తీర్మానించుకున్న నీ శరీరము మాత్రము నీ చెప్పుచేతలలో ఉందా? ఒక్కసారి ఆలోచించు.దానిని ఆజ్ఞాపించు.నీ ఆనతిని జవదాటకుండా ఉంటుందేమో చూద్దాము.
ఈ విషయము విన్నాడు నాకు తెలియకుండానే నా ఎదురుగా వెచ్చగా పచ్చికలో పడుకుని.ఎర్రబడ్దది సాధకుని ముఖము..
కోపమెందుకులే! కాసేపు నీతో ఆడుకుని వెళ్ళిపోతాను అన్నాడు రుద్రుడు అతివినయముగా..ఒక్క ఆట మాత్రమే! సరేనా! బెట్టు చూపాడు సాధకుడు గట్టిదెబ్బే తగలబోతోందని తెలియక.
గుట్టుగా నవ్వాడు రుద్రుడు.
అదే నువ్విక్కడనే కూర్చొని,
నీ శరీరమును నీవు చెప్పేటట్లు చేయి.ఒక్కసారి చూసివెళ్ళిపోతాను.మళ్ళీ రాను అనగానే,
ప్రారంభించాడు సాధకుడు శరీరమా నేనే నీ అధికారిని..నిన్ను చూస్తున్నవాడిని..పోషిస్తున్నవాడిని.లే,లేచి పరుగెత్తు వేగముగా... ఉహు .కూర్చున్నవాడు కూర్చున్నట్లే ఉన్నాడు.కాళ్ళు హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాయి.గట్టిగా అడుగుతుంటే వినటములేదని రుద్రుడు వినకుండా మెల్లగా బతిమలాడుతున్నాడు వాటిని.నా పరువు తీయకండని
.అసలు లెక్కచేస్తే కదా అవి వాడిని.
అహం అదృశ్యమవుతోంది.
ఇహ పాఠం ప్రారంభం.
ఇది గోచరము కాని అవిధేయము తనలో తాను గొణుగుతున్నాడు.
అవునా.ఇది ఒక బుడగ.తరువాత పిండమై-గర్భస్థ శిశువై-శిశువై-నాలుగవస్థలను దాటుతూ నిన్ను దాటించే ఉపాధి.
వింతగా వింటున్నాడు సాధకుడు.అది నిన్ను అడిగి బుడగగా నీ దగ్గరికివచ్చిందా?
లేదు.
పోనీ నిన్ను అడిగి నీ అనుమతితో తన దశలను మారుస్తున్నాదా?
లేదు.
కనీసము ఈ తేది నుండి నువ్వు వృధ్ధుడివి అని సమాచారమైన ఇస్తున్నదా?
లేదు.లేదు.లేదు.
నీ శరీరములోని మార్పులు నీకు చెప్పకుండా.నిన్నడగకుండా-నీ అనుమతి లేకుండా చేస్తున్నదానినేమనవు. నన్ను మాత్రం.....
అయ్యో రుద్రా! ఏదో అలా అనేశాను. మనసులో పెట్టుకోకు.అనగానే, అదే అదనుగా రుద్రుడు,
వినక ఏం చేస్తాడులే? కిక్కిరుమనకుండా పడిఉంటాడని శరీరము యొక్క ధీమా.తెలిసిందా.
అయితే.. అయితే..
అటువంటి దానినెందుకు చమకము అర్థించమంటున్నది?
అంతా అయోమయం.ఆ రుద్రుడే దానికి సమాధానం.
" నమో మంత్రిణే వాణిజాయ కక్షాణాం పతయే నమః."
అది ఒక" ఒ.టి.పి.ఒక ముఖ్యమైన పనికి". అందుకే అర్థిస్తున్నారు.
ఎటో వెళ్ళిపోతున్నాయి ఆలోచనలు సాధకునికి.
అటే వాటిని మళ్ళిస్తున్నాడు రుద్రుడు.
కదిలేవి కథలు-కదిలించేది కరుణ.
అణువు అణువు శివమే-అడుగు అడుగు శివమే.
శివానుగ్రహముతో రేపు కలుసుకుందాము.
ఏక బిల్వం శివార్పణం.
చిత్రంలోని అంశాలు: అగ్ని
నచ్చింది
వ్యాఖ్య
భాగస్వామ్యం చేయి

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-13

. తనోతు నః శివః శివం-13 ****************** " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వ...