మీఢుష్టమ శివతమ-07
*********************
న రుద్రో రుద్రమర్చయేత్-రుద్రుడు కానివాడు రుద్రుని దర్శింపలేడు.దయను పొందలేడు.
మతిశ్చమే-సుమతిశ్చమే,
పాపము రుద్రుని తప్పుగా అనుకున్నాను.తిప్పలు పెడుతున్నాడని భావించాను.పూర్తిగా వినకుండా తొందరపడ్డాను.మంచివాడే-మనవాడే .కాని అలిగాడు కదా.ఆ రోజు దూరముగా వెళుతూ కనపడితే వెనకాల పరుగులుతీసి పట్టుకొని తీసుకొచ్చి పక్కన కూర్చోపెట్టుకున్నాను.అల ఏమితో-జలమేమిటో విశదపరిచాడు.
కాని మళ్ళీ కనపడటం లేదు.
ఈసారి కనిపిస్తే ఆవేశపు మాటలకు ఆలోచన ఎక్కడ ఉంటుందయ్యా? నువ్వు భీష్మించుకొని రాకపోతే ఎలా అని బతిమలాడతాను అనుకుంటున్నాడు.
అమ్మో! అప్పుడే కథ ముగిస్తే ఎలా? ఇప్పుడేగా మొదలైనది.
సాధకునితో ఆడుకోవాలనుకున్నాడు రుద్రుడు.
క్రీడాశ్చమే-మోదశ్చమే.
ఆడుకునే వాడు వాడే-ఆదుకునేవాడు వాడే.
అదుకోవటానికే ఈఅల్లరితనమనే ఆటలే కదా అజ్ఞానమునకు చెల్లుచీటి వ్రాసేది.
ఆలయ ఆవరణము కిక్కిరిసిపోయి ఉంది
.ప్రసిధ్ధ భాగవతారు పురాణమును చెబుతున్నారు.పురివిప్పిన నెమలులా అన్నట్లు ఆనందిస్తున్నారు శ్రోతలు.
" అపుత్రస్య గతిః నాస్తి"
సంతానములేనివారికి సద్గతులు ఎక్కడివి?
అంటు గృహస్థాశ్రమ ధర్మములు-సంతాన ప్రాముఖ్యము వివరిస్తున్నారు భాగవతారు సాధకుని ఆలోచనలను తారుమారు చేస్తూ.
చిత్తంచమే-ఆధీనంచమే.
ఇప్పుడే తలుచుకున్నాను కదయ్యా నీ మంచితనము గురించి.అమ్మో అమ్మో ఎంతటి మోసం?
నాకు సంతానము గురించి చెప్పనే లేదు.అడిగే అవకాశమే కల్పించనేలేదు.
క్షణములో నీమాయనుండి తప్పించుకున్నాను.దేవుడు నాయందుండబట్టి.
ఇప్పుడు నాకు ఉన్నట్లున్నట్లు మంచి భార్య ఎక్కడి నుండి వస్తుంది.?సత్సంతానము నేనెలా పొందగలను?నా పెద్దలనెలా తరింపచేయగలను?
అంతలోనే ఉక్రోషముతో ఊగిపోతూ,ఉన్నాడుగా ఆ పెద్దమనిషి.కాదనకుండా కనికరిస్తానంటాడుగా.ఇచ్చిన మాట తప్పలేనంటాడుగా.
ఇవ్వకేంచేస్తాడు? నవ్వుతూ అడిగితే. అనుకుంటుండగానే,
నిన్ను వదిలి నేనుండగలనా? నీ సాధక-బాధకములను పట్టించుకోకుండా వదిలివేయగలనా? అంటు రానే వచ్చాడు రుద్రుడు.
అనుకున్న ప్రకారము కోపమును మింగేసి,రుద్రానేను కొత్తగా "అపుత్రస్య గతిర్నాస్తి" అని విన్నానయ్య.అది నిజమే ననుకుంటున్నాను
కరుణ నిండిన నేత్రములతో కావాలా? అని అడిగాడు రుద్రుడు.
కరములు జోడించి,
" గర్భాశ్చమే-వత్సాశ్చమే" అర్థించాడు సాధకుడు.
నెగ్గాననుకుంటున్నాడు సాధకుడు.
ముగ్గులోకి దింపాడు రుద్రుడు.
అవశ్యము అవశ్యము అంటు అంతర్ధానమయ్యాడు రుద్రుడు.
కదిలేవి కథలు-కదిలించేది కరుణ.
అణువు అణువు శివమే-అడుగు అడుగు శివమే.
శివానుగ్రహముతో రేపు కలుసుకుందాము.
ఏక బిల్వం శివార్పణం.
No comments:
Post a Comment