మీఢుష్టమ శివతమ-06
****************
న రుద్రో రుద్రమర్చయేత్-రుద్రుడు కానివాడు రుద్రుని ర్చించలేడు.
చమత్కారి రుద్రుడు ఏవిషయము సూటిగా చెప్పడు.అలాగని చెప్పకుండా నన్ను ప్రశాంతముగా ఉండనీయడు.
అల అంటాడు-జలమంటాడు.ఆ రెండింటికి కడలి మూలమంటాడు.కాదంటే అవునంటాడు/అవునంటే కాదంటాడు నన్ను తికమకపెట్టకపోతే తోచదేమో.
అలను చూస్తున్నాడు-జలమును చూస్తున్నాడు.రెండు ఒకటిగానే కనిపిస్తున్నాయి-అనిపిస్తున్నాయి.కాని కాదంటాడే ఆ రుద్రుడు.
గొప్ప చిక్కే వచ్చింది.నిన్నేగా మళ్ళీ రావద్దన్నాను.వస్తాడో?రాడో.?
ఇదే అదనుగా దూరముగా వెళ్ళిపోతూ కనిపించాడు రుద్రుడు.పిలుస్తాను.
ఇప్పుడు పంతమునకు పోతే ఎలా? అవసరము నాది.
ఓ రుద్రా! ఆగవయ్యా.కనీసము ముఖమైనా చూపకుండా వెళ్ళిపోతున్నావు ఎందుకయ్యా?
ముసిముసిగా నవ్వుకుంటూ నువ్వేగా ఎవరిదారి వాళ్ళదని అన్నావు.నాతో నీకేం పని? అంటూ అడుగుల వేగం పెంచాడు గడుసువాడు.
రుద్రుని పట్టుకోవటానికి సాధకుడు నడక వేగమును పెంచాడు.పరమార్థమును వెతుక్కుంటూ పరుగులు తీస్తున్నది జీవము.పట్టుకోవాలని సాధకుడు-పట్టుబడకూడదని రుద్రుడు.పరమాద్భుతముగా పాదములను కదుపుతున్నారు.
.
పట్టివిడువరాదు నాచేయి పట్టివిడువరాదు అని వినిపిస్తోంది రేడియోలో. .బెట్టు సడిలించి పట్టుబడిపోయాడు రుద్రుడు.చెయిపట్టుకుని తీరము వైపుకు తీసుకొని వెళ్ళాడు సాధకుడు. కరుగుతున్నది కరుణ సంద్రము. ఇద్దరు ఇసుకలో కూర్చున్నారు.
ఇంతలో ఉవ్వెత్తున నురగలతో ఉరకలు వేస్తూ,గంభీరముగా ఘోషిస్తూ కెరటములు ఒకదానినొకటి తోసుకుంటు వస్తున్నాయి.
చిరునవ్వుతో రుద్రుడు సాధకుని చూస్తూ,కడలి జలము కొంతసేపు తన అందాన్ని తాను చూసుకోవాలనుకుంటోంది.తన గొంతును తాను వినాలనుకుంటున్నది.తన హొయలును చూసి పరవశించాలనుకుంటున్నది.కెరటములుగా కొత్తరూపును దిద్దుకుంటున్నది..
కాని ఆరూపు కొన్నిక్షణములే
.ఆ పరుగులు కొంతవరకే.మళ్ళీ తన స్వస్వరూపమును పొందుతుంది ఆ జలము.కడలిలోచేరి.
విచిత్రముగా చూస్తున్నాడు సాధకుడు కడలిని!.దూరమేమిటి?కాలమేమిటి? అడిగాడు రుద్రుని.కడలి అనే అధికారి అలలు అనే అసహాయశీలురకు తీరమువరకు మాత్రమే ఉప్పొంగే అనుమతినిచ్చింది.
ఆ అలల మిడిసిపాటు అవి తీరమును చేరువరకే.వాటికి ఆ విషయము తెలిసినప్పటికిని,ముందున్న కెరటమును తోసుకుంటూ,పక్కనున్న కెరటమును నెట్టివేస్తూ,వెనుకనున్న కెరటమును అడ్డగిస్తూ అవి తమ సహజ స్వభావమును చూపిస్తూనే ఉంటాయి.పాపం తీరము రాగానే అన్నీ సమిసిపోయి సముద్రజలమైపోతాయి.అంతే.అంటు చేతులు దులుపుకొని లేచాడు రుద్రుడు.
ఆకళింపు చేసుకుంటున్నాడు సాధకుడు.మనము చూస్తున్న అలలలో ఏది దేనికి మిత్రుడు?శత్రువు?
అయితే నన్ను ఎగతాళిచేసినవాడు-ఉరిమిఉరిమి
చూసినవాడు-ఎక్కిరించినవాడు-నేను అందరము ఈ అలలమేనా? అనుకుంటూ.
ప్రశాంతముగా కడలిని చూస్తున్నాడు సాధకుడు.
ప్రభావితమైనాడు అనుకుంటు కదిలాడు రుద్రుడు.
కదిలేవి కథలు-కదిలించేది కరుణ.
అణువు అణువు శివమే-అడుగు అడుగు శివమే.
శివానుగ్రహముతో రేపు కలుసుకుందాము.
ఏక బిల్వం శివార్పణం.
No comments:
Post a Comment