మీఢుష్టమ శివతమ-12.
********************
న రుద్రో రుద్రమర్చయేత్-రుద్రుడు కానివాడు రుద్రుని దర్శించలేడు-దయను పొందలేడు.
హిరణ్యము కంటె క్షేత్రము విలువైనదా/క్షేత్రము కంటె హిరణ్యమా?
ఆలయములో నుండి " అశ్మాశ్చమే-మృత్తికాశ్చమే" అని చమకము ,తనతో మమేకము కమ్మన్నట్లుగా వినిపిస్తూ,.తనదగ్గరికి రమ్మన్నట్లుగా అనిపిస్తోంది.
అంటే గట్టి రాళ్ళనేలయందు-మెత్తని నల్లరేగడి నేలయు తానైన పరమాత్మను యజ్ఞసాధనకు-సామర్థ్యమునకు అర్థించమంటున్నదా? ఏమో?
విహారయాత్రో/విజ్ఞానయాత్రో బస్సునుండి బిలబిలమంటు దిగారు విద్యార్థులు.వారితో పాటుగా ఉపాధ్యాయులు.వారిలో ఒక పెద్దాయన ఒక తెరను-ప్రొజెక్టరును అమరుస్తున్నాడు.అందరు ఆసక్తిగా అతనినే చూస్తున్నారు.
" అదాభ్యశ్చమే"
ప్రాణులకు వెలుగు నిచ్చుటలో అలసటలేని వానివలె ఉన్నాడు ఉత్సాహముగా.
కదలాలనిపించటములేదు సాధకునకు.
కథా-కమామిషు చూద్దామనిపిస్తోంది.
వృక్షాశ్చమే.
చిత్రము మొదలైనది.ఒకతను చేతిలో మఱ్ఱి విత్తనమును మనకు చూపించి భూమిలో నాటాడు.నీరు పోసాడు.రోజూ వచ్చి చూసి పోతున్నాడు.దానికి కంచె కట్టి కాపాడుతున్నాడు
.
రీలు వేగముగా తిరుగుతోంది.విత్తనము మొలకగా-మొక్కగా-వృక్షముగా-మహావృక్షముగా తన నామ రూపములతో పాటు స్వభావమును కూడా మార్చుకుంటోంది.
విరామం అన్నారు
.మెదడుకు మేత అంటు పెద్దాయన చూసినవారికి ఒక ప్రశ్నను వదిలాడు.మీరు చూసిన వాటిలో కొన్నింటిలో మార్పు ఉంది.మరి కొన్నింటిలో లేదు.ఏమిటవి?
వారు తెచ్చుకున్న ఆహారముతో పాటుగా ఆలోచనలను తింటున్నారు.ఆదుకుంటున్నారు-పాడుకుంటున్నారు.
పెద్దాయన అడిగిన ప్రశ్నకూడా తోడుగానే వీడకుండా ఉంది
మళ్ళీ ఆట మొదలైనది.
కొందరి కళ్లలో ఆనందము..జవాబు చెప్పే ఆతురత..మరి కొందరి కళ్లలో ఆసక్తి.ఏమి చెబుతారో? అని.
ఇప్పుడేకాదు అన్నాడు రుద్రుడు ఇంకొంచం కుతూహలమును పెంచుతూ.,,కంగారుగా చూస్తున్నాడు సాధకుడు.
.కళ్లు నులుముకొని మరీ మరీ చూస్తున్నాడు సాధకుడు..
"చిత్రం బాగుందికదా"
పక్కనే కూర్చుని తనను పలుకరిస్తున్నాడు రుద్రుడు.ఖంగు తిన్నాడు సాధకుడు.
చిత్రములో కాలము గిరగిర వేగముగా తిరుగుతోంది.
విత్తనము-మొలక-మొక్క-మఱ్ఱి వృక్షము-మహావృక్షముగా మారిపోయి ఊడలతో విస్తరించి తనను ఇన్నివిధములుగా మారుటకు సహకరించిన భూమికి నంస్కరిస్తున్నా యన్నట్లున్నది.
తనకెన్ని రూపములు-ఎన్ని పేర్లు-ఎన్ని పనులు.తన ఊడలతో తనకు రూపమిచ్చిన క్షేత్రమునకు
నమస్కరిస్తున్నదది.
కాల నిర్ణయము కాదనలేనిది కనుక అది కొన్ని విత్తనములను తన ప్రతిరూపములుగా అందించి,నేలకూలినది.నేలలో దాగినది.ఇప్పుడు అక్కడ చెట్టులేదు-దాని పట్టులేదు.
అర్థమయినా? అడిగాడు రుద్రుడు.
అదే అదే నసిగాడు సాధకుడు.
విత్తు నుండి తిరిగి విత్తు వరకు మారుటకు మధ్యలో ఎన్నో రూపాలు-నామాలు-కర్మలు.అది ప్రకృతి.
భూమి మాత్రము నిర్వికారము.చెట్టుకు సహకారము.అది పరమాత్మ.
త్రిస్రశ్చమే-త్రిస్రశ్చమే అని వినబడుతోంది సాధకునికి.
అదేనయ్య నశించేది-నశించనిది-వాటిని నడిపే పరమాత్మ మూడు మనము చూశాము కదా!
కనుగొన్నామంటున్నాయి అక్కడివారి కరతాళధ్వనులు.
మట్టివాసనను పీలుస్తున్నాడు సాధకుడు
చుట్టివస్తాను లోకాలను అని కదిలాడు రుద్రుడు.
కదిలేవి కథలు-కదిలించేది కరుణ.
అణువు అణువు శివమే-అడుగు అడుగు శివమే.
శివానుగ్రహముతో రేపు కలుసుకుందాము.
ఏక బిల్వం శివార్పణం
No comments:
Post a Comment