ఐదవ పాశురం
***************
మాయనై మన్ను వడమదురై మైందనై
తుయపెరునీర్ యమునై యరైవరై
ఆయర్ కులత్తినిల్ తోన్రుం మణివిళక్కై
తాయై క్కుడల్ విళక్కం శెయద దామోదరనై
తూయోమాయ్ వందు నాం తుమలర్ తూవి త్తుళుదు
వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క
పోయ పిళైయుం పుగుదరువా నిన్రనవుం
తీయనిల్ తూశాగుం శెప్పు ఏలోరెంబావాయ్.
ఓం నమో భగవతే వాసుదేవాయ.
ఎంపావాయై
- మన వ్రతములో ఈ రోజు,
మనము దామోదరుని దగ్గరనుండి ఒక వరమును అడిగి అనుగ్రహించమని గట్టిగానే అడుగుదాము అంటున్నది గోదమ్మ గోపికలతో.
ఈ పాశురములో గోపికల వాక్చాతుర్యము-త్రికరణశుధ్ధి-గడుసుదనము కలగలిసి స్వామినే సెప్పు-గట్టిగా చెప్పు అని అడుగుతున్నవి.స్వామి వారికి ఏమని చెప్పాలో తెలుసుకొనే పయత్నమును చేద్దాము.
గోదమ్మ స్వామిని,
మైందనై-అని పిలుస్తున్నది.
బాహ్యమునకు ఓ బాలకా అని ధ్వనిస్తున్నప్పటికిని,
ఓ మూలమా/ ఓ పరబ్రహ్మమా/ ఓ నాయకా అని స్పష్టముగా ప్రతిధ్వనిస్తున్నది.
కనుకనే వెంటనే-మాయినై అని -స్వామి నీ యొక్క,
మన్ను-లీలా విభూతులు, వర్ణింపశక్యము
కానివి అంటున్నది.
ఏమి తెలియని వాడిలా మందహాసము చేయకు, ఇప్పటి వరకు మధురగా పరిగణింపబడుచున్న విల్లిపుత్తూరు దక్షిణ మధురైగా-ఉత్తర మధుర వైభవమును ప్రస్తుతించుచున్నది.
వడ-ఉత్తర భాగముననున్న,
మధుర-ఇది గుణ సంకేతక నామము.
ఎక్కడ మాధవుడుంటాడో/తన విభవమును ప్రకాశింప చేస్తుంటాడో/చివరికి స్వామి అనుగ్రహ అనుభూతులతో నిండిన మన మనస్సు కూడ నిస్సందేహముగా మధురయే.
ఇప్పుడు ఉత్తర మధుర స్వామి పాదస్పర్శచే-క్రీగంటి చూపులతో-ఆటపాటలతో- విరహముతో-సరసముతో-అనురాగముతో అనేకానేక మధురానుభవములతో/మధురానుభూతులతో మమేకమైన మంగళకర ప్రదేశము.
అక్కడనున్న,
తుయర్-పవిత్రమైన
పెరు-పుష్కలమైన
నీర్-జలములతో నిండిన
యమునై-యమునా నది ధన్యతనొందినది.
దానిరేవు కాపరి మన స్వామియే కదా.
దానికేకాదు మాకును కాపరివైన స్వామి,మాపై దయతో,
మేమా-
శ్రుత-వినికిడిజ్ఞానమే తప్ప,
శృతి-వేద సాహిత్య పాండిత్యములు
లేనివారము.మరియును,
ఆయర్-గొల్లల
కులత్తిల్-కులము వారము.
ఏ విధముగా,
తాయై-మా అమ్మ యశోదమ్మ
కుతల్-గర్భము(దీపము) నకు నీ ప్రకాశముతో
విళక్కుం సెయిద-ప్రజ్జ్వరిలింపచేసి,ధన్యత నందించినావో,
ఏవిధముగా,
చిన్న చిన్న తాటిముక్కలను జోడించి నిన్ను బంధించిన ఆమె భక్తికి వశుడవై బంధింపబడి,ఉదరమును దామముతో (భతి అనే తాడుతో)కట్టబడి,దామోదరుడవైనావో,
అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం
రామనారాయనం జానకీ వల్లభం.
కారుణ్యసాగరా,
మాకు ఒక మాటనివ్వు.
అది ఏమిటంటే,మేము,
తూమోం-నిష్కళంక మనస్కులమై,
గోదమ్మ ఇంద్రియములను నిగ్రహించుకొనుటను రెండవ పాశురములో సెలవిచ్చినది.
ఇప్పుడు వాటిని ఎలా ఉపయోగించుకోవాలోశాంతి-క్షమ-దయ-ధర్మం-సత్యం-శ్రద్ధ మొదలగు సుగుణభరిత సుగంధ పుష్పములను కరములందుంచుకొని,
నాం-మేము
వందు-వచ్చాము.వచ్చి,
గోదమ్మ మనకు సంకీర్తనభక్తి తత్త్వమును దాని సార్ధకతను చెప్పుచున్నది.
వాయినాల్-నోరార
పాడి-కీర్తించి,
నీ గుణవైభవమును నోరార కీర్తిస్తాము.అదియును,
మనత్తినాల్-మనసార
నీ దివ్యమోహన మంగళ స్వరూపమును
శిందిక్కై-ప్రతిష్ఠించుకొని,మనసా-వచసా-కర్మణా
,
తొళిదు-అర్చిస్తాము ప్రీతితో.కాతేన వాచ మనసేంద్రియాణాం అంటు.
.ఎందుకంటే అప్పుడు,
పోయ-గతములో చేసిన
పిళియుం-పాపములు
మరియును
పాపములను చేయరాదని తెలిసికొనినను,
మాకు తెలియకుండానే-చేస్తున్నామని అనుకోకుండానే
చేయుచున్న దోషములను/తప్పులను,
ఏ విధముగా,
తూక్-ఎండుగడ్డి
తుయినిల్-అగ్నిలో దహింపబడుతుందో,
అదే విధముగా దహింపబడుతుందని సెప్పు-మాతో గట్టిగా చెప్పు అని అంటున్న గోపికలను నడిపించుచున్న గోదమ్మ చేతిని పట్టుకుని మనము మన అడుగులను కదుపుదాము.
ఇంతటితో అభిముఖ దశను ముగించుకొని గోదమ్మ తో పాటుగా మనము అడుగులను కదుపుతు ఆశ్రయణ దశలోనికి ప్రవేశిస్తున్నాము.
ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.